పరీక్షలపై నిఘాకు డ్రోన్ ఇన్విజిలేటర్లు!
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లు, స్క్వాడ్లు ఉంటారు. అయినా.. విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో వారిని బురిడీ కొట్టిస్తుంటారు. అందుకే.. చైనాలో విద్యాశాఖ అధికారులు ఏకంగా మానవ రహిత గగనతల వాహనాల(డ్రోన్స్)నే రంగంలోకి దించారు. ‘ఇన్విజిలేటర్ డ్రోన్స్’గా పిలుస్తున్న వీటిని ఆదివారం నుంచి ల్యూయాంగ్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘గవోకవో’ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ఉపయోగించనున్నారు.
కాపీ కొడుతూ దొరికిపోతే మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేస్తారు. అయినా విద్యార్థులు టెక్నాలజీతో మాయ చేస్తుండటంతో ఈ డ్రోన్స్‌ను ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే.. పరీక్ష హాలు మీదుగా, చుట్టూ నిరంతరం చక్కర్లు కొడతాయి. 360 డిగ్రీల కోణంలో ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేస్తాయి. సెల్ఫోన్లు, రహస్య స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ఉపయోగిస్తే వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నళ్లను పసిగడతాయి.
ఒక్కో డ్రోన్ ఒక్కో విడతలో 30 నిమిషాల పాటు గాలిలో ఎగురుతూ సిబ్బందికి సమాచారం అందజేస్తూ ఉంటుంది. పరీక్షలపై నిఘాకు ఇంత కసరత్తా? అంటే ఆ పరీక్షలే అలాంటివి మరి! మనకు ఎంసెట్, ఐఐటీ ప్రవేశపరీక్షలు ఎలానో.. చైనీయులకు కూడా గవోకవో పరీక్షలు అలాంటివే. ఉన్నత విద్యలో ప్రవేశం కోసం జరిగే ఈ పోటీ పరీక్షలకు ఏటా 90 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారట!