LKG student
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్!
పెరవలి: ముక్కుపచ్చలారని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా చితకబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన చేబ్రోలు అనిల్‌కుమార్ కుమారుడు పెరవలి మండలం కానూరు గ్రామంలోని రమా గాయత్రి ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన సమయంలో ఏడుస్తున్న ఆ విద్యార్థి ఆటో నుంచి దిగలేదు. దీంతో ఉపాధ్యాయుడు అశోక్ వచ్చి, ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబు ఏడుస్తుండడంతో ఆరా తీయగా మాస్టారు కొట్టారంటూ వీపుపై ఉన్న గాయాలు చూపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని శుక్రవారం రాత్రి పెరవలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి అనుమతి తీసుకుని, కేసు నమోదు చేయాల్సి ఉందని, అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. -
ఎల్కేజీ ఫ్రెండ్‌ను దగ్గర చేసిన ఇన్స్టాగ్రామ్
చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో తన కథను వీడియో రూపంలో వివరించింది. తాను తన లోవర్ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు. ఇందుకోసం తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్‌లు చేస్తూ, ఫొటోలను చెక్ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్‌లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్ సోషల్ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు. -
అక్షరాలు రావు.. అంకెలు తెలియవు!
నగరంలోని ఎల్బీనగర్కు చెందిన నర్సయ్య తన కుమారుడు నవీన్ కుమార్‌ను ఇంటికి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నాడు. గతేడాది ఎల్కేజీ పూర్తయి యూకేజీకి రాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ పద్ధతిలోనే తరగతులు కొనసాగాయి. ప్రతిరోజూ ఆన్లైన్ తరగతుల్లో వాట్సాప్‌లో వర్కౌట్ వస్తుండటంతో తల్లిదండ్రులు దగ్గరుండి పూర్తి చేసి సకాలంలో పంపించి టీచర్లతో కుమారుణ్ని శభాష్ అనిపించుకునేవారు. విద్యా సంవత్సరం పూర్తయింది. నవీన్‌కుమార్ ఫస్ట్ క్లాస్‌కు కూడా ప్రమోటయ్యాడు. సమీపంలోని ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చేర్పిద్దామని నర్సయ్య తన కుమారుణ్ని తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సిపాల్ వెంటనే అడ్మిషన్ ఇవ్వకుండా ఫార్మాలిటీగా ఒక చిన్న పరీక్ష పరీక్ష పెట్టాడు. కుమారుడు చిన్నచిన్న పదాలే కాదు.. అక్షరాలు, అంకెలు, సంఖ్యలు గుర్తించక పోవడంతో తండ్రి కంగుతినక తప్పలేదు. ఇది ఒక నర్సయ్య కుమారుడి పరిస్ధితే కాదు..ఆన్లైన్ ద్వారా చదువుకొనసాగిస్తున్న చాలామంది చిన్నారులది ఇదే దుస్ధితి. సాక్షి, హైదరాబాద్: అక్షరాభ్యాసం పునాది పటిష్టంగా ఉంటేనే భవిష్యత్ చదువు పక్కాగా ఉంటుంది. అక్షరం, అంకెలు మెదడులో బలంగా నాటుకుంటాయి. కరోనా వైరస్‌తో చిన్నారుల చదువుల పునాదులపై దెబ్బపడింది. గతేడాది కాలంగా చిన్నారుల చదువులు సరిగా సాగలేదు. తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి గడువు సమీపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త అకడమిక్ ఇయర్లో ఫస్ట్, సెకండ్ క్లాసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ జోరందుకుంది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో గతేడాది మాదిరిగా ఈసారి కూడా ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన సాధ్యమయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. అక్షరాభాస్యం చేసే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు బోధన ప్రశ్నార్థకమైంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతా ఆగమాగం.. చిన్నారుల చదువులను కోవిడ్ ఆగమాగం చేసింది. కరోనా వైరస్ ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదంతా ఫస్ట్, సెకండ్ క్లాసులకు ఆన్లైన్లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ బోధన జరగలేదు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్దలు మాత్రం నర్సరిలో అడ్మిషన్లు లేకపోవడంతో ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్, సెకండ్ వారికీ ఆన్లైన్ బోధన పేరుతో ప్రతిరోజూ పేరెంట్స్ వాట్సాప్‌లకు వర్క్ïÙట్స్ పంపించి వాటిని పూర్తి చేసి తిరిగి వాట్సాప్ చేసేలా తరగతులను కొనసాగించారు. దానికి తగ్గట్టుగానే పేరెంట్స్ నుంచి భారీగానే ఫీజులు వసూలు చేశారు. వాస్తవంగా చిన్నారుల పేరుతో తల్లిదండ్రులే సకాలంలో వర్క్‌షీట్ అసైన్మెంట్ పూర్తి చేసి పంపిస్తూ వచ్చారు. అంతలో విద్యా సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించకపోగా, ప్రైవేటులో మాత్రం మొక్కుబడిగా ఆన్లైన్ ద్వారా సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ కూడా తల్లిదండ్రులే పిల్లలతో చూచిరాతలు రాయించారు. కరోనా నేపథ్యంలో అందరితో పాటు చిన్నారులు సైతం పైక్లాసులకు వెళ్లారు. అక్షర జ్ఞానం శూన్యం.. పాఠశాలల్లో టీచర్ల ద్వారా ప్రత్యక్ష బోధన పద్ధతిలో అక్షరాభ్యాసం వేరు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణలో చదువు వేరు. పిల్లలు మాటలు వినని పరిస్థితి. తల్లిదండ్రుల ఒత్తిడి కూడా పెద్దగా ఉండదు. గతేడాది చిన్నారులు కనీసం పుస్తకాలు ముట్టకుండా.. అక్షరం ఒంటపట్టకుండానే పై తరగతులకు ప్రమోటయ్యారు. ఇక సర్కారు స్కూల్‌తో పాటు ప్రైవేటు విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరందరూ సంఖ్యలు, అంకెలు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని సాక్షాత్తూ పేరెంట్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాదాపు ఏడాదిన్నర పాటు బడులు, పాఠాలకు దూరమైన చదువుపై చిన్నారుల ఆసక్తి తగ్గిందన్న అభిప్రాయం పేరెంట్స్‌లో వ్యక్తమవుతోంది. అక్షరాభ్యాసం సరిగ్గా లేకపోతే దాని ప్రభావం భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారిపై టీచర్ అమానుషం
హైదరాబాద్, జీడిమెట్ల: ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బోర్డు వైపు చూడడంలేదన్న కారణంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు చేయిచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన మేరకు.. చింతల్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి కుమారుడు రత్నవర్దన్‌రెడ్డి(6) ఏన్‌ఆర్‌ఐ టాలెంట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం రత్నవర్ధన్ బోర్డు వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడన్న నెపంతో టీచర్ సునీత రత్నవర్దన్ చేతులపై కొట్టింది. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి చూసేసరికి విద్యార్థి చేతులపై వాతలు ఉన్నాయి. టీచర్ సునీతను అడగగా క్లాసులో బోర్డు వైపు చూడటంలేదని సమాధానం చెప్పింది. దీంతో విషయంపై బాలుడి తండ్రి ప్రశాంత్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీచర్‌పైవెంటనే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
ఆరేళ్లకే...నూరేళ్లు నిండిపోయాయా తల్లీ!
ఆ చిన్నారికేం తెలుసు... ఆ రోజే తనను మృత్యువు కబళించబోతోందని. ఆ ఇటుకల ట్రాక్టర్ తన పాలిట మృత్యుశకటమవుతుందని. బడికి సెలవని తెలీక... అదే తనకు చివరి రోజని ఊహించక... తెల్లారి లేచి చక్కగా యూనిఫాం వేసుకుని... పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని అమ్మా... నాన్నకు... టాటా చెప్పింది. అదే చివరి పిలుపని ఆ తల్లిదండ్రులూ ఊహించలేదు. శృంగవరపుకోట మండలం వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజు కళ్లాల వద్ద జరిగిన ఈ దుస్సంఘటన కన్నవారినే కాదు... విన్నవారిని సైతం కన్నీరు పెట్టించింది. గ్రామమంతానిర్ఘాంతపోయింది. శృంగవరపుకోట రూరల్:ఎస్.కోట–విజయనగరం ప్రధాన రహదారిలో వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాల వద్ద ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ఏపీ 35 వై 4093 నంబర్ గల ట్రాక్టర్ ఢీకొనడంతో యూకేజీ విద్యార్థిని తమటపు ప్రత్యూష (6) అక్కడికక్కడే కన్నుమూసింది. ట్రాక్టర్ నడుపుతున్న తాండ్రంగి వాసు (17) సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. గురువారం ఉదయం 9.30 సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులు, ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాలకు చెందిన తమటపు ప్రత్యూష స్థానికంగా ఉన్న శ్రీసత్యసాయి హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజులాగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు బాబూజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా సెలవు అని చెప్పడంతో ఇంటిముఖం పట్టారు. ఇంటికి వస్తున్న దారిలో గల ఒక షాపు వద్ద విద్యార్థిని ప్రత్యూష తినుబండారాలు కొనుక్కొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విజయనగరం వైపు నుంచి ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ చిన్నారి ప్రత్యూషను నేరుగా ఢీకొని తొమ్మిదడుగుల మేర ఈడ్చుకుని పోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణ, మృతురాలి అక్క జ్ఞానేశ్వరి, తదితరుల రోధనలతో చూపరుల కళ్లు చెమర్చాయి. చిన్నారి ప్రత్యూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు మైనర్ వ్యక్తిని ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణమైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ వాసు, ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి.. ప్రత్యూష మృతికి సత్యసాయి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా కారణమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కేఎస్ పాత్రుడు, ఆర్. శ్రీను ఆరోపించారు. సెలవు రోజున పాఠశాల ఎందుకు తెరిచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాఠశాలకు సెలవు ప్రకటించామని, విషయం తెలియని కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాగా సెలవని చెప్పి పంపించేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ లగుడు శ్రీను తెలిపారు. -
బాలుడి కిడ్నాప్
కడప కార్పొరేషన్: కడప నగరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దేవేంద్రారెడ్డి(4) అనే ఎల్కేజీ విద్యార్థి శుక్రవారం సాయంత్రం కిడ్నాప్ అయ్యాడు. ఈ వార్త నగరంలో కలకలం రేపింది. డీఎస్పీ మాసూం బాషా కథనం ప్రకారం.. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే ల్యూమినస్ బ్యాటరీల షాపు నిర్వహిస్తున్నాడు. గుత్తికి చెందిన వినోద్ ఆ షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో వినోద్.. యజమాని కుమారుడు దేవేంద్రారెడ్డిని కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. ఆ బాలుడిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రిమ్స్ వైపు తీసుకెళ్లారు. వేరే నంబర్‌తో పవన్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి.. గొంతు మార్చి మాట్లాడుతూ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. పవన్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొరికిపోతాననే భయంతో వినోద్.. బాలుడిని రిమ్స్ రోడ్డులోని బొరుగుల ఫ్యాక్టరీ సమీపంలో బండకేసి బాదారు. దీంతో పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. అక్కడే వదిలేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు షాపునకు వచ్చేశాడు. అయితే వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజీÐŒవ్ పార్కు సమీపంలోని బాలుడి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. దుకాణంలో పని చేసే వారి గురించి ఆరా తీసే సమయంలో.. వినోద్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా.. బాలుడిని చంపినట్లు తెలిపారు. అయితే తండ్రి పవన్‌కుమార్‌రెడ్డి తమ బిడ్డ మృతదేహాన్నైనా చూస్తామని అడగ్గా.. బొరుగుల ఫ్యాక్టరీ వద్ద పడవేశామని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలుడు కదలాడుతూ ఉండటంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి పర్వాలేదని, అపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. తలకు మాత్రం పెద్ద గాయమైనట్లు సమాచారం. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి దొరకడంతో తల్లిదండ్రులు కుదుట పడ్డారు. తమ వద్ద పని చేసే వారే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదని వారు వాపోతున్నారు. -
పిలక ఉందని ఎల్కేజీ విద్యార్ధికి ఉద్వాసన
కార్పొరేట్ పాఠశాలల్లో పెట్టే నిబంధనలకు అర్థం పర్థం లేకుండా పోతోంది. ఇంగ్లీషులో మాట్లాడలేదని పంపేయడం లాంటి ఘటనలు ఇంతకుముందు చూశాం. కానీ, పిలక ఉందన్న కారణంగా ఎల్కేజీ చదివే పిల్లాడిని స్కూలు నుంచి తొలగించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సెయింట్ విన్సెంట్ పల్లొంట్టి స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మూడున్నరేళ్ల విష్ణును ఇంటికి తీసుకెళ్లేందుకు వాళ్ల తండ్రి మంజునాథ్ స్కూలుకు వచ్చారు. ప్రిన్సిపాల్ పాల్ డిసౌజా ఆయనను పిలిపించి, పిల్లల్ని ఇలా పిలకతో పంపకూడదని.. పిలక కట్ చేస్తేనే అతన్ని పాఠశాలలో కొనసాగనిస్తామని చెప్పారు. బాబుకు ఐదేళ్లు వచ్చేవరకు తల వెంట్రుకలు తీయరాదని, ఇది తమ కుటుంబ ఆచారమని మంజునాథ్ ప్రిన్సిపల్‌కు తెలిపారు. అయితే అలాంటి మూఢనమ్మకాలను తాము అంగీకరించబోమని ప్రిన్సిపల్ మొండిగా మాట్లాడి పిల్లాడిని పాఠశాల నుంచి పంపేశారు. అడ్మిషన్ సమయంలో తాను చెల్లించిన డొనేషన్ తిరిగి ఇచ్చారని మంజునాథ్ తెలిపారు. అయితే.. ఇప్పటికే అన్ని స్కూల్లోల అడ్మిషన్లు పూర్తయిపోయాయని, ఇక తమ పిల్లాడిని వచ్చే విద్యాసంవత్సరంలోనే స్కూలుకు పంపాల్సి ఉంటుందని మంజునాథ్ తెలిపారు. ఈ విషయంపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, వస్తే పాఠశాలపై చర్య తీసుకుంటామని ప్రాథమిక విద్య డైరెక్టర్ కె.ఆనంద్ తెలిపారు. -
ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం
-
ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీ బగ్గయ్యవారిపేటలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో యూరిన్ పోసిందని ఆరోపిస్తూ ఎల్కేజీ విద్యార్థి జ్వాలశ్రీని ఆయాలు మండుటెండలో ఆట స్థలంలోని జారుడు బల్లపై కుర్చోబెట్టారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన జ్వాలశ్రీని అనారోగ్యం పాలైంది. దీంతో ఏమైందని ప్రశ్నించడంతో జ్వాలశ్రీ స్కూల్లో జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన వారు... మంగళవారం ఉదయం స్కూల్‌కు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పాప అస్వస్థతకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన జ్వాలశ్రీ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. -
ఎల్‌కెజి విద్యార్ధిని చితకబాదిన టీచర్
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్
తరగతి గదిలో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను చితకబాదిన సంఘటనను ఇంకా రాజధాని వాసులు మర్చిపోకముందే కూకట్పల్లి ప్రాంతంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వికాస్ భారతి పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఎల్కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదేశారు. దాంతో ఆ చిన్నారికి కంటిమీద గాయం అయ్యింది. ముందురోజు ఇచ్చిన హోం వర్కును ఎందుకు చేయలేదంటూ టీచర్ కొట్టినట్లు విద్యార్థి, ఇతర విద్యార్థులు కూడా చెప్పారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను ఇలా గాయాలయ్యేలా కొడతారా అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు వికాస్ భారతి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
ఎల్కేజీ విద్యార్థి కిడ్నాప్: ముగ్గురి అరెస్ట్
ప్యారిస్, న్యూస్‌లైన్: ఎల్కేజీ విద్యార్థిని కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై జార్జ్‌టౌన్ హార్బర్ క్వార్టర్స్‌లో ఉంటున్న హరిహరన్ ఎన్నూర్ హార్బర్లో సహాయక మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మావతి. వీరి కుమారుడు సూర్య(4) ఆర్‌ఏపురం చెట్టినాడు విద్యాశ్రమం పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం సూర్యను కారులో డ్రైవర్ రాజు పాఠశాలకు తీసుకెళ్లి వదిలి పెట్టాడు. పాఠశాల ముగిసిన తర్వాత 11.40 గంటలకు సూర్య కోసం రాజు పాఠవాలకు వెళ్లాడు. సూర్యను ఎవరో తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు అతనితో చెప్పారు. దిగ్భ్రాంతి చెందిన రాజు వెంటనే హరిహరన్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న హరిహరన్ పాఠశాల యజమాన్యం వద్ద విచారించాడు. పాఠశాల ఉపాధ్యాయులు పోలీసుకమిషనర్‌కు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పాఠశాల ప్రాంగణంలో అమర్చి ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు ఒక కెమెరాలో గుర్తు తెలియని వ్యక్తి సూర్యను తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హరిహరన్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.10 లక్షల ఇస్తే చిన్నారిని వదిలిపెడతామని లేకుంటే హత్య చేస్తామని బెదిరించాడు. ఈ విషయమై హరిహరన్ పోలీసు కమిషనర్ జార్జ్ వద్ద ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసుల సహాయంతో హరిహరన్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. హరిహరన్ను బెదిరించిన వ్యక్తి కొరుక్కుపేటలో ఉన్నట్టు టెలిఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో కొరుక్కుపేట వంతెన వద్దకు బైకులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పోలీసులను చూసి ఒకరు పరారయ్యారు. మరొకరిని పోలీసులు పట్టుకుని సూర్యను రక్షించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి వన్నారపేటకు చెందిన ప్రభు (30) అని తెలిసింది. పభు వద్ద పోలీసులు జరిపిన విచారణలో సేలంకు చెందిన కదిరవన్ వన్నారపేటలో ఎంబ్రాయిడింగ్ సంస్థ నడుపుతున్నాడని తెలిసింది. అతని వద్ద పనిచేస్తున్న ఆరుగురు స్నేహితులు అయినట్టు తెలిపాడు. వారందరూ ధనవంతులు కావాలని సూర్యను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. కదిరవన్ గతంలో హరిహరన్ ఇంటిలో డ్రైవర్‌గా పనిచేసినట్టు తెలిసింది. పోలీసులు కదిరవన్, అతని స్నేహితుడు విశాల్ సహా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో గురువారం రాత్రి కదిరవన్ సేలంకు తప్పించుకుని వెళ్లినట్టు తెలియడంతో ప్రత్యేక బృందం పోలీసులు సేలంకు వెళ్లి శుక్రవారం ఉదయం అక్కడ కదిరవన్‌ను అరెస్టు చేశారు. వన్నారపేటలో విశాల్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.