నగరంలోని ఎల్బీనగర్‌కు చెందిన నర్సయ్య తన కుమారుడు నవీన్ కుమార్‌ను ఇంటికి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తున్నాడు. గతేడాది ఎల్‌కేజీ పూర్తయి యూకేజీకి రాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్‌లైన్ పద్ధతిలోనే తరగతులు కొనసాగాయి. ప్రతిరోజూ ఆన్‌లైన్ తరగతుల్లో వాట్సాప్‌లో వర్కౌట్ వస్తుండటంతో తల్లిదండ్రులు దగ్గరుండి పూర్తి చేసి సకాలంలో పంపించి టీచర్లతో కుమారుణ్ని శభాష్ అనిపించుకునేవారు. విద్యా సంవత్సరం పూర్తయింది. నవీన్‌కుమార్ ఫస్ట్ క్లాస్‌కు కూడా ప్రమోటయ్యాడు. సమీపంలోని ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌లో చేర్పిద్దామని నర్సయ్య తన కుమారుణ్ని తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సిపాల్ వెంటనే అడ్మిషన్ ఇవ్వకుండా ఫార్మాలిటీగా ఒక చిన్న పరీక్ష పరీక్ష పెట్టాడు. కుమారుడు చిన్నచిన్న పదాలే కాదు.. అక్షరాలు, అంకెలు, సంఖ్యలు గుర్తించక పోవడంతో తండ్రి కంగుతినక తప్పలేదు. ఇది ఒక నర్సయ్య కుమారుడి పరిస్ధితే కాదు..ఆన్‌లైన్ ద్వారా చదువుకొనసాగిస్తున్న చాలామంది చిన్నారులది ఇదే దుస్ధితి.
సాక్షి, హైదరాబాద్: అక్షరాభ్యాసం పునాది పటిష్టంగా ఉంటేనే భవిష్యత్ చదువు పక్కాగా ఉంటుంది. అక్షరం, అంకెలు మెదడులో బలంగా నాటుకుంటాయి. కరోనా వైరస్‌తో చిన్నారుల చదువుల పునాదులపై దెబ్బపడింది. గతేడాది కాలంగా చిన్నారుల చదువులు సరిగా సాగలేదు. తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి గడువు సమీపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త అకడమిక్ ఇయర్‌లో ఫస్ట్, సెకండ్ క్లాసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ జోరందుకుంది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో గతేడాది మాదిరిగా ఈసారి కూడా ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన సాధ్యమయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. అక్షరాభాస్యం చేసే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు బోధన ప్రశ్నార్థకమైంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అంతా ఆగమాగం..
చిన్నారుల చదువులను కోవిడ్ ఆగమాగం చేసింది. కరోనా వైరస్ ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదంతా ఫస్ట్, సెకండ్ క్లాసులకు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ బోధన జరగలేదు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్దలు మాత్రం నర్సరిలో అడ్మిషన్లు లేకపోవడంతో ఎల్‌కేజీ, యూకేజీ ఫస్ట్, సెకండ్ వారికీ ఆన్‌లైన్ బోధన పేరుతో ప్రతిరోజూ పేరెంట్స్ వాట్సాప్‌లకు వర్క్ïÙట్స్ పంపించి వాటిని పూర్తి చేసి తిరిగి వాట్సాప్ చేసేలా తరగతులను కొనసాగించారు. దానికి తగ్గట్టుగానే పేరెంట్స్ నుంచి భారీగానే ఫీజులు వసూలు చేశారు. వాస్తవంగా చిన్నారుల పేరుతో తల్లిదండ్రులే సకాలంలో వర్క్‌షీట్ అసైన్‌మెంట్ పూర్తి చేసి పంపిస్తూ వచ్చారు. అంతలో విద్యా సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించకపోగా, ప్రైవేటులో మాత్రం మొక్కుబడిగా ఆన్‌లైన్ ద్వారా సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ కూడా తల్లిదండ్రులే పిల్లలతో చూచిరాతలు రాయించారు. కరోనా నేపథ్యంలో అందరితో పాటు చిన్నారులు సైతం పైక్లాసులకు వెళ్లారు.
అక్షర జ్ఞానం శూన్యం..
పాఠశాలల్లో టీచర్ల ద్వారా ప్రత్యక్ష బోధన పద్ధతిలో అక్షరాభ్యాసం వేరు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణలో చదువు వేరు. పిల్లలు మాటలు వినని పరిస్థితి. తల్లిదండ్రుల ఒత్తిడి కూడా పెద్దగా ఉండదు. గతేడాది చిన్నారులు కనీసం పుస్తకాలు ముట్టకుండా.. అక్షరం ఒంటపట్టకుండానే పై తరగతులకు ప్రమోటయ్యారు. ఇక సర్కారు స్కూల్‌తో పాటు ప్రైవేటు విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరందరూ సంఖ్యలు, అంకెలు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని సాక్షాత్తూ పేరెంట్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాదాపు ఏడాదిన్నర పాటు బడులు, పాఠాలకు దూరమైన చదువుపై చిన్నారుల ఆసక్తి తగ్గిందన్న అభిప్రాయం పేరెంట్స్‌లో వ్యక్తమవుతోంది. అక్షరాభ్యాసం సరిగ్గా లేకపోతే దాని ప్రభావం భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment