ఆ చిన్నారికేం తెలుసు... ఆ రోజే తనను మృత్యువు కబళించబోతోందని. ఆ ఇటుకల ట్రాక్టర్ తన పాలిట మృత్యుశకటమవుతుందని. బడికి సెలవని తెలీక... అదే తనకు చివరి రోజని ఊహించక... తెల్లారి లేచి చక్కగా యూనిఫాం వేసుకుని... పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని అమ్మా... నాన్నకు... టాటా చెప్పింది. అదే చివరి పిలుపని ఆ తల్లిదండ్రులూ ఊహించలేదు. శృంగవరపుకోట మండలం వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజు కళ్లాల వద్ద జరిగిన ఈ దుస్సంఘటన కన్నవారినే కాదు... విన్నవారిని సైతం కన్నీరు పెట్టించింది. గ్రామమంతానిర్ఘాంతపోయింది.
శృంగవరపుకోట రూరల్:ఎస్.కోట–విజయనగరం ప్రధాన రహదారిలో వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాల వద్ద ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ఏపీ 35 వై 4093 నంబర్ గల ట్రాక్టర్ ఢీకొనడంతో యూకేజీ విద్యార్థిని తమటపు ప్రత్యూష (6) అక్కడికక్కడే కన్నుమూసింది. ట్రాక్టర్ నడుపుతున్న తాండ్రంగి వాసు (17) సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. గురువారం ఉదయం 9.30 సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులు, ఎస్.కోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.రవి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాలకు చెందిన తమటపు ప్రత్యూష స్థానికంగా ఉన్న శ్రీసత్యసాయి హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజులాగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు బాబూజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా సెలవు అని చెప్పడంతో ఇంటిముఖం పట్టారు. ఇంటికి వస్తున్న దారిలో గల ఒక షాపు వద్ద విద్యార్థిని ప్రత్యూష తినుబండారాలు కొనుక్కొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విజయనగరం వైపు నుంచి ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ చిన్నారి ప్రత్యూషను నేరుగా ఢీకొని తొమ్మిదడుగుల మేర ఈడ్చుకుని పోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణ, మృతురాలి అక్క జ్ఞానేశ్వరి, తదితరుల రోధనలతో చూపరుల కళ్లు చెమర్చాయి. చిన్నారి ప్రత్యూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు
మైనర్ వ్యక్తిని ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణమైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ వాసు, ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.
పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..
ప్రత్యూష మృతికి సత్యసాయి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా కారణమేనని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు కేఎస్ పాత్రుడు, ఆర్. శ్రీను ఆరోపించారు. సెలవు రోజున పాఠశాల ఎందుకు తెరిచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాఠశాలకు సెలవు ప్రకటించామని, విషయం తెలియని కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాగా సెలవని చెప్పి పంపించేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ లగుడు శ్రీను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment