ఎల్‌కేజీ విద్యార్థి కిడ్నాప్: ముగ్గురి అరెస్ట్
Published Sat, Aug 10 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ప్యారిస్, న్యూస్‌లైన్: ఎల్‌కేజీ విద్యార్థిని కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై జార్జ్‌టౌన్ హార్బర్ క్వార్టర్స్‌లో ఉంటున్న హరిహరన్ ఎన్నూర్ హార్బర్‌లో సహాయక మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మావతి. వీరి కుమారుడు సూర్య(4) ఆర్‌ఏపురం చెట్టినాడు విద్యాశ్రమం పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం సూర్యను కారులో డ్రైవర్ రాజు పాఠశాలకు తీసుకెళ్లి వదిలి పెట్టాడు. పాఠశాల ముగిసిన తర్వాత 11.40 గంటలకు సూర్య కోసం రాజు పాఠవాలకు వెళ్లాడు. సూర్యను ఎవరో తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు అతనితో చెప్పారు. దిగ్భ్రాంతి చెందిన రాజు వెంటనే హరిహరన్‌కు సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న హరిహరన్ పాఠశాల యజమాన్యం వద్ద విచారించాడు. పాఠశాల ఉపాధ్యాయులు పోలీసుకమిషనర్‌కు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పాఠశాల ప్రాంగణంలో అమర్చి ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు ఒక కెమెరాలో గుర్తు తెలియని వ్యక్తి సూర్యను తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హరిహరన్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.10 లక్షల ఇస్తే చిన్నారిని వదిలిపెడతామని లేకుంటే హత్య చేస్తామని బెదిరించాడు. ఈ విషయమై హరిహరన్ పోలీసు కమిషనర్ జార్జ్ వద్ద ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసుల సహాయంతో హరిహరన్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. హరిహరన్‌ను బెదిరించిన వ్యక్తి కొరుక్కుపేటలో ఉన్నట్టు టెలిఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో కొరుక్కుపేట వంతెన వద్దకు బైకులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పోలీసులను చూసి ఒకరు పరారయ్యారు. మరొకరిని పోలీసులు పట్టుకుని సూర్యను రక్షించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి వన్నారపేటకు చెందిన ప్రభు (30) అని తెలిసింది.
పభు వద్ద పోలీసులు జరిపిన విచారణలో సేలంకు చెందిన కదిరవన్ వన్నారపేటలో ఎంబ్రాయిడింగ్ సంస్థ నడుపుతున్నాడని తెలిసింది. అతని వద్ద పనిచేస్తున్న ఆరుగురు స్నేహితులు అయినట్టు తెలిపాడు. వారందరూ ధనవంతులు కావాలని సూర్యను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. కదిరవన్ గతంలో హరిహరన్ ఇంటిలో డ్రైవర్‌గా పనిచేసినట్టు తెలిసింది. పోలీసులు కదిరవన్, అతని స్నేహితుడు విశాల్ సహా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో గురువారం రాత్రి కదిరవన్ సేలంకు తప్పించుకుని వెళ్లినట్టు తెలియడంతో ప్రత్యేక బృందం పోలీసులు సేలంకు వెళ్లి శుక్రవారం ఉదయం అక్కడ కదిరవన్‌ను అరెస్టు చేశారు. వన్నారపేటలో విశాల్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement