Lok Nayak Jaiprakash Narayan
-
ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న తరుణంలో ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మనదేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని, వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన తరువాత త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. (చదవండి: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు) తగ్గిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెద్ద మొత్తంలో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసుల్లో కొద్దిగా తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 422 కు చేరగా.. బాధితుల్లో ఇప్పటివరకు 130 మంది కోలుకున్నారని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 6,987 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 7,091 మంది తాజాగా కోలుకున్నారు. వైరస్ బాధితుల్లో మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి:12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!) -
‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్ని కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. చాలా చోట్ల బెడ్స్ లేక.. కొత్తగా వస్తున్న పేషంట్స్ని లోపలికి అనుమతించడం లేదు. చాలా మంది రోగులు ఆస్పత్రుల బయటే పడిగాపులు గాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లోక్ నాయక్ జయ్ ప్రకాశ్(ఎల్ఎన్జేపీ) ఆస్పత్రి వద్ద ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడిన భార్యను ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. అయితే లోపల బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో.. ఆమెను హాస్టిటల్లో చేర్చుకోవడం కుదరదని తెలిపారు సిబ్బంది. దాంతో సదరు వ్యక్తి ‘‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’’ అంటూ సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. కానీ లాభం లేకపోయింది. దేశంలో మహమ్మారి ఎంతటి విలయం సృష్టిస్తుందో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రూబీ ఖాన్(30) అనే మహిళ కోవిడ్ బారిన పడింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేశారు. దాంతో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో రూబీ ఖాన్ భర్త ఏమాత్రం ఆలస్యం చేయకుండా భార్యను బైక్ మీద ఎక్కించుకుని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చాడు. కోవిడ్ చికిత్సలో ఇది ఢిల్లీలోనే అతి పెద్ద ఆస్పత్రి. ఇక్కడ తప్పక వైద్యం అందుతుందనే నమ్మకంతో రూబీ ఖాన్ భర్త ఆమెను ఇక్కడకు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే ఆస్పత్రి సిబ్బంది.. లోపల బెడ్స్ ఖాళీగా లేవని చెప్పి.. రెండు మూడు అంబులెన్స్‌లు, కొందరు రోగులును బయటే నిలిపివేశారు. ఈ క్రమంలో రూబీ ఖాన్ దంపతులును కూడా బయటే నిలిపివేశారు. దాంతో ఆమె భర్త బైక్ దిగి.. సిబ్బంది దగ్గరకు వెళ్లి ‘‘నా భార్య చనిపోయేలా ఉంది. ఆమెకు వెంటనే చికిత్స అందించాలి. లోపలికి పంపించడి. మీ కాళ్లు మొక్కుతా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇంత బతిమిలాడినా వృధానే అయ్యింది. లోపల బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో సిబ్బంది వారిని అనుమతించలేదు. చేసేదేం లేక రూబీ ఖాన్ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. చదవండి: ఆసుపత్రుల ముందు ఆక్రందనలు.. ఆర్తనాదాలు -
సర్కారు దవాఖానాల్లో దారుణం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగులతో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోవిడ్–19 ప్రత్యేక లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్జేపీ)ఆసుపత్రిలో మృతదేహాలున్న బెడ్స్ పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న భయంకర దృశ్యాలున్న వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీంతో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల్లో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దవాఖానాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అలాగే, దీనిపై స్పందించాల్సిందిగా కేంద్రానికి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స ఇతర సౌకర్యాల వివరాలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను కోర్టుకు అందజేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందని, ఈ విషయంలో కేంద్రం జారీ చేసిన నిబంధనలను పాటించడం లేదని మండిపడింది. మృతదేహాలకు ఆసుపత్రులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంది. ఢిల్లీలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులపై 17లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి డైరెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి సంబంధించిన వీడియోలను మీడియాలో చూసిన తరువాత ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్నామని పేర్కొంది. ‘పేషెంట్లకు చికిత్స చేస్తున్న వార్డులోనే మృతదేహాలను ఉంచారు. లాబీలో, వెయిటింగ్ ఏరియాల్లోనూ మృతదేహాలను ఉంచారు. పేషెంట్లకు ఆక్సిజన్ కానీ, మరే ఇతర వైద్య సదుపాయాలు కానీ కల్పించలేదు. రోగులు ఏడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఢిల్లీలోని 2 వేల పడకలున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో పరిస్థితి ‘అత్యంత భయంకరంగా, దారుణంగా, దయనీయంగా’ ఉందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ యాప్‌లోని సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్స్ 5,814 ఉండగా, అందులో 2,620 మాత్రమే ఆక్యుపై అయిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. -
లోక నాయకుడు
సోషలిస్టు ఉద్యమ సారథి జేపీ దిగ్గజ నేతలెందరికో మార్గదర్శి పౌర హక్కుల పరిరక్షణ కోసం పలు సంస్థలు స్థాపించి, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలను చైతన్యపరిచిన మార్గదర్శి జేపీ. ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలుగా వెలుగుతున్న ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ వంటి వారంతా జేపీ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. సీవీఎస్ రమణారావు: భారత రాజకీయాలపై మహాత్మా గాంధీ తర్వాత అంతటి ప్రభావం చూపిన నాయకుడు సోషలిస్టు ఉద్యమ సారథి ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయాల్లో ఉన్నా, ఏనాడూ అధికార పదవుల కోసం అర్రులు చాచని అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. 1970లలో దేశాన్ని చుట్టుముట్టిన ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల కొరత, నిరుద్యోగం, దుర్భర దారిద్య్రం చూసి జేపీ తీవ్రంగా కలత చెందారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని, ఆమె నియంతృత్వాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. జేపీ నేతృత్వంలో సాగిన ఉద్యమం ధాటికి 1977 ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ మట్టికరిచింది. జనతా పార్టీ కూటమి తొలి సారిగా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సామాన్యుడి శ్రేయస్సే ధ్యేయంగా దేశంలో సంకీర్ణ రాజకీయాలకు బీజం వేసిన ఘనత జేపీదే. పలు రాష్ట్రా ల్లో కాంగ్రెస్ బలహీనపడి విపక్షాలు వేళ్లూను కున్నాయన్నా, పలుచోట్ల ప్రాంతీయ పార్టీలు పుంజు కున్నాయన్నా, కొత్త పార్టీలు ఆవిర్భవించాయన్నా... జేపీ ఉద్యమ ప్రభావమే! అమెరికాలో చదువు - మార్క్స్ ప్రభావం బీహార్‌లోని కాయస్థ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో హర్షదయాళ్ శ్రీవాస్తవ, ఫూల్రాణి దంపతుల నాలుగో సంతానంగా 1902లో జన్మించారు జేపీ. ఆయనలో చిన్ననాటి నుంచే బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత, స్వదేశాభిమానం మెండుగా ఉండేవి. పాట్నాలో హైస్కూల్ విద్య పూర్తయ్యాక పై చదువుల కోసం సరుకుల రవాణా నౌకలో ఒంటరిగా అమెరికా వెళ్లారు! అక్కడ సోషియాలజీలో పీజీ చేశారు. అదే సమయంలో రష్యాలో బోల్షివిక్ విప్లవం విజయవంతం కావడంతో కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ రచనలను అధ్యయనం చేశారు. చదువుకు తండ్రి డబ్బు పంపలేకపోవడతో పళ్ల తోటల్లో ప్యాకేజీ సహాయకుడిగా, రెస్టారెంట్లలో బట్లర్‌గా, గ్యారేజీల్లో మెకానిక్‌గా ఎన్నో పనులు చేసుకుంటూ పొట్టపోసు కున్నారు. ఆయన అట్టడుగు వర్గాల వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నది వాటివల్లే. జేపీ అమెరికాలో ఉన్న కాలంలో ఆయన భార్య ప్రభావతి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ దంపతులకు సహాయకురాలిగా పని చేశారు. పిల్లలు పుడితే ప్రజాసేవకు ఆటంకమని జేపీ దంపతులు బ్రహ్మచర్యం పాటించారు. అమెరికా నుంచి తిరిగొచ్చాక నెహ్రూ చొరవతో 1929లో జేపీ కాంగ్రెస్‌లో చేరారు. గాంధీజీ పిలుపు మేరకు 1932లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని నాసిక్ జైలులో నిర్బంధంలో గడిపారు. అక్కడే ఆయనకు రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, మినూ మసానీ, ఆచార్య నరేంద్ర దేవ్ వంటి నేతలతో పరిచయం కలిగింది. సామ్యవాద సిద్ధాంతం ప్రాతిపదికగా సమాజంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలనేది దృక్పథంతో కాంగ్రెస్‌లో భావసారూప్యం కలవారిని కూడగట్టి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు. గాంధీ మార్గంలో అహింసా పోరాటం కన్నా సాయుధ పోరాటమే మేలని విశ్వసించారు. అయితే భారతీయులందరినీ జాతీయోద్యమం దిశగా ఏకతాటిపై నడిపిన గాంధీజీపై ఆయనకు గౌరవముండేది. ఉద్యమంలో తీవ్రవాద ధోరణి కనబరుస్తున్న జేపీని బ్రిటిష్‌వారు అరెస్టు చేసి హజారీబాగ్ సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. 1942లో గాంధీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఐదుగురు అనుచరులతో కలసి జైలు గోడ దూకి పరారయ్యారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్య్రానంతరం జేపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఆచార్య వినోబా భావే చేపట్టిన సర్వోదయ, భూదానోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత కూడా సామాన్యుల బతుకు ల్లో మార్పు రాకపోవడంతో మరో మహోద్యమం రావాల ని ఆయన భావించారు. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చంబల్ లోయలోని బందిపోటు ముఠాలను శాంతి మార్గంలోకి మళ్లించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ పోకడలకు నిరసనగా భారీ ర్యాలీ జరిపారు. అలా మొదలైన ఉద్యమం మధ్యప్రదేశ్, గుజరాత్లకూ వ్యాపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమానికి జేపీ పిలుపునివ్వడంతో పలు కాంగ్రెసేతర విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమ బాటపట్టాయి. రాయ్‌బరేలీ స్థానం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో ఆమె రాజీనామాకు జేపీ డిమాండ్ చేశారు. ఆమె అంగీకరింకుండా 1975 జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు. 19 నెలల ఎమర్జెన్సీ కాలంలో జేపీ సహా విపక్ష నేతలందరినీ ఇందిర సర్కారు కటకటాల వెనక్కు నెట్టింది. జైల్లోనే విపక్షాల కూటమితో జనతా పార్టీకి రూపకల్పన చేశారు జేపీ. భిన్న సిద్ధాంతాలు, దృక్పథాలున్న, ఏమాత్రం భావసారూప్యం లేని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు ఏర్పడింది. 1979లో కిడ్నీ వ్యాధితో జేపీ మరణించిన కొద్ది నెలల్లోనే జనతా ప్రభుత్వం కుమ్ములాటల కారణంగా కుప్పకూలింది.