లోక నాయకుడు | CVS Ramana rao is main captain of the socialist movement | Sakshi
Sakshi News home page

లోక నాయకుడు

Published Tue, Mar 25 2014 1:17 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM

లోక నాయకుడు - Sakshi

లోక నాయకుడు

సోషలిస్టు ఉద్యమ సారథి జేపీ దిగ్గజ నేతలెందరికో మార్గదర్శి
పౌర హక్కుల పరిరక్షణ కోసం పలు సంస్థలు స్థాపించి, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలను చైతన్యపరిచిన మార్గదర్శి జేపీ. ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలుగా వెలుగుతున్న ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ వంటి వారంతా జేపీ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే.
 
సీవీఎస్ రమణారావు: భారత రాజకీయాలపై మహాత్మా గాంధీ తర్వాత అంతటి ప్రభావం చూపిన నాయకుడు సోషలిస్టు ఉద్యమ సారథి ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయాల్లో ఉన్నా, ఏనాడూ అధికార పదవుల కోసం అర్రులు చాచని అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. 1970లలో దేశాన్ని చుట్టుముట్టిన ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల కొరత, నిరుద్యోగం, దుర్భర దారిద్య్రం చూసి జేపీ తీవ్రంగా కలత చెందారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని, ఆమె నియంతృత్వాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. జేపీ నేతృత్వంలో సాగిన ఉద్యమం ధాటికి 1977 ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ మట్టికరిచింది. జనతా పార్టీ కూటమి తొలి సారిగా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సామాన్యుడి శ్రేయస్సే ధ్యేయంగా దేశంలో సంకీర్ణ రాజకీయాలకు బీజం వేసిన ఘనత జేపీదే. పలు రాష్ట్రా ల్లో కాంగ్రెస్ బలహీనపడి విపక్షాలు వేళ్లూను కున్నాయన్నా, పలుచోట్ల ప్రాంతీయ పార్టీలు పుంజు కున్నాయన్నా, కొత్త పార్టీలు ఆవిర్భవించాయన్నా... జేపీ ఉద్యమ ప్రభావమే!
 
 అమెరికాలో చదువు - మార్క్స్ ప్రభావం
 బీహార్‌లోని కాయస్థ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో హర్షదయాళ్ శ్రీవాస్తవ, ఫూల్‌రాణి దంపతుల నాలుగో సంతానంగా 1902లో జన్మించారు జేపీ. ఆయనలో చిన్ననాటి నుంచే బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత, స్వదేశాభిమానం మెండుగా ఉండేవి. పాట్నాలో హైస్కూల్ విద్య పూర్తయ్యాక పై చదువుల కోసం సరుకుల రవాణా నౌకలో ఒంటరిగా అమెరికా వెళ్లారు! అక్కడ సోషియాలజీలో పీజీ చేశారు.
 
అదే సమయంలో రష్యాలో బోల్షివిక్ విప్లవం విజయవంతం కావడంతో కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ రచనలను అధ్యయనం చేశారు. చదువుకు తండ్రి డబ్బు పంపలేకపోవడతో పళ్ల తోటల్లో ప్యాకేజీ సహాయకుడిగా, రెస్టారెంట్లలో బట్లర్‌గా, గ్యారేజీల్లో మెకానిక్‌గా ఎన్నో పనులు చేసుకుంటూ పొట్టపోసు కున్నారు. ఆయన అట్టడుగు వర్గాల వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నది వాటివల్లే. జేపీ అమెరికాలో ఉన్న కాలంలో ఆయన భార్య ప్రభావతి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ దంపతులకు సహాయకురాలిగా పని చేశారు. పిల్లలు పుడితే ప్రజాసేవకు ఆటంకమని జేపీ దంపతులు బ్రహ్మచర్యం పాటించారు.
 
అమెరికా నుంచి తిరిగొచ్చాక నెహ్రూ చొరవతో 1929లో జేపీ కాంగ్రెస్‌లో చేరారు. గాంధీజీ పిలుపు మేరకు 1932లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని నాసిక్ జైలులో నిర్బంధంలో గడిపారు. అక్కడే ఆయనకు రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, మినూ మసానీ, ఆచార్య నరేంద్ర దేవ్ వంటి నేతలతో పరిచయం కలిగింది. సామ్యవాద సిద్ధాంతం ప్రాతిపదికగా సమాజంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలనేది దృక్పథంతో కాంగ్రెస్‌లో భావసారూప్యం కలవారిని కూడగట్టి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు. గాంధీ మార్గంలో అహింసా పోరాటం కన్నా సాయుధ పోరాటమే మేలని విశ్వసించారు. అయితే భారతీయులందరినీ జాతీయోద్యమం దిశగా ఏకతాటిపై నడిపిన గాంధీజీపై ఆయనకు గౌరవముండేది. ఉద్యమంలో తీవ్రవాద ధోరణి కనబరుస్తున్న జేపీని బ్రిటిష్‌వారు అరెస్టు చేసి హజారీబాగ్ సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. 1942లో గాంధీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఐదుగురు అనుచరులతో కలసి జైలు గోడ దూకి పరారయ్యారు.
 
 ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం
 స్వాతంత్య్రానంతరం జేపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఆచార్య వినోబా భావే చేపట్టిన సర్వోదయ, భూదానోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత కూడా సామాన్యుల బతుకు ల్లో మార్పు రాకపోవడంతో మరో మహోద్యమం రావాల ని ఆయన భావించారు. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చంబల్ లోయలోని బందిపోటు ముఠాలను శాంతి మార్గంలోకి మళ్లించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ పోకడలకు నిరసనగా భారీ ర్యాలీ జరిపారు. అలా మొదలైన ఉద్యమం మధ్యప్రదేశ్, గుజరాత్‌లకూ వ్యాపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమానికి జేపీ పిలుపునివ్వడంతో పలు కాంగ్రెసేతర విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమ బాటపట్టాయి.
 
 రాయ్‌బరేలీ స్థానం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో ఆమె రాజీనామాకు జేపీ డిమాండ్ చేశారు. ఆమె అంగీకరింకుండా 1975 జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు. 19 నెలల ఎమర్జెన్సీ కాలంలో జేపీ సహా విపక్ష నేతలందరినీ ఇందిర సర్కారు కటకటాల వెనక్కు నెట్టింది. జైల్లోనే విపక్షాల కూటమితో జనతా పార్టీకి రూపకల్పన చేశారు జేపీ. భిన్న సిద్ధాంతాలు, దృక్పథాలున్న, ఏమాత్రం భావసారూప్యం లేని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు ఏర్పడింది. 1979లో కిడ్నీ వ్యాధితో జేపీ మరణించిన కొద్ది నెలల్లోనే జనతా ప్రభుత్వం కుమ్ములాటల కారణంగా కుప్పకూలింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement