చాయ్‌వాలాX పాన్‌వాలా
దేశాన్ని ఓ ఊపు ఊపిన ‘ఒ ఖయికె పాన్ బనారస్‌వాలా’.. పాట గుర్తుందా? హిందీ బ్లాక్‌బస్టర్ సినిమా డాన్‌లోని ఆ ట్యూన్ వినగానే.. పాన్ వేసుకుని అమితాబ్ బచ్చన్ వేసిన స్టెప్స్ గుర్తొస్తాయి కదా! ఆ పాట ఇప్పుడు వారణాసి వీధుల్లో మార్మోగుతోంది. కారణమేంటంటారా?.. చదవండి. వారణాసి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ.. తాను చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో టీలు అమ్మానంటూ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో, నా ఇలాఖాలో మోడీ హవా ఏంటి? అనుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్.. వారణాసిలో మోడీకి దీటైన వ్యక్తిని ఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిపాడు. చాయ్‌వాలాకు పోటీగా పాన్‌వాలాను రంగంలోకి దింపాడు. దాంతో ‘మోడీ చాయ్‌వాలా అయితే, నేను పాన్‌వాలా’ అంటూ ‘పాన్ బనారస్‌వాలా’ పాట సపోర్ట్‌తో ఆ అభ్యర్థి కైలాశ్ చౌరాసియా జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తరతరాలుగా తమ వాళ్లు వక్కలు అమ్మేవాళ్లని, తాను కూడా చాలా ఏళ్లు పాన్‌లు అమ్మానని చెబుతున్నారు. అలా అని ఈ చౌరాసియాది మామూలు స్థాయేం కాదు. ఇప్పటికే ఆయన అఖిలేశ్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి. చౌరాసియా వర్గీయులు వారణాసిలో అధిక సంఖ్యలో ఉండటం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. వారిలో చాలామంది ఇప్పటికీ వక్కలమ్మే బిజినెస్‌లోనే ఉన్నారు. మోడీలా ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టి ‘చాయ్ పే చర్చ’ లాంటి కార్యక్రమాలు చేపట్టనని, నియోజకవర్గంలోని పాన్‌వాలాలందరినీ వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతానని చౌరాసియా చెబుతున్నారు.
అమెరికాలోనూ ‘చాయ్ పే చర్చ’
మోడీకి మద్దతుగా అమెరికాలోనూ బీజేపీ అభిమానులు భారీ ఎత్తున ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్‌బీజేపీ) అమెరికాలో పలుచోట్ల ఇప్పటికే వందల సంఖ్యలో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాలు నిర్వహించింది. ఓఎఫ్‌బీజేపీ అమెరికా శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ అమెరికా నలుమూలలా పర్యటిస్తూ, ఎన్‌ఆర్‌ఐలను కలుసుకుంటూ, బీజేపీని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు.