lokmanya tilak terminus
-
కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు
ముంబై: కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దింతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. లోక్‌మన్య తిలక్ టెర్మినస్ వెలుపల చాలా మంది రైళ్లలో ఎక్కడానికి గుమిగూడారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు అక్కడకు చేరుకోవడంతో రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోక్‌మన్య తిలక్ టెర్మినస్(ఎల్టిటి) వెలుపల అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అత్యవసర సేవలు మినయించి బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తెలుపుతున్నారు. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేయనున్నారు. అయితే ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలు వంటి అత్యవసర సేవలపై ఎలాంటి నిబంధనలు విధించలేదు. చదవండి: గుడ్‌న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు -
రైల్వే టికెట్ కౌంటర్లో చోరీ
సాక్షి, ముంబై: నిత్యం రద్దీగా ఉండే లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది. సోమవారం తెల్లవారు జాము నాలుగైదు గంటల ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుకింగ్ కౌంటర్ కార్యాలయంలోని తిజోరీలో నిల్వచేసిన రూ.44 లక్షలు చోరీకి గురైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కుర్లా టెర్మినస్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ల సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు బుకింగ్ కౌంటర్ సిబ్బందిని విచారిస్తున్నారు. 24 గంటలు ప్రయాణికుల రాకపోకలతో బిజీగా ఉండే ఈ స్టేషన్లో తిజోరీలో భద్రపర్చిన నగదు చోరీ కావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాంకేతిక లోపంతో నిలిచిన మోనో.. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సోమవారం ఉదయం మోనో రైలు సేవలు స్తంభించిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెంబూర్ పరిసరాల్లోని వాషినాకా–భారత్ పెట్రోలియం స్టేషన్ల మధ్య మోనో రైలు నిలిచిపోయింది. మార్గమధ్యలో రైలు నిలిచిపోవడంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులు కొద్ది సేపు గందర గోళానికి గురయ్యారు. మోనో రైలు మార్గం పైనుంచి వెళ్లడంతో డోర్లు తీసుకుని కిందికి దిగడానికి వీలులేకుండా పోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల నిచ్చెనల సాయంతో రైలులో చిక్కుకున్న ప్రయాణికులందరిని సురక్షితంగా కిందికి దింపారు. రైళ్ల రాకపోకలు స్థంభించిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. -
కిడ్నాపర్ల చెరనుంచి చిన్నారులకు విముక్తి
సాక్షి, ముంబై: కిడ్నాపర్ల చెరనుంచి 83 మంది చిన్నారులకు విముక్తి లభించింది. కుర్లా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ప్రధమ్ అనే సామాజిక సేవా సంస్థ లోక్మాన్య తిలక్ టెర్మినస్‌లో సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని జీఆర్పీ సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ దోపార్కర్ వెల్లడించారు. పిల్లల బలవంతపు తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమకు అందించారన్నారు. కిడ్నాపర్లు జన్సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దాదాపు 83 మంది చిన్న పిల్లలను తరలిస్తున్నారని తెలిపారు. ఉదయం ఐదు గంటలకు రావాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆల స్యంగా వచ్చింది. చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు 83మంది పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టులు జరగలేదన్నారు. -
త్వరలో ప్రీపెయిడ్ ఆటో బూత్‌లు
సాక్షి, ముంబై: దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోడ్రైవర్ల ఆగడాలకు కళ్లెం వేయాలని ట్రాఫిక్ శాఖ యోచిస్తోంది. మొదటి విడతలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), బాంద్రా టర్మినస్, అంధేరి, కల్యాణ్ తదితర ప్రధాన రైల్వేస్టేషన్ల బయట ప్రీ పెయిడ్ ఆటో బూత్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ఆటో డ్రైవర్ల ఇష్టారాజ్యం, దాదాగిరి, అడ్డగోలుగా చార్జీల వసూలు, మోసం చేయడం లాంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది. నగరంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), ముంబై సెంట్రల్, దాదర్ లాంటి కీలకమైన రైల్వే స్టేషన్ల బయట ట్రాఫిక్ శాఖ ప్రీ పెయిడ్ ట్యాక్సీ బూత్‌లను ఇదివరకే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి కారణంగా ప్రయాణికులకు సరైన సేవలు అందుతున్నాయి. ఇదే తరహాలో ఆటో ప్రీపెయిడ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రధాన రైల్వే స్టేషన్ల బయట స్థలం సమస్య ఏర్పడుతోంది. కానీ ప్రీ పెయిడ్ ఆటోబూత్‌లు ఏర్పాటుచేసేందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చేందుకు రైల్వే పరిపాలన విభాగం అంగీకరించింది. కాగా, అవసరమైన స్థలాన్ని సమకూర్చి ఇవ్వాలని సెంట్రల్, పశ్చిమ రైల్వే పరిపాలన విభాగాలకు విజ్ఞప్తిచేయగా అందుకు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ట్రాఫిక్ శాఖ వర్గాలు తెలిపాయి. స్థలం లభించిన వెంటనే బూత్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా స్వగ్రామాల నుంచి పిల్లలు, భారీ లగేజీలతో రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో లేదా ట్యాక్సీ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు రాగానే, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ధరలు చెబుతారు. దగ్గర కిరాయికి రారు. ఒకవేళ వచ్చినా వారు అడిగినంత చెల్లించాల్సిందే. ఇక ప్రీ పెయిడ్ బూత్‌లు అందుబాటులోకి వస్తే వీరి ఆగడాలకు కచ్చితంగా కళ్లెం పడుతుందని ట్రాఫిక్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
‘అనూహ్య’కు న్యాయం చేయాలి
సాక్షి, ముంబై: ముంబైలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. తెలుగు సంఘాలతోపాటు అనేక సంఘాలు ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలతోపాటు హోంశాఖ మంత్రి, ఇతర రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు వినతి పత్రాలను అందిస్తున్నారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులందరు ఒక్కటిగా ఏర్పడి అనూహ్య కోసం ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవలే ఆజాద్‌మైదానంలో ఆందోళ న చేసిన వీరు ఆదివారం గోపీనాథ్ ముండేతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేశారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్ఆర్సీపీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యకు ఎల్టీటీ ఆవరణలో శ్రద్దాంజలి ఘటించారు. అనూహ్యను హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చూస్తాం: గోపీనాథ్ ముండే హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తానని లోక్‌సభ ఉప ప్రతిపక్ష నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్సార్సీపి నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల బృందం సభ్యులు ఆదివారం సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేను కలిశారు. ఈ సందర్బంగా అనూహ్య కనిపించకుండా పోయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు తీరును వివరించారు. దీనిపై స్పందించిన ఆయన అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముండేతో భేటీ అనంతరం మాదిరెడ్డి కొండారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞాపనకు ముండే సానుకూలంగా స్పందించారన్నారు. నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్‌కు ఫోన్ చేసి కేసు వివరాలను తెలుసున్నారన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలతో హైద రాబాద్తోపాటు వివిధ ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయని, రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశముందని చెప్పినట్లు కొండారెడ్డి తెలిపారు. ఇది ఒక్క తెలుగు అమ్మాయి ఎస్తేర్ అనూహ్య అనే కాకుండా, ఇది మహిళలందరి భద్రత అంశంగా ముండే పేర్కొన్నారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీతోపాటు పార్లమెంట్లో లేవనెత్తుతామని హామీని ఇచ్చారన్నారు. ముంబైలోని తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు అనూహ్యకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు తన మద్దతు ఉం టుందని ముండే చెప్పినట్టు కొండారెడ్డి చెప్పారు. ముండేతో భేటీ అయిన వారిలో ముంబై, నవీ ముంబై, ఠాణే, భివండీ చుట్టుపక్కలలోని వివిధ తెలుగు సంఘాలు ప్రతినిధులున్నారు. వీరిలో పోతు రాజారాం, వీరబత్తిని చంద్రశేఖర్, మంతెన రమేష్, మర్రి జనార్దన్, భోగ సహదేవ్, వాసాలా శ్రీహరి, యెల్ది సుదర్శన్, అనుమల్ల రమేష్, శెకెల్లి రాములు, బడుగు విశ్వనాథ్, కంటె అశోక్, మచ్చ ప్రభాకర్, గట్టు నర్సయ్య, విజయ, అనురాధ, కస్తూరి హరిప్రసాద్, బండి హర్యన్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, రవీ గౌడ్, గుంటుక కోటి రెడ్డి, వై వి నారాయణ రెడ్డి, ఎవి నాగేశ్వర్ రావ్, సంకు సుధాకర్, మార్గం రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్టీటీ.. లోపాల పుట్ట!
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య ముంబైలో రైలు దిగిన అనంతరం ఎటువైపు నుంచి వెళ్లిందనేది పోలీసులకు ఇంతవరకు తెలియరాలేదు. ఎంతో కీలకంగా భావించే సీసీటీవీ కెమెరాల్లో అనూహ్యకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్‌లు లభించలేకపోవడం గమనార్హం. అత్యాధునిక సాంకేతిక పరి/ా్ఞనం వినియోగిస్తున్నామని పేర్కొనే పోలీసులకు ఇంత వరకు ఒక్క ఆధారం కూడా సేకరించకపోవడంపై అనూహ్య బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంతోపాటు దేశంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఒక్కటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్ టర్మినస్లపై కొంత భారాన్ని తగ్గించేందుకు లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీ టీ)ను నిర్మించారు. అనంతరం దీన్ని అత్యాధునిక పరి/ా్ఞనంతో ఆధునికీకరించారు. అయినప్పటికీ రైలు దిగిన అనూహ్య గురించి సీసీటీవీలో ఎలాంటి సమాచారం లభించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్లా టర్మినస్‌లో భద్రతా ఏర్పాట్లపై ‘సాక్షి’ దృష్టి పెట్టగా పలు లోపాలు బయటపడ్డాయి. ఇక్కడ మెటల్ డిటెక్టర్లున్నప్పటికీ ప్రయాణికులు నేరుగా వెళ్లడం విశేషం. మరోవైపు ఫ్లాట్ ఫారం ముందు నుంచి వెళితే అక్కడ పోలీసుల జాడ లేదు. ఈ టర్మినస్‌లో మొత్తం అయిదు ఫ్లాట్ ఫారాలున్నాయి. ఒకటో ఫ్లాట్‌ఫారం విడిగా ఉండగా రెండు, మూడు ఫ్లాట్‌ఫారాలు, నాలుగు, అయిదు ఫ్లాట్ ఫారాలు కలిసి ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారాలన్నింటిపై నుంచి బయటికి వెళ్లేందుకు ఒకే ఒక్క పాదచారుల వంతెన ఉండగా ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రధాన ద్వారం ఉంది. అయితే ముందువైపు నుంచి మాత్రం నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇక అనూహ్య రైలు దిగిన మూడవ నెంబరు ఫ్లాట్ ఫారాాన్ని పరిశీలించినట్టయితే నాలుగు సీసీ టీవీలున్నాయి. ఫ్లాట్‌ఫారం మధ్యలో ఉన్న పాదచారుల వంతెన వరకు నాలుగు సీసీటీవీలు సుమారు 40 నుంచి 50 అడుగుల దూరంలో అమర్చి ఉన్నాయి. అయితే ఇవన్నీ డౌన్ వైపు చిత్రీకరించేవిధంగా ఉన్నాయి. దీంతో వీటిలో అనూహ్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శింతే తెలిపారు. దీంతో రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై కూడా కేవలం ఆరు సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో మొదటి మూడు ఫ్లాట్ ఫారం మూడుపై ఉన్నట్టుగానే దిగువ వైపు చిత్రీకరించే విధంగా ఉండగా, తర్వాత కెమెరా ఎగువ వైపు, మరొకటి దిగువ దిశగా ఉన్నాయి. అయితే ఇవన్ని కూడా పాదచారుల వంతెన తర్వాత మరో రెండు మూడు బోగీలు కనిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాని ఇంజిన్‌వైపు నుంచి వెళితే మాత్రం ఎవరూ కన్పించే అవకాశంలేదు. దీంతో అనూహ్య అటునుంచి వెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందువైపు ఎగ్జిట్, ఎంట్రెన్స్‌లో కూడా సీసీ టీవీలున్నట్టయితే అనూహ్య కన్పించి ఉండడంతోపాటు ఆమెను కాపాడుకునేందుకు కూడా ఆస్కారం ఉండేదని భావిస్తున్నారు. అయితే ఊరినుంచి వెళ్లిన ప్రతిసారీ అటోలోనే ఇంటికి వెళ్లే అనూహ్య ఈసారి కూడా ఎటువైపు నుంచి అటోలో వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పలువురిని విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని వైపుల సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. -
ఇక వారంలో నాలుగు రోజులు ఎల్టీటీ
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు, వికారాబాద్‌ల మీదుగా ముంబై, విశాఖపట్నం వెళ్లే లోకమాన్య తిలక్ టెర్మినల్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రైల్వే అధికారులు పొడిగించారు. ప్రస్తుతం వారంలో రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును ఈ నెల 25నుంచే నాలుగు రోజులు నడుపుతున్నారు. ఈ రైలు జిల్లాలో తాండూరు, వికారాబాద్ స్టేషన్లలో ఆగుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి ఎల్టీటీ (నంబర్ 18519) వైపునకు ప్రతి ఆది, బుధ, గురు, శనివారాల్లో, ఎల్టీటీ నుంచి విశాఖపట్నం (నంబర్ 18520) వైపునకు ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. విశాఖపట్నంలో ఆయా రోజుల్లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు (సోమ, గురు, శుక్ర, ఆది) మధ్యాహ్నం 2.25 గంటలకు వికారాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు తాండూరుకు వస్తుంది. అలాగే ముంబై ఎల్టీటీ టెర్మినల్ నుంచి ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో బయలుదేరే రైలు అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు తాం డూరు, రాత్రి 7.30గంటలకు వికారాబాద్ రైల్వే స్టేషన్లలో రెండు నిమిషాలు ఆగి వెళ్తుంది. ఎల్టీటీ సర్వీసులను రెండు రోజుల నుంచి నాలుగు రోజులకు పొడిగించడంతో ముంబై, విశాఖపట్నం వెళ్లేందుకు మరింత సౌలభ్యం లభించిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.