lorry slipped
-
అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన లారీ
జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆంధోల్ గ్రామ శివారులో బుధవారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆంధోల్ శివారులో బాలికల పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన కంకర లోడ్ తో ఉదయం ఓ లారీ అక్కడికి చేరుకుంది. కంకరను కిందికి డంప్ చేసే క్రమంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే కిందికి దూకేశాడు. గుంతలో పడిన లారీ బాడీ అంతా ముక్కలు ముక్కలయింది. అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. -
పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి
అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి శివారులో శనివారం ఉదయం లారీ బోల్తాపడి నవ వధువు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగికిరికి చెందిన నిత్య(21)కు వారం రోజుల కిందటే వివాహం అయింది. వైజాగ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా రాసేందుకు మామతో పాటు బయలుదేరింది. బస్సులు లేకపోవడంతో వైజాగ్ వెళ్లే లారీ ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత లారీ ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో నిత్య అక్కడికక్కడే మృతిచెందగా ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఇటుకల లారీ బోల్తా: ఒకరి మృతి
తెనాలి రూరల్(గుంటూరు): ఇటుకల లోడుతో వెళ్తొన్న లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలైన సంఘటన గుంటూరు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలివీ.. దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు(38) క్యాటరింగ్ పనులకు వెళుతుంటాడు. శుక్రవారం కొల్లూరులో పనికి వెళ్లి ఇటుకల లోడుతో తెనాలి వస్తున్న లారీ ఎక్కాడు. అతనితో పాటు లారీలో కొల్లూరుకు చెందిన చొప్పర రవీంద్ర, బున్నంగి సురేష్, నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన బుడిపాటి సుధీర్ ఉన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పెదరావూరు వద్ద లారీని డ్రైవరు రోడ్డు మారిన్‌లో నడిపేందుకు యత్నించగా అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టులో పడింది. ఈఘటనలో నాగబాబు అక్కడికక్కడే మృతి చెందగా, రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. -
రోడ్డుపై మద్యం ఏరులై పారింది..
కోయంబత్తూర్: లిక్కర్ లోడ్‌తో వెళ్తోన్న లారీ బోల్తాపడటంతో మద్యం అక్కడ ఏరులై ప్రవహించింది. ఈ ఘటన తమిళనాడు లోని కోయంబత్తూరు సమీపంలో సులూర్ పట్టణం వెలుపల మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింహపలాయంలో తయారైన స్వదేశీ మద్యం(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) బాటిల్స్‌ను రాజధాని చెన్నైకి రవాణా చేస్తుండగా సులూర్ దగ్గర లారీ అదుపుతప్పి బోల్తాపడింది. లారీలో ఉన్న లోడ్ రోడ్డుపై పడి బాటిల్స్ చాలా మేరకు ధ్వంసమయ్యాయి. దీంతో మద్యం రోడ్డుపై ఏరులై పారింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నష్టం వివరాలు ఎంత అనేది అంచనా వేసే పనిలో పోలీసులు ఉన్నారు. -
సిమెంట్ లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
రంగారెడ్డి (చేవెళ్ల): డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల ఓ సిమెంట్‌లారీ చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీడ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ బస్టాప్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయపల్లి పరమేశ్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటీలాగే శనివారం తాండూరులోని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడ్‌తో ఆదివారం తెల్ల వారు జామున మూడు గంటలకు అక్కడి నుంచి నగరానికి బయలు దేరాడు. మల్కాపూర్ బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది. చెట్టును బలంగా ఢీకొనటంతో లారీ పూర్తిగా ధ్వంసమైంది. లారీలో డ్రైవర్ పరమేశ్ ఒక్కడే ఉండటంతో అతడు లారీలో ఇరుకుపోయాడు. స్థానికులు, వాహనదారులు గమనించి డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. అప్పటికే అతడు రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలోలో చేవెళ్లకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతేదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.