ls
-
'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. ఇవ్వని రైతులను వదిలేయాలని అంబటి తెలిపారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు. -
మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఏపీ రాజధాని గ్రామాల్లో పంటలు తగలబడిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి ...పెనుమాక గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి చేసిన వ్యాఖ్యలుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మంత్రి తన పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. మంత్రి బాధితుల మాటలు వినకుండా వేరేవారి మాటలు వింటారా? అంటూ రైతులు ఆగ్రహం చెందారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ జై జవాన్ ...జై కిసాన్ అనకుండా... ఏపీ సర్కార్ ..'జై జపాన్...కిల్ కిసాన్' అన్నచందంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
'మూడు కోణాల్లో అనుమానాలున్నాయి'
-
రాజధాని గ్రామాల్లో ఘటనను ఖండించిన మంత్రి రావెల
హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు సృష్టించడాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ఖండించారు. ఈ చర్యను అరాచక చర్యగా అభిప్రాయపడ్డ రావెల.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, సోమవారం రాజధాని గ్రామాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు, ఎస్పీ రాజశేఖర్ బాబులు పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. -
మూడు కోణాల్లో అనుమానాలు...: పరకాల
హైదరాబాద్ : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని ప్రాంత గ్రామాలలో పంటలు తగులపెట్టిన ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అధికారులను పూర్తి నివేదిక కోరినట్లు చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, పంట నష్టంపై కచ్చితమైన సమాచారం లేదని, సాయంత్రంలోగా ఒక స్పష్టత వస్తుందని అన్నారు. లేదని అన్నారు. పంట కావాలనే తగులబెడితే కఠిన చర్యలు తప్పవని పరకాల తెలిపారు. మూడు కోణాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని...ఆ దిశల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. మొత్తం 15మంది రైతులకు చెందిన పొలాలు దగ్దం అయ్యాయని పరకాల తెలిపారు. తాడేపల్లి మండలంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పరకాల వెల్లడించారు. మరోవైపు తగులబడిన పంటలను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యటించారు. -
' చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా?'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం... రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కండితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించేది లేదని అన్నారు. అందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని ...బలవంతంగా,అమానుషంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు. -
గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేసిన తర్వాత రైతులు ఎవ్వరూ గ్రామాల్లో నిద్రపోవడం లేదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామాలు వదిలిపెట్టి...పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. సుమారు 8నుంచి 10మంది వరకూ ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దుండగులను గుర్తించి కేకలు వేసేలోపే వాళ్లు పారిపోయారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లోని దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరిగడ్డి వాములు, అరటి తోటలు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు.