'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. ఇవ్వని రైతులను వదిలేయాలని అంబటి తెలిపారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు.