రియల్ ఊపు
రెవెన్యూ సైట్లకు మోక్షం
ఊపందుకోనున్న నిర్మాణ రంగం
ఆశల పల్లకిలో రియల్టర్లు
పెరగనున్న అపార్ట్మెంట్ల అమ్మకాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రెవెన్యూ సైట్లు, లేఔట్లను క్రమబద్ధీకరించాలని బీబీఎంపీ సర్వ సభ్య సమావేశం నిర్ణయించడంతో నగరంలో నిర్మాణ రంగం ఊపందుకోనుంది. గతంలో వ్యవసాయ భూములను సైట్లు లేదా లేఔట్లుగా మార్చి విక్రయించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. ఇలాంటి సైట్లను బీ ఖాతాగా పరిగణిస్తారు. అంటే...ఏటా వీటికి నామమాత్రంగా బీబీఎంపీకి ఆస్తి పన్ను చెల్లించే వారు.
అయితే ఇలాంటి సైట్లు లేదా లేఔట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కావు. వీటిని అక్రమ లేఔట్లు లేదా సైట్లుగా పరిగణించే వారు. ‘ఏ’ ఖాతా ఉంటేనే సక్రమమైనవి. ఎన్నో ఏళ్లుగా ఈ బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చాలని విజ్ఞప్తులు అందినా, అనేక అవరోధాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు బీబీఎంపీ వీటిని ఏ ఖాతాలుగా మార్చాలని నిర్ణయించడంతో బీ ఖాతాదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చడానికి బెటర్మెంట్ చార్జీల కింద చదరపు మీటరుకు రూ.350 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
వెయ్యి చదరపు మీటర్లు దాటితే రూ.300 వంతున చెల్లించాలి. నాలుగు వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే నూటికి ఒకటిన్నర రూపాయి వంతున వడ్డీ చెల్లించాలి. ఆర్థికంగా దివాళా తీసిన బీబీఎంపీ ఈ బెటర్మెంట్ చార్జీల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తోంది. కాగా రెవెన్యూ సైట్లలోని కట్టడాలను మాత్రం అక్రమ-సక్రమ కింద క్రమబద్ధీకరించుకోవాలని బీబీఎంపీ కమిషనర్ ఎం. లక్ష్మీ నారాయణ బుధవారం సర్వ సభ్య సమావేశంలో స్పష్టం చేశారు.
రియల్టర్ల ఆశలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేనందున, మే నెల వరకు అపార్ట్మెంట్ల అమ్మకాలు ఊపందుకోవచ్చని రియల్ ఎస్టేట్ రంగం ఆశిస్తోంది. నగరంలో సుమారు 50 వేల వరకు అపార్ట్మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడక పోతే దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతుందని, దాని వల్ల వడ్డీ రేట్లు స్థిరంగా ఉండబోవనే భావన నెలకొంది. కనుక ఎన్నికలలోగానే సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనేక మంది ఉబలాటపడుతున్నారు. ఒక వేళ ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడినా, అది కూడా తమ మంచికేనని రియల్టర్లు భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుందని, తద్వారా వ్యాపార లావాదేవీలు నిలకడగా సాగుతాయని వారు అంచనా వేస్తున్నారు.
హొస్పేట నుంచి తిరుపతికి ‘సుహాస్’
హొస్పేట, న్యూస్‌లైన్ : హొస్పేట నుంచి తిరుపతికి నూతన సుహాస్ బస్సు సౌకర్యాన్ని బుధవారం ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. హొస్పేటలో ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు బయల్దేరి తోరణగల్లు, కుడితిని, బళ్లారి, ఉరవకొండ, అనంతపురం, కదిరి, మదనపల్లి, వాయల్పాడు, పీలేరు మీదుగా తిరుపతికి ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు తిరుపతి నుంచి ఇదే మార్గంలో హొస్పేటకు చేరుకుంటుందని ఆర్టీసీ విభాగం నియంత్రణ అధికారి తెలిపారు.