24 గంటలు... 14 చైన్ స్నాచింగ్లు
బెంగుళూరు: భారత్ సిలికాన్ నగరం బెంగుళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ... ఒంటిరిగా వెళ్తున్న మహిళలపై చైన్ స్నాచర్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. దాంతో గురువారం ఒక్క రోజు బెంగుళూరు నగరంలో 14 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నగర పశ్చిమ శివారు ప్రాంతంలోని మల్లేశ్వరం, రాజాజీ నగర్లో 10 కేసులు నమోదు కాగా, మరో రెండు చైన్ స్నాచింగ్ కేసులు దక్షిణ శివారు ప్రాంతంలో చోటు చేసుకున్నాయని నగర అదనపు సీటి పోలీసు కమిషనర్ ఎం. సలీం శుక్రవారం బెంగళూరులో వెల్లడించారు. బాధితులంతా వయస్సు 40 ఏళ్ల పైబడిన మహిళలేనని ఆయన వివరించారు. ఉదయం నడక లేదా సాయంత్రం వ్యాహాళీకి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచింగ్లు జరిగాయని సలీం తెలిపారు.
హిందీ, మరాఠీ, తెలుగులో మాట్లాడుతూ... మహిళ దృష్టి మరల్చేందుకు చిరునామా అడుగుతున్నట్లు నటిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానికంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు తక్కువగా ఉన్నారని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ తరహా నేరాలకు పాల్పడే వారు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని... సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చైన్ స్నాచింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేస్తే... మరో ప్రాంతంలో ఇలాంటి కేసులు అధికంగా జరుగుతున్నాయని సలీం తెలిపారు.