maa tv
-
మరో టీవీ షోలో...
చిన్న ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారా? అంటే ఫిల్మ్‌నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘బిగ్ బాస్’ షోలో హోస్ట్‌గా తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిన్న ఎన్టీఆర్. ఇప్పుడు ఓ రియాలిటీ షో చేయనున్నారని సమాచారం. ఈ షో కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్స్ వేస్తున్నారని తెలిసింది. నిజానికి భవిష్యత్తులో ‘బిగ్ బాస్’ రాబోయే సీజన్లో మళ్లీ చిన్న ఎన్టీఆర్ కనబడే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్న తరుణంలో ఈ షో వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ షూటింగ్లో పాల్గొంటూనే టీవీ షో చిత్రీకరణలో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారట. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ఈ షో ఉంటుందని టాక్. -
బిగ్‌బాస్ 4 సీజన్లో సమంత?
సాక్షి, హైదరాబాద్: మా టీవీలో ప్రసారమయిన బిగ్‌బాస్ షో పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే నాలుగో సీజన్‌కు హోస్ట్‌ను వెతికే పనిలో ఎప్పటి నుంచో నిమగ్నమైంది బిగ్‌బాస్ టీం. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండో సీజన్‌ను నాని, మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేశారు. అయితే మొదటి సీజన్‌కు వచ్చినంత టీఆర్పీ రేటింగ్ రెండు, మూడు సీజన్లకు రాలేదు. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?) దీంతో షోను ఆసక్తిగా మార్చడానికి ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యాఖ్యత కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే అక్కినేని నాగార్జున కోడలు సమంతను బిగ్‌బాస్ టీం సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సమంత తుది నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. సమంత కనుక ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే బిగ్‌బాస్‌ను హోస్ట్ చేస్తున్న మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తుంది. దీనికి సంబంధి క్లారిటీ రావడానికి బిగ్‌బాస్ టీం అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. (మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి) -
రికార్డు స్థాయిలో ఇన్ కమ్ టాక్స్
ఈ ఏడాది టార్గెట్ కి మించి ఆదాయ పన్ను వసూలు చేశామని ప్రిన్సిపల్ చీఫ్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ సురేశ్ బాబు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.36 వేల 663 కోట్ల పన్ను వసూలు చేశామని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 15.4 శాతం ఎక్కువ అని అన్నారు. దేశంలోనే తమిళ నాడు తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా పన్ను వసూలైందని తెలియజేశారు. ఈఏడాది అత్యధికంగా NMDC రూ1600 కోట్లు ఆదాయ పన్ను చెల్లించిందని వివరించారు. తర్వాతి స్థానంలో రూ. 833 కోట్లతో సింగరేణి, రూ.469 కోట్లతో అరబిందో ఫార్మా ఉన్నాయి. మాటీవీ రూ. 480 కోట్లు చెల్లించిందని, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ రూ.400 కోట్లు ఇన్ కం టాక్స్ కట్టిందని సురేశ్ బాబు తెలియజేశారు. కాగా.. పన్ను ఎగవేత దార్ల పేర్లు త్వరలోనే వెబ్ సైట్ లో పెడతామని చెప్పారు. టాక్స్ ఎగవేత దారులపై 36 రకాల కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. అప్పుడు అకౌంట్లు చూపి 10 వేల మంది పైనా కేసులు నమోదు చేయనున్నారు. -
స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మా టెలివిజన్ నెట్వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విలీనం అధికారికంగా పూర్తయ్యిందని స్టార్ ఇండియా ప్రకటించింది. దీంతో తెలుగు టెలివిజన్ విభాగంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుందని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం స్టార్ ఇండియా ఎనిమిది భాషల్లో 40 టెలివిజన్ చానల్స్‌ను కలిగి ఉంది. మా టీవీలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు సినీ నటులు నాగార్జున, చిరంజీవి కుటుంబాలకు వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. -
మీలో ఎవరు కోటీ శ్వరుడులో 'సీఐ'
చేవెళ్ల: చేవెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జే.ఉపేందర్ మాటీవీ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే క్విజ్ కాంపిటేషన్‌లో క్వాలిఫై అయి రూ.6లక్షల 45 వేల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సీఐ ఉపేందర్ని శుక్రవారం వికారాబాద్‌లో జరిగిన సమావేశంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి ఎవరు పాల్గొనలేదని, ఆ పనిచేసి ఉపేందర్ చరిత్ర సృష్టించారని ఆ కార్యక్రమాన్ని టీవీలో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. -
బుల్లితెరపై మిణుగురులు
‘మిణుగురులు’... గత ఏడాది జనవరిలో రిలీజైన ఈ ఆలోచనాత్మక చిత్రం గుర్తుందా? ఒక అంధుల హాస్టల్లో జరిగే అన్యాయాల మీద విద్యార్థులు తిరగబడే ఇతివృత్తంతో ప్రవాస భారతీయుడు అయోధ్యకుమార్ క్రిష్ణంశెట్టి రూపొందించిన సినిమా అది. రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’లో లైవ్‌యాక్షన్ కేటగిరీలో పోటీపడిన ఈ సినిమా పలువురు విమర్శకుల ప్రశంసలందుకొంది. పలు అవార్డులందుకొన్న ఈ చిత్రం తొలిసారిగా టీవీలో రానుంది. ఈ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ‘మా’ టీవీలో ప్రసారమవుతోంది. ‘‘ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం ఆరేడు బౌండ్ స్క్రిప్టులతో ప్రముఖ నటీనటుల్ని కలిశాను. ఈ నెలలోనే కొత్త సినిమా ప్రకటన చేస్తున్నా’’ అని నాలుగేళ్ళ పాటు అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసిన అయోధ్యకుమార్ చెప్పారు. -
‘మా' టీవీలో ‘సీతాకోకచిలుక'
మనోహర్ ఓ సాధారణ మధ్యతరగతి జీవి.అతని వైవాహిక బంధంలో ఏదో వెలితి. ఆ సమయంలోనే ప్రేరణ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే ‘సీతాకోకచిలుక' సీరియల్ చూడాలని మా చానల్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ భాను, సాయి మిత్రా, చంద్రలక్ష్మణ్ నటించిన ఈ సీరియల్ ‘మా' టీవీలో మార్చి రెండో తేదీ నుంచి (సోమ నుంచి శుక్రవారం దాకా రాత్రి 10కి) ప్రసారం కానుంది. -
మా టీవీ.. స్టార్ చేతికి
స్టార్ ఇండియా గ్రూప్‌లోకి మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా ⇒ మా టీవీలో వాటాలు విక్రయించిన నిమ్మగడ్డ, చిరంజీవి, నాగార్జున ⇒ మొత్తం 100 శాతం బ్రాడ్‌కాస్టింగ్ అసెట్స్ స్టార్ ఇండియాకి విక్రయం ⇒ ఒప్పందం విలువ చెప్పడానికి నిరాకరించిన ప్రమోటర్లు ⇒ డీల్ విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మా టీవీకి చెందిన నాలుగు తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు ప్రకటించింది. ఈ స్టార్ ఇండియా గ్రూప్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు సబ్సిడరీ సంస్థ. రూ. 2,000 కోట్ల టర్నోవర్‌తో మార్కెట్ పరిమాణం పరంగా దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించడంపై స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వినోదచానల్స్ రంగంలో మా టీవీ 27 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉందన్నారు. కానీ మా ప్రమోటర్లతో చేసుకున్న కొనుగోలు ఒప్పందం విలువను చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అయితే పరిశ్రమవర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చని అంచనా. మా టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసిద్ధ ఇన్వెస్టరు నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం, సినీనటులు చిరంజీవి కుటుంబానికి 20 శాతం, నాగార్జున కుటుంబానికి 10 శాతం వాటా ఉంది. మిగిలిన 5 శాతం వాటాను చిన్న ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు ప్రధాన ప్రమోటర్లు ఇప్పటి వరకు మా టీవీలో సుమారు రూ. 100 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ మా టీవీ కొనుగోలుతో తాము దక్షిణాదిలో అన్ని భాషల్లోకి ప్రవేశించనట్లయ్యిందని అన్నారు. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇప్పటికే స్టార్ గ్రూపు ఉన్న విషయం విదితమే. ఈ ఒప్పందానికి ఇంకా నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉందని, రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంచి విలువ రాబట్టే... తమ హోల్డింగ్ కంపెనీ మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన ‘మా’ బ్రాండు చానళ్లను, బ్రాడ్ కాస్టింగ్ అసెట్స్‌ను స్టార్ ఇండియాకి విక్రయించాలని బోర్డు నిర్ణయించిందని, మా టీవీ టెలివిజన్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ మాత్రం తమ వద్దే ఉంటుందని మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. గత ఏడేళ్ళుగా పడ్డ శ్రమకు విలువ లభించిందని, మంచి విలువ రావడంతో వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాము మా టీవీని కొనుగోలు చేసినప్పుడు 125 మంది ఉద్యోగులు ఉండే వారని, ఇప్పుడు వారి సంఖ్య 500 దాటిందన్నారు. ప్రస్తుతం మా టీవీ రూ. 350 కోట్ల ఆదాయంపై రూ. 50 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా శంకర్ తెలిపారు. మీడియా సమావేశంలో సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్‌లు కూడా పాల్గొన్నారు. ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొనసాగుతుంది.. ఈ వాటాల విక్రయం జరిగినా నాగార్జున సేవలను ‘మా’ టీవీకి వినియోగించుకుంటామని స్టార్ గ్రూపు ప్రకటించింది. నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు... ఈ కార్యక్రమం కొనసాగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అతని సేవలను వినియోగించుకుంటామని ఉదయ్ శంకర్ చెప్పారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో గతేడాది 52 వారాల్లో మా టీవీ 45 వారాలు తొలి స్థానంలో ఉండటమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో 16వ స్థానంలో ఉందన్నారు. మా టీవీ కొనుగోలు ఒప్పంద వివరాలను వెల్లడిస్తున్న స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, మా టెలివిజన్ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్. పక్కన చిరంజీవి, నాగార్జున, అరవింద్‌లు -
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
-
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
హైదరాబాద్ : తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ ఇండియా గ్రూప్ ఎంటరైంది. మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్‌లో మాటీవీ భాగం కానుంది.కొన్ని వాటాలను మాటీవీ...స్టార్ గ్రూప్‌కు విక్రయించింది. మాటీవీ మేనేజ్మెంట్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాటీవీతో ఒప్పంద వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టైఅప్‌తో ఆ లోటు తీరిందన్నారు. అయితే బ్రాడ్కాస్ట్ బిజినెస్‌లో భాగస్వాములం మాత్రమేనని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్...స్టార్‌గా మారుతుందన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
ఆహుతి ప్రసాద్ చివరి ఇంటర్వ్యూ
-
కోటీశ్వరుడు మళ్లీ రెడీ!
తెలుగు టీవీ చరిత్రలో సరికొత్త సంచలనాలకు వేదికగా నిలిచిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో రెండో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘మా’ టీవీలో తొలి సీజన్ విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా వ్యవహరించిన కథానాయకుడు నాగార్జున మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సన్నద్ధమవుతున్నారు. ‘‘ఈ షోలో పాల్గొనడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు (అక్టోబర్ 9) రాత్రి 7 గంటలకు ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ఎంపికైన వారు హాట్ సీట్‌కు చేరుకోవడంతో పాటు, కోటి రూపాయల నగదు గెలుచుకునే సువర్ణావకాశాన్ని పొందుతారు. తొలి సీజన్ బుల్లితెరపై ఎన్నో రికార్డులు నమోదు చేసింది. విజ్ఞానాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం ద్వారా హృదయాన్ని కలచివేసే ఎన్నో జీవితగాథలు వెలుగులోకొచ్చి ఎందరికో స్ఫూర్తినిస్తోంది’’ అని ‘మా’ టీవీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు http://mek.maatv.com లో చూడవచ్చు. -
కథ కంచికి వెళ్లిపోయింది.. చరిత్ర మాత్రం మిగిలింది!
ఏయన్నార్ జయంతి స్పెషల్ సుమారు 60 మంది హీరోయిన్లతో స్టెప్పులేసి, డ్యూయెట్లు పాడి, రొమాన్స్ చేసి, ఆ రోజుల్లో ఓ కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని కలలోకి ఏ హీరోయిన్ రాలేదా? ఇదే మాట ఆయన్నే నేరుగా అడిగితే ‘ఎందుకు రాలేదు... వచ్చింది... కాకపోతే ఆమె హీరోయిన్ కాదు’ అని అన్నారాయన. హీరోయిన్ కాకపోతే ఇంకెవరయి ఉంటారు? మనసుకి నచ్చిన ప్రతి వారితో ఎంతో చనువుగా ఉంటారాయన. అలాంటిది ఆయన కలల్లోకి చొరబడే ఆ డ్రీమ్‌గర్ల్ ఎవరై ఉంటారు? ‘అమ్మో... నేన్చెప్పనుగాక చెప్పను’ అంటూ ఓ రెండు మూడు రోజులు బతిమాలించుకుని ఆ రహస్యాన్ని బయటపెట్టారాయన - ‘సూర్యకాంతం’ అని. ఈ మాట ఎవరు విన్నా ఆశ్చర్యపోతారు. ఆయన మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటారు. కానీ ఇది నిజం. ‘భార్యాభర్తలు’ షూటింగ్లో... ఓ సీన్లో ఆవిడ అద్దం ముందు కూచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. ఆవిడ వెనక సోఫాలో నేను కూచొని ఉన్నాను. లావుగా ఉన్నా కళ గల ముఖం అనుకున్నాను. అంతే... అదే సబ్ కాన్షియస్‌లో రిజిస్టర్ అయిపోయిందనుకుంటాను... అదే రోజు రాత్రి ఆవిడ కల్లోకొచ్చింది. ‘ఏ.. ఏ.. ఏ..’ అంటూ పెద్ద అరుపుతో లేచి కూచున్నాను. ‘‘ఏంటండీ... ఏమయ్యింది... ఎప్పుడూ ఇలా నిద్దట్లో అరవలేదు?’’ అంటూ అడిగింది అన్నపూర్ణ. ‘‘సూర్యకాంతం కల్లోకొచ్చింది’’ అని చెప్పాను. అంత అర్ధరాత్రిలోనూ మా ఆవిడ ఒకటే నవ్వు ‘‘ఏ సావిత్రో, జమునో, కృష్ణకుమారో రాకుండా సూర్యకాంతం ఏమిటండీ మరీనూ?’’ అంటూ. ‘‘ఈ ఎక్స్‌పీరియెన్స్ నేను షూట్ చేసుకుంటాను’’ అని అడిగాను. ‘‘వద్దు... పెద్దావిడ... బావుండదు... పైగా ఆవిడ నన్ను ‘తమ్ముడూ’ అని అంటుంది. పత్రికల్లోకైతే ఓకే గానీ విజువల్‌గా వద్దు. పాఠకులు అర్థం చేసుకోగలరు గానీ ప్రేక్షకులు వాళ్లలా ఆలోచించలేరు’’ అని అన్నారు. అంత క్లియర్ కన్విక్షన్ ఉన్న వ్యక్తి ఆయన. అలానే కమిట్మెంట్ విషయంలో కూడా అటువంటి వ్యక్తిత్వం మరొకరిలో కనబడదు. ‘మా టీవీ’ కోసం చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ షూటింగ్ టైమ్‌లో ‘ఆయనొస్తే కూచోబెట్టండి’ అని ఓ కుర్చీ వేయించి, పక్కన ఇంకేమైనా మంచి లొకేషన్లు ఉన్నాయా అని చూడడానికి వెళ్లి వచ్చేలోగా ఆయనొచ్చి కూచునేవారు. నేను రాగానే లేచి నిలబడేవారు. ‘‘మీకన్నా దాదాపు ముఫ్ఫై ఏళ్ళు చిన్నవాణ్ణి సార్...’’ అని సిగ్గుపడిపోతుంటే ‘‘ఇక్కడ మీరు డెరైక్టరు... నేను మిమ్మల్ని గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది’’ అనేవారు అక్కినేని. షూటింగ్ ముగియగానే ‘‘మళ్లీ ఎప్పుడుండొచ్చు?’’ అని అడిగేవారు. ‘‘రెండు రోజుల ముందు నుంచీ ఎర్లీగా పడుకోవాలి. షూటింగ్ టైమ్‌లో ముఖం ఫ్రెష్‌గా కనిపించాలి కదా!?’’ అనేవారు. అంత బాధ్యత ఫీలయ్యే నటీనటులు ఇవాళ ఎంతమంది ఉండి ఉంటారు? అంతవరకూ మనల్ని పేరు పెట్టి పిలిచే అక్కినేని ఒకసారి షూటింగ్ టైమ్ గనుక ఫిక్స్ అయితే ఇంక ఆయన నుంచి వచ్చేది ‘ఓకే సర్’ అనే. ఆ ‘సర్’ అనే పదం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఉంటుంది. ప్యాకప్ అయిన వెంటనే మాయమైపోతుంది. మనల్ని మన పేరుతోనే పిలుస్తారు. మనసుకి, మెదడుకి ఎంతో శిక్షణ ఇస్తేనే గాని ఇంతటి క్రమశిక్షణ సాధ్యం కాదు. చాలా విషయాలు నాతో పంచుకునే వారాయన. ‘‘సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు వీలైతే ఓసారి రండి’’ అని ఫోన్ చేసేవారు. కారప్పూస, టీ ఆయన ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. వెళ్లేసరికి ఇద్దరికి రెడీగా ఉండేది. ఇక కబుర్లే కబుర్లు. ‘‘కొన్ని పాత్రలు నేను వెయ్యకపోతే అవి ఎందుకు వెయ్యటం లేదో, వాటి గురించి ఎన్టీఆర్‌కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాణ్ణి. ఎందుకంటే తర్వాత అప్రోచ్ అయ్యేది ఆయన్నే కాబట్టి’’ అని చెప్పారు ఏయన్నార్. ‘గుర్తుకొస్తున్నాయి’ తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించాల్సి వచ్చేది. ఉదాహరణకి ‘పూజాఫలం’ సినిమాలో ఆయన పక్కన వేసింది జగ్గయ్య అని నేనూ, కాదు రమణమూర్తి అని ఆయనా వాదించుకున్నాం. ఒక్క క్షణం ఆలోచించి ‘‘వద్దు... మీ వెర్షనే కానివ్వండి. యూ ఆర్ ది కెప్టెన్’’ అని మనస్ఫూర్తిగా నేననుకున్న వెర్షన్‌కే తన అనుభవాల్ని చెప్పారు. మర్నాడు సరిగా ఉదయం 6 గంటలకి... ఏయన్నార్ గారి దగ్గర్నుంచి ఫోన్... ‘‘మీరే కరెక్ట్. ‘పూజాఫలం’లో నా పక్కన యాక్ట్ చేసింది జగ్గయ్యే. మరి రమణమూర్తి అని ఎలా పొరబడ్డానో ఏమిటో?’’ అంటే, ‘‘ఐయామ్ సారీ... షూటింగ్ టైమ్‌లో నేను మీతో అలా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది కాదు’’ అని ఆయన అంటూంటే ఆ సంస్కారం ముందు అంగుష్ఠమాత్రుణ్ణయిపోయా. నేనేది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కఠి నంగా తీసుకున్న నిర్ణయాలు కూడా నా మీద అభిమానంతో సడలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి - ఇక జీవితంలో అడుగు పెట్టనన్న సారథీ స్టూడియోస్‌లో దాదాపు ముప్ఫై ఏళ్ల తర్వాత తిరిగి అడుగు పెట్టడం. నేను జీవితాంతం గర్వంగా చెప్పుకోగలిగిన సంఘటన అది. ‘గుర్తుకొస్తున్నాయి’ 74 ఎపిసోడ్లు. తెరపై ఏయన్నార్, సుమ తప్ప ఇంకెవరూ కనిపించరు. 74 ఎపిసోడ్లు తెరపై కేవలం ఇద్దరే... టెలివిజన్ చరిత్రలో అదొక రికార్డ్. ‘నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు గుండెల్లో దాచుకున్న రహస్యాలతో సహా అన్నీ కవర్ చేసేశారు మీరు. ఈ వయసులో కూడా నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని ప్రేక్షకులకి రుజువు చేశారు. నా ఆనందం కొద్దీ ఇస్తున్నాను. కాదనకండి’’ అంటూ ఓ చెక్ ఇచ్చారాయన. ‘నా ఉద్యోగ ధర్మంగా నాకెంతో ఇష్టమైన మీ గురించి చేశాను. నేనిలా తీసుకోకూడదు’’ అన్నాను. దానికాయన ఎంత మురిసిపోయారో - ‘ఐ లైక్ యువర్ క్యారెక్టర్’ అంటూ అంతటితో ఊరుకోలేదు. నేను పని చేసిన ‘మా టీవీ’ యాజమాన్యాన్ని ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని, డబ్బుగా ఉంటే ఖర్చయిపోతుందని ఓ బంగారు కంకణం చేయించి ఆయనకు చూపించాను. ‘‘మంచి పని చేశారు. ఉంచండి. ఎప్పటికైనా ఆ కంకణాన్ని నేను మీకు తొడుగుతాను’’ అని అన్నారు అక్కినేని. ఇవాళ... కథ కంచికి వెళ్లిపోయింది... చరిత్ర మాత్రం మిగిలింది... బంగారంలాంటి ఆయనే లేరు. ఆ బంగారు కంకణం మాత్రం ఆయన తొడగకుండానే మిగిలిపోయింది ఆయన గుర్తుగా...!! - రాజా, మ్యూజికాలజిస్ట్, raja.musicologist@gmail.com -
కోటీశ్వరుడు’కు అతిథిగా చిరంజీవి
బుల్లితెర వీక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న షో - ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ నాగార్జున తొలిసారిగా టీవీ రంగానికి వచ్చి, ఈ పాపులర్ ఫార్మట్ షోకు అతిథేయిగా వ్యవహరించడం జూన్ 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కొత్త అందం తెచ్చింది. విపరీతంగా వీక్షకాదరణ సాధించి, టి.ఆర్.పి.లు తెచ్చుకున్న ఈ కార్యక్రమం తొలి సీజన్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. గురువారం రాత్రి 9 గంటలకు ‘మా’ టి.వి.లో ప్రసారం కానున్న 40వ ఎపిసోడ్‌తో ప్రస్తుతానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వీక్షకులకు టాటా... వీడుకోలు చెప్పనుంది. ఈ చివరి భాగానికి చిరంజీవి విశిష్ట అతిథిగా రావడం విశేషం. సామాజిక మార్పు తేవాలన్న దృక్పథంతో చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ‘మా’ టీవీ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ఎంతోమంది సామాన్యుల కలల్ని ప్రతిఫలిస్తూ, జీవితాలను మార్చేందుకు తోడ్పడిన ఈ షోలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది దాకా ఆసక్తి చూపించారు. బిగ్ సినర్జీ సంస్థ ఈ 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఏమైనా, నాగార్జున, చిరంజీవి కలసి కనిపించే రేపటి ఎపిసోడ్ వీక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేయడం ఖాయం. అని వేరే చెప్పాలా? -
ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున
స్టార్ హోదా నుంచి టీవీ షోలలో స్టార్ లాంటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు హోస్ట్‌గా కొత్త వేషంలోకి హీరో నాగార్జున సులభంగానే పరకాయ ప్రవేశం చేశారు. ఈ నెల ప్రథమార్ధం నుంచి ‘మా’ టి.వి.లో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో తొలివారంలో మంచి టి.ఆర్.పి.లు సాధించింది. సామాన్యులు సైతం సంపన్నులయ్యేందుకు అవకాశమిచ్చే ఈ షో గురించి నాగ్ తో జరిపిన సంభాషణ. బుల్లితెరపై మీ తొలి షో ఇది. ఎలా ఉంది మీ అనుభవం? సినిమా ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఈ షో నాకు పరిచయం చేసింది. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఈ షో ఉపకరించింది. స్టార్‌డమ్‌కి అతీతమైనది ఇది. ‘అన్నమయ్య’, ‘మనం’ చిత్రాల ఘనవిజయం ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో, ఈ ‘షో’ విజయం కూడా అంతే ఆత్మసంతృప్తినిచ్చింది. ఈ షో ద్వారా సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా ఉంది? వాళ్ల సొంత మనిషిలా మారిపోయి, సమస్యలను వింటున్నాను. వాళ్ల సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను కూడా. ఒక సినిమా పరాజయం పాలైతే తెగ బాధపడిపోతుంటాం. కొంతమందైతే నెలల తరబడి బయటకు రారు. రేపెలా గడుస్తుందోనని ఈ రోజు రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపేవారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చిన్న సమస్య అనిపిస్తోంది. పోటీలో పాలుపంచుకునేవారి సమస్యలు విన్న తర్వాత ‘వీళ్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే బాగుంటుంది’ అనిపిస్తోందా? కొంతమంది జీవితం మొత్తం సమస్యలే. వాళ్లు ఎక్కువ డబ్బు గెల్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు, ‘సమాధానం తెలిస్తే బాగుంటుంది’ అనే టెన్షన్ నాకు మొదలవుతుంది. ఇన్నేళ్లూ కష్టాలు పడ్డారు కదా.. కనీసం ఇక్కడైనా వాళ్ల కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగని, ప్రశ్నలు ముందే లీక్ చేయలేను.. సమాధానాలు కూడా బయటపెట్టలేను. ఒక్కోసారైతే నాకు తెలియకుండా క్లూ ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. కానీ, అది చేయకుండా జాగ్రత్తపడతాను. రకరకాల వయసుల వాళ్ళను కలుసుకోవడం, వారి కష్టనష్టాలు వినడం వల్ల అందరి మనస్తత్వాలూ తెలుసుకునే వీలు కలుగుతోంది. సుబ్బలక్ష్మి గారనే పెద్ద వయసు ఆవిడైతే చాలా బాగా ఆడారు. చక్కగా జోక్‌లేసుకుంటూ సరదాగా సాగిందా ఎపిసోడ్. అందరితోనూ కనెక్ట్ కాగలుతున్నాను. ఈ షోలో పాల్గొన్న హెచ్ఐవీ పేషెంట్ భవాని జీవితం విన్నప్పుడు మీరు ఫీలైన వైనం స్పష్టంగా బుల్లితెర మీద కనిపించింది? భవానీ లైఫ్ విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. కానీ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం మెచ్చుకోదగ్గవి. తను 80వేల రూపాయలు గెల్చుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. 40వేలు గెల్చుకుంది. కానీ, ఇక్కణ్ణుంచి ఊరు తిరిగి వెళ్లేసరికి తన ఇంటి చుట్టుపక్కలవాళ్లు, ఇంతకొంతమంది స్వచ్ఛందంగా ‘మీ అబ్బాయిలకు ఫీజు కట్టు’ అని డబ్బులిచ్చారట. ఆ డబ్బంతా కలిపితే 20వేలయ్యాయని, భవాని ఫోన్ చేసి చెబితే, చాలా ఆనందం అనిపించింది. ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియకుండా మార్పొస్తుందని అమితాబ్ మీతో అన్నారు కదా.. మరి, ఇప్పటివరకు చిత్రీకరించిన ఎపిసోడ్స్ ద్వారా మీలో ఏమైనా మార్పును గ్రహించారా? వెంటనే పూర్తిగా మార్పు రావడం జరగదు కానీ, పాల్గొంటున్నవారి మాటలు విన్నాక నా ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకునే నేర్పు, అందరి సమస్యలూ వినే ఓర్పు వచ్చింది. ఎంతసేపూ మన సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఈ షో ద్వారా ఇతరుల సమస్యలను తెలుసుకోవడం, ఆలోచించడం మొదలైంది. ‘ఇలా కూడా బతికేస్తున్నారా.. ఇన్ని సమస్యలుంటాయా’ అనిపిస్తోంది. పేదరికం అనుభవిస్తున్నవారి జీవితాల గురించి విన్న తరువాత అవి మిమ్మల్ని ఇంటివరకూ వెంటాడుతున్నాయా? నేను ఇంటికెళ్లేసరికి మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే, ‘ఎలా జరిగింది’ అని అడిగి తెలుసుకుంటారు. అమల ఒక్కతే ఉంటే, ఒకవేళ నేను డల్‌గా కనిపిస్తే, ‘ఇవాళ చాలా సమస్యలు విని ఉంటాను’ అని ఫిక్స్ అయిపోతుంది. తను అడిగి తెలుసుకుంటుంది. ఈ షో చేయడం ద్వారా నా కుటుంబంలోనే ఓ మార్పు కనిపిస్తోంది. నాగచైతన్యని, అఖిల్‌ని కూర్చోబెట్టి, ‘వాళ్ల నాన్న జీతం నాలుగు వేలట.. ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడట’ అని చెబుతుంటాను. అదే నేను కావాలని వాళ్లకి ఏవేవో నీతులు చెబితే, ‘లెక్చర్ ఇస్తున్నాడు’ అనుకుంటారు. కానీ, స్వయంగా నేను విన్నవి చెప్పడంతో, వాళ్లు కూడా ‘ఇంతే సంపాదిస్తారా డాడీ... లైఫ్ ఇలా ఉంటుందా’ అంటున్నారు. సో.. ఈ షో మా కుటుంబానికి కూడా ఓ ఆదర్శమే. తల్లిదండ్రులు చెబితే పిల్లలు పెద్దగా వినరు. అదే, ఇలాంటి షోస్ చూస్తే, కొంతైనా స్ఫూర్తి పొందుతారు. మీరే కనుక ఈ పోటీలో పాల్గొంటే.. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేవారా? లేదు. చాలా ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. అది అవగాహన లేక. ఉదయం నిద్ర లేచి పేపర్ చదవడం, ఖాళీ దొరికితే టీవీలు చూడటం.. అంతవరకే. బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంవల్లే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు. ఈ షో చేయడం ద్వారా మన భారతీయ చరిత్ర గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నవి మర్చిపోతాం. అవన్నీ రీ కలక్ట్ చేసుకున్నట్లుగా ఉంది. ఫస్ట్ సీజన్ తర్వాత రెండోది కూడా కంటిన్యూ చేయాలనే ఆసక్తి ఉందా? ఇప్పటికైతే ఆ ఆసక్తి ఉంది. ఈ షో చేసే అవకాశం నాకు కాకుండా, మరో హీరోకు వచ్చి ఉంటే, కచ్చితంగా బాధపడేవాణ్ణి. ఈ ఫస్ట్ సీజన్ 45 ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత కచ్చితంగా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలగక మానదు. Follow @sakshinews -
ఇంకా రెండు రోజులే!
నాగార్జున తొలిసారిగా చేస్తున్న బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. మా టీవీలో జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే వారి ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. రోజుకో ప్రశ్న చొప్పున మా టీవీలో ఐదు రోజులుగా ప్రశ్నలు వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు ప్రశ్నలతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మే 1 రాత్రి 7 గంటల్లోపు ఈ ప్రశ్నలకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాధానాలు పంపాలని, కోటి రూపాయలు బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని మా టీవీ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.