ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
చెట్టుకు ఉరివేసుకున్న ‘అనంత’ విద్యార్థి
నెల్లూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న మధువర్దన్‌రెడ్డి
కదిరి: ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి పేరు ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉంది... ఏపీలోని పొట్టి శ్రీరా ములు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మధువర్దన్‌రెడ్డి అదే భూతానికి బలయ్యాడు. పదోతరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన మధువర్దన్ను తమ కళాశాలలో చేరమని యాజమాన్యం కోరడంతో అక్కడ తనకు ఏ లోటూ ఉండదని భావించి చేరాడు. నెల రోజులు కూడా తిరక్కుండానే ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు. ఆ విద్యార్థి తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా దొన్నికోటవారిపల్లికి చెందిన కాలువ రాజేశ్వరి, బ్రహ్మానందరెడ్డి దంపతుల రెండో కుమారుడు మధువర్దన్‌రెడ్డి టెన్త్‌లో 10కి 10 పాయింట్లు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరులో కళాశాల యాజమాన్యం... తమ కళాశాలలో ఇంటర్ చేరమని ఫోన్ చేసి కోరడంతో ఆ విద్యార్థి తండ్రి జూన్ 14న మధువర్దన్రెడ్డిని అక్కడ చేర్పించారు.
అక్కడ స్లిప్ టెస్టుల్లో మధువర్దన్‌రెడ్డి టాపర్‌గా నిలవడం కొందరిని అసూయకు గురి చేసింది. ఈ విషయం వారు సీనియర్ విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లడంతో... జూలై 11న అర్ధరాత్రి సమయంలో మధును రక్తం కారేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. మధువర్దన్‌రెడ్డి ఈ విషయాన్ని కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్‌ల దృష్టికి తీసుకెళ్లాడు. ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలని చెప్పి హాస్టల్ గదికి పంపేశారు. అయితే దీనిని అవమానంగా భావించిన మధు 12వ తేదీనే ఇంటికి వచ్చేశాడు. తండ్రి బ్రహ్మానందరెడ్డి ఫోన్‌చేసి అడిగితే యాజమాన్యం నుండి సరైన సమాధానం రాలేదు. కొత్తలో ర్యాగింగ్ లాంటివి మామూలే.. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి.. అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇక ఆ కాలేజ్‌కు వెళ్లకూడదని, మరో కాలేజీలో చేరాలని మధు నిర్ణయించుకున్నాడు. అయితే 30వ తేదీన కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి మధు తండ్రికి ఫోన్ చే సి.. ఇంకోసారి అలా జరక్కుండా జాగ్రత్త పడతాం. మీ అబ్బాయిని పంపండని కోరారు. అయితే మీరే మాట్లాడండని ఆయన ఫోన్ మధుకి ఇచ్చారు. సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో మిద్దెపై కెక్కి మధు ఏం మాట్లాడాడో తెలీదు.. అరగంటకే తాను కాలేజ్‌కి వెళ్లేందుకు బట్టలు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి రాత్రంతా గాలించారు. శుక్రవారం ఉదయాన్నే వారి మామిడితోట సమీపంలోనే ఆ విద్యార్థి తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం నిలిపి ఉండటం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టూ వెదికితే సమీపంలోని మామిడిచెట్టుకు మధువర్దన్‌రెడ్డి ఉరేసుకొని వేలాడుతూ కన్పించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్పకూలారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నెల్లూరు జిల్లా పిడతాపోలూరులో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి మధువర్ధన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి శుక్రవారం ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సందర్శకుల గది, కళాశాల కిటికీలు, తలుపుల అద్దాలు ధ్వంసం చేశారు.
కళాశాలకు సంబంధంలేదు: ప్రిన్సిపల్
మధువర్ధనరెడ్డి కళాశాలలో చేరినప్పటి నుంచీ ముభావంగా ఉన్నాడని, ఇక్కడ చదువుకోవడమే ఇష్టం లేదన్నట్టు వ్యవహరించాడని ప్రిన్సిపల్ కిరణ్ చెప్పారు. ఈ నెల 28న తండ్రితోపాటు కళాశాలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చదువుకోనని గట్టిగా చెప్పాడని, కళాశాలను, గదిని ఖాళీ చేసి, ల గేజ్తోపాటు వెళ్లిపోయారని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్నారు.