Mahajani Socialist Party
-
‘దళిత సీఎం’ కోసం ఉద్యమం: మంద కృష్ణ
ఆకస్మికంగా ఒక రోజు నిరాహర దీక్ష హైదరాబాద్, దళితుడిని సీఎంని చేస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన హామీ నెరవే ర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు మంద కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు సోమవారం విఫలం చేశారు. సికింద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయం నుంచి బషీర్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకి అనుమతి లభించకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పరిణామాలకు నిరసనగా మంద కృష్ణ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా అధికార దాహంతో సీఎం కుర్చీలో కూర్చున్నాడని మండిపడ్డారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం లోపిం చిందని, కుటుంబ సభ్యులు, వెలమ, రెడ్లకే అధిక ప్రాధాన్యత లభించడంతో దొరల పాలన అని తేలిపోయిందన్నారు. మహిళలను కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంద కృష్ణ దీక్ష మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. -
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దు
పార్టీల నేతలకు మంద కృష్ణ బహిరంగ లేఖ హైదరాబాద్ : దళిత జాతిని మోసం చేసిన టీఆర్ఎస్ఎల్పీ నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ఎవరూ హాజరు కావొద్దని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ వివిధ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆ పీఠం మీద కూర్చునేందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ తాము నిరసన ర్యాలీ నిర్వహించి తీరుతామని చెప్పారు. -
పేదల అభ్యున్నతి కోసమే పార్టీ ఏర్పాటు
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : నిరుపేదల అభ్యున్నతి కోసమే మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ)ని స్థాపించామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎంఎస్పీ జెండాను అనంతరం సభలో ఆయన మాట్లాడారు. బడుగుబల హీన వర్గాల అభివృద్ధిని ప్రస్తుత పాలకు విస్మరించారని, కేవలం వారి స్వలాభాల కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏనాడూ ఆ వర్గాల కోసం అసెం బ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకు లు ఆచరలో పెట్టడం లేదన్నారు. ఎన్నికల సమ యం సమీపిస్తుండడంతో అనేక పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రజలను మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మంద కృష్ణ మండిపడ్డారు. పాలకులు మారుతున్నారే గానీ ప్రజల తలరాత మారడం లేదన్నారు. మహాజన సోషలిస్టు పార్టీతో రాజ్యాధికారం చేపట్టి స్వరాష్ట్ర పాలనను సాధించుకుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి తెలంగాణ వాది సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం ఇగ్నో యూనివర్సీటీ ఫ్రొఫెసర్ రీయాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని, దొరల తెలంగాణ కాదన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలు కేవలం సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, ప్రజలకోసం కాదన్నారు. పేదలు దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ధనికులు మాత్రం మేడలపై మేడలు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్ధన్నపేట బరిలో మంద కృష్ణ!
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బరిలోకి దిగనున్నారు. మండలంలోని దివ్య గార్డెన్సలో రెండురోజుల పాటు నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరంగల్‌లోని న్యూశాయంపేట మందకృష్ణ మాదిగ స్వస్థలం. వర్ధన్నపేట నియోజకవర్గం ఈ ప్రాంతానికి సమీపంలో ఉండడం, హసన్‌పర్తి, హన్మకొండ మండలాలు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మందకృష్ణ మాదిగ బంధువులు, స్నేహితులు ఎక్కువ సంఖ్యలో ఉండడం కూడా ఇంకో కారణంగా కనిపిస్తోంది. అంతేకాక ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడినుంచి పోటీ చేస్తే సులభంగా విజయం సాధించవచ్చనేది మందకృష్ణ ఆలోచనగా చెబుతున్నారు. సంవత్సర కాలంగా.. వర్ధన్నపేట నియోజకవర్గంపై సంవత్సర కాలంగా మందకృష్ణ మాదిగ ప్రత్యేక దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలు తదితర వాటిని ఇక్కడే ఎక్కువ నిర్వహించారు. ఇటీవల వర్ధన్నపేటలో వితంతువులు, వృద్ధుల సభతోపాటు వికలాంగుల సమావేశాలు కూడా నిర్వహించారు. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ అమరుల తల్లుల కడుపుకోత సభకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.