‘దళిత సీఎం’ కోసం ఉద్యమం: మంద కృష్ణ
ఆకస్మికంగా ఒక రోజు నిరాహర దీక్ష
హైదరాబాద్, దళితుడిని సీఎంని చేస్తానన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన హామీ నెరవే ర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు మంద కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు సోమవారం విఫలం చేశారు. సికింద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయం నుంచి బషీర్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకి అనుమతి లభించకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పరిణామాలకు నిరసనగా మంద కృష్ణ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా అధికార దాహంతో సీఎం కుర్చీలో కూర్చున్నాడని మండిపడ్డారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం లోపిం చిందని, కుటుంబ సభ్యులు, వెలమ, రెడ్లకే అధిక ప్రాధాన్యత లభించడంతో దొరల పాలన అని తేలిపోయిందన్నారు. మహిళలను కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంద కృష్ణ దీక్ష మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.