'మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే విభజన'
హైదరాబాద్: రాష్ట్రంలోని మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపాలిని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూల్చితే ఊరుకోం అని హెచ్చరించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో తమ పదవులకు రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని బొత్స తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. రాజీనామాలు చేస్తే శాసనసభలో సమైక్యవాణి ఎవరు వినిపిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో రూపొందించిన తీర్మానంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తాను కూడా సంతకాలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని 5 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల సమస్యలను ఎలా అధిగమిస్తామనేది ఆలోచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోనే అన్ని అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేసినందున ఈ సమస్య ఏర్పడిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ లబ్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌పై నిందలు వేసినా, విగ్రహాలను విధ్వంసం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలంతా వెంటనే ప్రతిఘటించాలని బొత్స పిలుపునిచ్చారు.