Man of the series
-
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
టెస్టు బ్యాట్స్‌మెన్‌ని కదా అందుకే : పుజారా
టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా ఎండార్స్మెంట్లతో ఎడాపెడా సంపాదిస్తుంటే.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. పుజారా అడ్వర్టైజ్ ఏజెన్సీలను ఆకర్షించలేకపోతున్నాడు. అయితే ఈ విషయం గురించి తాను ఏనాడు చింతించలేదని , దేశం కోసం ఆడటం మాత్రమే తనకు ముఖ్యమని పుజారా పేర్కొన్నాడు. బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కారణంగా పెద్దగా ఎండార్స్మెంట్ ఆఫర్లు రావన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదించడం మాత్రమే నాకు తెలుసు. స్వప్రయోజనాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మాత్రమే ఆడాలని మా నాన్న చెప్పారు. ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదించడం కంటే కూడా భారత్ తరఫున ఆడటమే గొప్పగా భావిస్తాను’ అని పుజారా వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. ఇక ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి మూడు సెంచరీలు సాధించిన పుజారా 521 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
గంగూలీ, యువరాజ్ సరసన విరాట్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్.. వెస్టిండీస్‌తో జరిగిన అయిదు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్) ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్లో 7 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వివ్ రిచర్డ్ష్, రికీ పాంటింగ్, హషీం ఆమ్లా సరసన చేరాడు. (చదవండి : ముగింపు అదిరింది) కాగా, ఈ కేటగిరిలో 15 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో నిలవగా.. 11 అవార్డులతో సనత్ జయసూర్య, 9 అవార్డులతో షాన్ పొల్లాక్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. తాజా వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్‌లో 140, రెండో మ్యాచ్‌లో 157, మూడో మ్యాచ్‌లో 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన 5 వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్ శామ్యూల్స్ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్ ఓవర్‌తో పాటు కనీసం ఒక వికెట్ తీయడం గమనార్హం. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. -
‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కుర్రాళ్లంతా స్టార్ క్రికెటర్లే!
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ భవిష్యత్తు క్రికెటర్లను తీర్చిదిద్దే టోర్నీ. ఆస్ట్రేలియా వేదికగా 1998లో యూత్ వరల్డ్‌కప్‌గా ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్ 4 ట్రోఫీలందుకొని ప్రథమ స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ టోర్నీ ద్వారా అనేక మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు సాధించారు. ప్రతిభ కనభర్చిన ప్రతి ఒక్కరికి అవకాశం రాకున్నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ప్రతి కుర్రాడు స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. గత 18 ఏళ్లుగా ఈ టోర్నీ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో భారత్ తొలి ప్రపంచకప్ సాధించగా యువరాజ్ మ్యాన్ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. అనంతరం యువరాజ్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. భారత్ అందుకున్న టీ20 వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషించగా 2011 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 2002లో జింబాంబ్వే స్టార్ క్రికెటర్ టాటెండా టైబు మ్యాన్ ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. 2004లో ప్రస్తుత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2006లో ప్రస్తుత టీమిండియా నయావాల్, టెస్టు స్పెషలిస్టు చతేశ్వరా పుజారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2008లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ టిమ్ సౌతి, 2010లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిక్స్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్లందుకున్నారు. 2012లో ఆస్ట్రేలియా క్రికెటర్ విలియమ్ బోసిస్టో అందుకోగా 2014లో ప్రస్తుత దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు. 2016లో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహిదీ హసన్ ఈ ఘనతను సోంతం చేసుకున్నాడు. ఇక 2018లో భారత యువకెరటం శుభ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డుల నేపథ్యంలో శుభ్‌మన్ సైతం త్వరలోనే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. -
రైతు బిడ్డ..ఈ అండర్-19 సూపర్ హీరో
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్‌ను ఆరాధ్యా దైవంగా భావించే భారత్‌లో క్రికెటర్‌గా ఎదగాలంటే సులవైన వ్యవహారం కాదు. దానికి ఎంతో నిబద్దత ఎన్నో రోజుల నిరీక్షణ అవసరం. అలానే ఓ రైతు బిడ్డా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో కేవలం చదువులపైనే దృష్టిపెట్టాలని చెప్పే తండ్రులున్నారు. కానీ ఓ తండ్రి కొడుకు ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సాహించడంతో ఆ కుర్రాడు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అదర గొట్టి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడే సూపర్ హీరో శుభమన్ గిల్. అవును శుభమన్ రైతు బిడ్డే. బ్యాట్ పట్టింది పొలాల్లోనే.. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందని అతని తండ్రి లఖ్వింధర్ వ్యవసాయ దారుడు. శుభ్‌మన్ నాలుగేళ్లప్పుడే బ్యాట్ చేత పట్టుకోని పొలాల్లో ఆడేవాడు. కొడుకు ఇష్టంను గుర్తించిన తండ్రి తన పొలంలోని సహాయకులను బంతులు విసరమనేవాడు. ఇలా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న శుభమన్ ఏడేళ్లు వచ్చేప్పటికే క్రికెట్‌నే కెరీర్‌గా నిశ్చయించుకున్నాడు. కోడుకు కోసం ఆ తండ్రి సొంత ఊరు, పొలాలను వదిలి కుటుంబాన్ని మోహాలీకి తరలించారు. బింద్రా స్టేడియం సమీపంలోనే అద్దె ఇళ్లు తీసుకొని శుభ్‌మన్‌కు శిక్షణ ఇప్పించారు. తాను ఇంతలా రాణించడానికి కారణం తన తండ్రేనని, ఆయన పాత్ర ఎంతో కీలకమని శుభ్‌మన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు . చదువు, క్రికెట్‌ను సమన్వం చేయడంలో శుభమన్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. రోజుకు కనీసం నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. తినడం, జిమ్, యోగా, ప్రాక్టీస్ చేయడం, పడుకోవడమే అతని లోకం. దీంతో సరిగ్గా స్కూల్‌కు వెళ్లేవాడు కాదు. శుభ్‌మన్ ఎన్నో వయసు గ్రూప్ లీగ్‌లు ఆడాడు. అండర్-16 అంతర్ జిల్లా టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 356 పరుగులు చేశాడు. అండర్-16 జట్టులో పంజాబ్ తరుపున డబుల్ సెంచరీ బాదాడు. స్థిరత్వంతో బ్యాటింగ్ చేస్తుండటంతో అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతిలో పడి మరింత రాటు దేలాడు. ఇంగ్లండ్‌లో జరిగిన యూత్ వన్డే టోర్నీలో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అందుకున్నాడు. నిజానికి గత అక్టోబర్‌లోనే శుభ్‌మన్‌కు భారత్-ఏ జట్టు తరుపున న్యూజిలాండ్-ఏపై ఆడే అవకాశం వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆడలేక పోయాడు. పంజాబ్ తరుపున విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. అప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆరాధ్యదైవమని, క్రికెట్ చూడటం ప్రారంభించనప్పుడే మాస్టర్ లెజెండ్ క్రికెటరని ఈ సూపర్ హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానిస్తానని, తన బ్యాటింగ్ శైలి, ఒత్తిడి అధిగమించే విధానం ఎంతో ఇష్టమని తెలిపాడు. కోహ్లిని అనుసరించాడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ అది చాల కష్టమని ఈ యువ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో సైతం శుభ్‌మన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రూ.20 లక్షల కనీస ధరైన ఈ యువ క్రికెటర్‌ను అనూహ్యంగా రూ.1.8 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఇదే ఊపుతో ఐపీఎల్లో రాణిస్తే శుభ్‌మన్ భారత జట్టులో చోటు సంపాదించుకోవడం కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి సారథ్యంలో ఆడటమే నాకల శుభ్‌మన్ మ్యాన్ ది టోర్నీ అందుకోవడంపై అతన తండ్రి లఖ్వింధర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలానే ఫామ్ కొనసాగించి భారత్ జట్టుకు ఎంపిక కావాలని, కోహ్లి సారథ్యంలో శుభ్‌మన్ ఆడటమే తన కోరిక అని చెప్పుకొచ్చాడు. -
ఆఖరి వన్డేలో లంక విజయం
సిరీస్ 4-2తో న్యూజిలాండ్ కైవసం వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు ఓదార్పు విజయంతో ముగించింది. గురువారం జరిగిన చివరిదైన ఏడో వన్డేలో పర్యాటక జట్టు 34 పరుగులతో నెగ్గింది. అయితే సిరీస్‌ను మాత్రం ఆతిథ్య జట్టు 4-2తో దక్కించుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (105 బంతుల్లో 113 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో పాటు ఫామ్‌లో ఉన్న దిల్షాన్ (98 బంతుల్లో 81; 5 ఫోర్లు; 1 సిక్స్) మరోమారు బ్యాట్ ఝుళిపించడంతో లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వీరు 104 పరుగులు జోడించారు. అండర్సన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 45.2 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోంచి (42 బంతుల్లో 47; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. ఈ మ్యాచ్ ద్వారా సంగక్కర వన్డేల్లో అత్యధిక (474) అవుట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గిల్‌క్రిస్ట్ (472) పేరిట ఉండేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంగక్కర, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కేన్ విలియమ్సన్ ఎంపికయ్యారు.