సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్
బాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3' విడుదలకు రెడీగా ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం తగ్గకుండా కత్రీనా కైఫ్ కూడా భారీ యాక్షన్స్ సీన్స్‌లలో మెప్పించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య టైగర్-3 నవంబర్ 12న విడుదల కానుంది.
టైగర్-3కి పోటీగా ఈ సారి తమిళ సినిమాలు జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నాయి. నేడు (నవంబర్ 10)న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ మరాఠీలో మన తెలుగు డైరెక్టర్ తీసిన 'నాళ్- భాగ్ 2' సినిమా కూడా నేడు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ టైగర్-3 ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది.
మరాఠీలో 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాతో సుధాకర్ రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పట్లో అక్కడ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2 మీద అంచనాలు పెరిగాయి. నాళ్-2 చిత్రాన్ని జీ -స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా మొదటి పార్ట్‌కు జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా నాళ్-2 మూవీకి సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రానికి పోటీగా మన తెలుగోడు డైరెక్ట్ చేసిన చిత్రం బరిలో ఉంది.
సుధాకర్ రెడ్డి ఎవరు..?
ఎక్కంటి సుధాకర్ రెడ్డిది అంధ్రప్రదేశ్‌లోని గుంటురు జిల్లా.. హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. తెలుగులో పౌరుడు, మనసారా, మధుమాసం, దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలతో పాటు పలు ఉత్తరాది చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అమితాబ్ బచ్చన్ 'ఝుండ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశాడు. 2018లో 'నాళ్' (మరాఠి) సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది.
నాల్ సినిమా కథకు మూలం ఎంటి?
నాల్.. మారాఠీలో 2018లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం. తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు.