టీడీపీ నేతల వేధింపులతో వివాహిత ఆత్మహత్య
స్టోరు తీసేస్తాం, పింఛను తొలగిస్తామని బెదిరించినట్టు
మృతురాలి బంధువుల ఆరోపణ
మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరామర్శ
అనంతపురం కార్పొరేషన్ : టీడీపీ నేతల వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనకూడేరు మండలం కొర్రకోడుకులో బుధవారం జరిగింది. మృతురాలి భర్త, బంధువులు, కూడేరు వైస్ ఎంపీపీ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికలాంగుడైన ఉల్లా ఉద్దీన్, అస్మిత భార్యభర్తలు. ఉల్లా ఉద్దీన్ యూనిమేటర్గా పనిచేస్తున్నారు. సుమారు 18 నెలల నుంచి వేతనం రావడంలేదు. ఇతనికి రేషన్ దుకాణం ఉంది. వికలాంగుల పింఛను పొందుతున్నాడు. ఉల్లా ఉద్దీన్, ఆయన బంధువులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. ఇదీ ఓర్వలేని టీడీపీ నేతలు కొందరు ఇది మా ప్రభుత్వం.. నీ స్టోరు తీసేస్తాం.. నీ పింఛను తొలగిస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ రెండు పోతే తాము బతకలేమని భయపడిన అస్మిత మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భౌతికకాయూన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
అల్లా ఉద్దీన్ భార్య అస్మిత ఆత్యహత్య సమాచారం తెలుసుకున్న ఉరవకొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మార్చురీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మృతురాలి భర్త, బంధువులను పరామర్శించారు. అస్మిత ఆత్మహత్య చేసుకొనేందుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు.