Maryam Nawaz
-
పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా మరియం
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్(50) చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లుండగా ముఖ్యమంత్రి అభ్యర్థికి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్–ఎన్ 137 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు పీఎంఎల్–ఎన్‌కు మద్దతు పలికారు. శనివారం సీఎం ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో మరియంకు 220 ఓట్లు పడ్డాయి. పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. -
ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని కుమార్తె!
లాహోర్ : తన తండ్రిని చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తండ్రికి చికిత్స చేస్తున్న ఆస్పత్రిలోనే చేర్పించారు. అనేక పరిణామాల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియమ్ నవాజ్‌కు కూడా స్థానిక కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవాజ్ షరీప్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సోమవారం రాత్రి లాహోర్ ఆసుపత్రిలో చేర్పించారు. బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే నవాజ్ కుమారుడు మాత్రం జైలులో నవాజ్‌పై విష ప్రయోగం జరిగినందువల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న నవాజ్ కుమార్తె మరియమ్ తండ్రిని చూడాలని కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో ఒక గంట పెరోల్‌పై ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాగా నవాజ్‌ను చూడటానికి వెళ్లిన ఆమె అస్వస్థతకు గురికావడంతో తనను కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు... నవాజ్ షరీఫ్‌కు మెరుగైన వైద్యచికిత్సలు అందించవలసిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన సలహాదారు ఫిర్దోస్ ఆశిక్ అవన్ ట్విటర్లో పేర్కొన్నారు. -
పాక్ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ కూతురు మారియమ్ నవాజ్‌ను గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో ఇంతవరకు కారణం చెప్పలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబ్ తెలిపారు. అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్ మిల్స్ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్ సమన్లు జారీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. -
షరీఫ్ అరెస్ట్: పాకిస్థాన్‌లో ఘర్షణలు
లాహోర్ : పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురు మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగుపెట్టగానే వీరిద్దరిని పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్ట్ చేశారు. షరీఫ్, మరియమ్‌ల అరెస్ట్‌తో శుక్రవారం రాత్రి లాహోర్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన కార్యకర్తలను లాహోర్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా బలగాలను మొహరించారు. చాలా చోట్ల ఆ పార్టీ శ్రేణులను అడ్డగించడంతో వారు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు కాగా, మిగతా 20 మంది పోలీసులు ఉన్నారు. షరీఫ్‌ను చూడటానికి లాహోర్‌లో గుమిగూడిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాహోర్‌లోని రవి బ్రిడ్జ్, బుట్ట చౌక్‌తో పాటు, విమానాశ్రయానికి 5కి.మీ దూరంలోని జోరే పుల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. అంతకు ముందే పాక్‌లో అడుగుపెట్టగానే షరీఫ్‌ను, ఆయను కూతురిని అరెస్ట్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు శుక్రవారం ఉదయం నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. షరీఫ్‌కు ఘన స్వాగతం పలికేందుకు లాహోర్ విమానాశ్రయానికి వెళ్లాలని భావించిన కొందరు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. వీరిలో 370 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలపై పీఎంఎల్-ఎన్ పార్టీ అధికార ప్రతినిధి మరియుమ్ ఔరంగజేబు మాట్లాడుతూ.. వేలాది మంది తమ పార్టీ కార్యకర్తలు లాహోర్‌కు రాకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నవాజ్, మరియమ్‌కు స్వాగతం పలికేందుకు బయలుదేరిన తమ శ్రేణులను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లాహోర్ ర్యాలీలో పాల్గొని అరెస్టయిన 370 మంది పీఎంఎల్-ఎన్ కార్యకర్తలను విడుదల చేయాలని హైకోర్టు కూడా శుక్రవారం ఆదేశాలు జారీచేసిందని అన్నారు. కాగా అరెస్ట్ అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటు చేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. -
మహిళా జర్నలిస్ట్ అదృశ్యం.. కలకలం
లాహోర్: రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళా జర్నలిస్ట్ అదృశ్యం పాకిస్థాన్‌లో కలకలం రేపింది. ప్రముఖ పాత్రికేయురాలు, ఉద్యమకారిణి గుల్ బుఖారి అపహరణకు గురయ్యారన్న వార్తతో పాక్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం సాయంత్రం ఓ టీవీ ప్రోగ్రాం చర్చా వేదికలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డగించిన కొందరు దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే బుధవారం ఉదయం ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ కోణంలోని అంశం కావటంతో పాక్ మీడియా ఛానెళ్లలో రాత్రంతా హైడ్రామా నడిచింది. ఎవరి పని?... వక్త్ టీవీలో ఓ టాక్‌షోలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో లాహోర్ కంటోన్మెట్ ప్రాంతం వద్ద ఆమెను కొందరు వ్యక్తులు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులే ఆమెను అపహరించి ఉంటారని అంతా ఆరోపించారు. పాకిస్థాన్ ప్రభుత్వపాలనలో సైన్యం జోక్యం ఎక్కువైందంటూ మొదటి నుంచి ఆమె తన వాదనను వినిపిస్తున్నారు. దీనికి తోడు జర్నలిస్టుల హక్కుల సాధనకై ఆమె సారథ్యంలోనే పోరాటం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని, ఆమెకు ఏమైనా హని జరిగితే పరిస్థితులు మరోలా ఉంటాయని జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి. కానీ, అధికారులు మాత్రం ఆ ఆరోపణలు తోసిపుచ్చగా, ఈ ఉదయం ఆమె ఇంటికి తిరిగొచ్చారు. పలువురి సంఘీభావం.. గుల్ బుఖారి కిడ్నాప్‌కు గురయ్యారన్న వార్తలపై పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) నేత మరయమ్ నవాజ్ ఆమె సురక్షితంగా తిరిగి రావాలంటూ ఓ ట్వీట్ చేశారు. సీనియర్ జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు కూడా ఆమెకు సంఘీభావం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగటం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఆమె స్పందిస్తేనే అసలు ఏం జరిగిందన్న విషయం తెలిసేది. బ్రిటీష్-పాక్ సంతతికి చెందిన గుల్ బుఖారి ప్రస్తుతం ‘ది నేషన్’ ఒపీనియన్ ఎడిటోరియల్ విభాగంలో పని చేస్తున్నారు. I strongly condemn the abduction of Gul Bukhari in Lahore. Armed invasion on Wana Town to physically eliminate Ali Wazir & Gul Bukhari’s abduction shows that the forces of fascism are using the absence of political government for crushing dissent. — Afrasiab Khattak (@a_siab) 5 June 2018 Gul Bukhari is a political activist and social media voice in Pakistan. Reports suggest she was abducted by agents of the state. This is just weeks before an election. https://t.co/Bg0Em5nBty — Saeed Shah (@SaeedShah) 5 June 2018 Several journalists confirming @gulbukhari was forcibly picked up while on her way to attend a TV talk show. She has been a consisted critic of the military’s alleged intervention in the Pakistani politics. — Umer Ali (@IamUmer1) 5 June 2018 I hope better sense prevails and she returns unharmed. This is simply not acceptable. https://t.co/Cel2h1TMx3 — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 5 June 2018 -
షరీఫ్ కూతురి కామాలు, ఫుల్‌స్టాపులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌పై జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. అవన్‌ఫీల్డ్ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అయితే ఆమె ప్రకటన చదివి వినిపిస్తున్న సమయంలో కామాలు, ఫుల్స్టాపులను కూడా చదువుకుంటూ పోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి వాటిని వదిలేసి ఉన్న మ్యాటర్ చదవాలంటూ ఆమెను కోరారు. అయినా మరయమ్ మాత్రం అలానే చదువుకుంటూ వెళ్లారు. వెటకారం చేస్తున్నారా? అంటూ ఒకానోక దశలో జడ్జి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫుల్‌స్టాపులు, కామాలు చదవకపోతే మొత్తం అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా చదివి వినిపిస్తున్నా’ అంటూ ఆమె ప్రశాంతంగా బదులిచ్చి కూర్చున్నారు. ఈ కేసులో జడ్జి అడిగిన మొత్తం 128 ప్రశ్నలలో 46కు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరయమ్ కంటే ముందు నవాజ్ షరీఫ్‌ను కూడా జడ్జి ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
పవర్ఫుల్ లేడీగా మరయమ్
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్ టైమ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. 2017 ఏడాదికిగానూ ది న్యూయార్క్ టైమ్స్ 11 మంది మహిళల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయగా.. అందులో మరయమ్కు చోటు దక్కింది. తండ్రి షరీఫ్ కుడి భుజంగా వ్యవహరిస్తూ పాక్ రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పించింది. ముఖ్యంగా ఎన్ఏ-120 నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమె చేసిన ప్రచారం గురించి ప్రముఖంగా ప్రచురించింది. ఆ ప్రభావంతోనే ఆ స్థానంలో నవాజ్ భార్య కుల్సుం నవాజ్ ఘన విజయం సాధించారని తెలిపింది. కాగా, పనామా పత్రాల ఆరోపణలతో షరీఫ్ గద్దెదిగి పోగా.. పార్టీ వ్యవహారాలను మరయమ్ చూసుకుంటున్నారు.. ఇక న్యూయార్క్ టైమ్స్ లిస్ట్‌లో ఉన్న మరికొందరు. హెండా అయారి, మార్గొట్ వాల్స్ట్రోమ్, యూ క్సియుహువా, మనాల్ అల్ షరీఫ్, ఎమ్మా మోరానో, ఓలైవ్ యాంగ్, అస్లి ఎర్దోగన్, లెటిజియా బట్టగ్లియా, సింటా నూరియా, అలైస్ స్చ్వార్జర్ ఉన్నారు. -
మాజీ ప్రధాని కుమార్తెకు కీలక బాధ్యతలు
సాక్షి, లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె కీలక బాధ్యతలు భుజాన వేసుకున్నారు. పనామా పత్రాల లీక్‌నకు సంబంధించి ఇటీవల కోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికైన లాహోర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి కుల్సూం ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆమె గొంతు సంబంధిత కేన్సర్‌తో లండన్‌లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ వర్గాలు చెప్పాయి. దీంతో కుల్సూం తరఫున ఆమె కుమార్తె మరయం నవాజ్ (43) ప్రచార బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. వచ్చే నెల 17న జరిగే ఈ ఎన్నికకుగాను మరయం నేటి (శనివారం) ఉదయం నవాజ్ షరీఫ్ నివాసం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ నేతలు పర్వేజ్ మాలిక్, పర్వేజ్ రషీద్‌తోపాటు లాహోర్ మేయర్ పాల్గొన్నారు. ఒకవేళ కుల్సూం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా ఉన్న షాహీద్ ఖాకన్ అబ్బాసీ స్థానంలో నియమితులయ్యే అవకాశం ఉంది. -
రూ.కోట్లల్లో ప్రధాని కూమార్తె ఆస్తులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మార్యాం నవాజ్‌పై పనామా కుంభకోణం సంయుక్త విచారణ కమిటీ (జేఐటీ) సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమకు నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తున్నారని, ఇది ముమ్మాటికీ క్రిమినల్ నేరం అవుతందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా గేట్ కుంభకోణంలో షరీఫ్ కుటుంబానికి పెద్ద మొత్తంలో చోటుందని, దానికి సంబంధించిన విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్‌లోని జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. అయితే, షరీఫ్ కూతురు మార్యాం నవాజ్, ఆమె సోదరులు హుస్సేన్, హసన్ నవాజ్, అలాగే ఆమె భర్త కెప్టెన్ మహ్మద్ సఫ్దార్ కూడా తప్పుడు ధ్రువపత్రాలపై సంతకాలు పెట్టి వాటినే సమర్పిస్తూ సుప్రీంకోర్టును పక్కదారి పట్టిస్తున్నారంటూ జేఐటీ ఆరోపించింది. 'మార్యామ్ నవాజ్‌కు 2009 నుంచి 2016 మధ్య కాలంలో రూ.73.5మిలియన్ల నుంచి రూ.830.73 మిలియన్ల వరకు ముట్టాయి' అని కూడా జేఐటీ తెలిపింది. ఎలాంటి ఆదాయం లెక్కలు చూపించకుండానే 1990 నుంచి ఈ మధ్య కాలంలో అనూహ్యంగా ఆమె ఆస్తులు వందల రెట్లు పెరిగాయని కూడా పేర్కొంది. అయితే, దీనిపై షరీఫ్ కూతురు స్పందించారు. అసలు విషయం సుప్రీంకోర్టులో తేలుతుందని, అంతకుముందు వచ్చే ఏ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
31న నవాజ్ షరీఫ్‌కు గుండె శస్త్రచికిత్స
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు మంగళవారం లండన్‌లో గుండె శస్త్రచికిత్స చేయనున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలన్న వైద్యుల సలహా మేరకే ఈ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. శస్త్రచికిత్స కోసం వారంపాటు షరీఫ్ ఆస్పత్రిలోనే ఉంటారని, వైద్యుల అనుమతితోనే తిరిగి వస్తారని ఆయన తెలిపారు. షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ కూడా ట్విటర్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని, అప్పుడే ఆయన ఆరోగ్యంగా ఉంటారంటూ ఆమె ట్వీట్ చేశారు.