విశ్వసనీయతకు మారుపేరు వాల్మీకులు
కర్నూలు(అర్బన్):
విశ్వసనీయత, ధైర్య సాహసాలకు వాల్మీకులు మారుపేరని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మహర్శి వాల్మీకి జయంతి సభను అధికారికంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.రవిచంద్ర అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్, డిప్యూటీ కలెక్టర్ జయకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ నిబద్ధతకు నిలువుటద్దమైన వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా కొందరు స్వార్థపరులు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్మీకి జీవిత చరిత్రను భావి తరాల వారికి అందించి.. అన్ని రంగాల్లో రాణించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. వాల్మీకి జీవిత చరిత్రను యువత తెలుసుకొని ఆయన చూపిన మార్గంలో పయనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి పిల్లలను బాగా చదివించాలన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాల్మీకుల్లో చైతన్యం వచ్చిందని, మరింత మెరుగవ్వాలన్నారు.
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చక్కటి ప్రణాళిక రూపొందించారని, అయితే ఊహించని విధంగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇతర జిల్లాలకు ఆదర్శంగా వాల్మీకి మహర్శి జయంతి వేడుకలను నిర్వహిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతు వాల్మీకి చెడుమార్గాన్ని వదలి సన్మార్గాన్ని ఎంచుకున్నారని.. సంస్కృతంలో రామాయణాన్ని రచించి ఆదికవిగా గుర్తింపు పొందారన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ నరసింహులు, నంద్యాల జెడ్పీటీసీ లక్ష్మయ్య, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ గిడ్డయ్య, బాలసంజన్న, వలసల రామక్రిష్ణ, బుర్రా ఈశ్వరయ్య, సత్రం రామక్రిష్ణుడు, డాక్టర్ జీఆర్ మోహన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, పద్మజానాయుడు, ఎం.రాంబాబు, జ్ఞానేశ్వరమ్మ, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.