Masooda Movie
-
Thiruveer Marriage: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ (ఫొటోలు)
-
పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్న 'మసూదా' హీరో
‘మసూద’ వంటి హిట్ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ద్వారా జీజీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై వ్యాపారవేత్త రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ చిత్రమిది. గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు రవి కుమార్ పనస. -
వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్
తక్కువ కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ 'ఆర్ట్ డైరెక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి స్వస్థలం. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లో కావడంతో కన్నడ భాష కూడా వచ్చింది. ఇంట్లో టీవీ లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ఫ్యాషన్ పెంచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు డిప్లొమాలు, పీజీ (థియేటర్) పూర్తి చేశారు క్రాంతి కుమార్. హైదరాబాద్‌లో అనేక లఘు చిత్రాలకు పనిచేశారు. నాటకాల కోసం సెట్లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్‌గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు. నంది అవార్డుతో మొదలైన గెలుపు క్రాంతి కుమార్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూద చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్‌తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్‌కి విజయం సాధించారు. తన సక్సెస్ పట్ల క్రాంతికుమార్ మాట్లాడూతూ..' సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఓపిక కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తా. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం. ' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం 'పేక మేడలు', 'బహిష్కరణ' జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేశారు. అంతేకాదు, రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా, కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రానున్నాయి. క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. -
మసూద బ్యూటీ ‘కావ్య కళ్యాణ్ రామ్’ (ఫొటోలు)
-
ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి గోపాలకృష్ణ
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ) తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాని తెరకెక్కించిన విధానం బాగుందని కొనియాడారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. చిన్న కథను దర్శకుడు సాయి కిరణ్ ఎంతో నేర్పుతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి ప్రతిభ చూపారని ప్రశంసించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'మసూద సినిమా ఓ చిన్న కథ. అద్భుతంగా నడిచిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయా అనే కోణంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా చూస్తే ఆత్మలు ఉన్నాయనే నమ్మకం ప్రేక్షకులకు కచ్చితంగా వస్తుంది. ఈ కథలో ఓ తల్లీ, బిడ్డ ఆధారంగా తెరకెక్కించారు. నాజియా అనే అమ్మాయిని మసూద ఆత్మ ఆవహిస్తే ఏం జరిగిందనేదే కథ. సాయి కిరణ్ ఓ వైపు మంచి ప్రేమకథను చూపించారు. కాసేపటికే కథను మలుపులు తిప్పారు. కథను మలిచిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలకు బ్యాక్ గ్రౌండ్ ముఖ్యం. కాంతారలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను వణికించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత) అయితే ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. మసూద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ సినిమా ఆరంభంలోనూ.. మళ్లీ మధ్యలోనూ చూపించారు. అలా కాకుండా ఒకేసారి మధ్యలో ఆ కథ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. సినిమా క్లైమాక్స్‌లోనూ మసూద ఆత్మను బయటకు పంపించేటప్పుడు హీరోపై ఎటాక్ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో నజియాలో ఆత్మ.. చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేసినట్లు చూపారు. కానీ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఆత్మ ఎలా ఉంటుంది అనే సందేహం వచ్చిందన్నారు. సినిమా కల్పన కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడొచ్చని పరుచూరి వివరించారు. -
ఓటీటీకి 'మసూద' చిత్రం.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన తిరువీర్‌కు.. చాలా గ్యాప్ తరువాత మంచి పాత్రతో కనిపించిన సంగీతకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది మసూద. దర్శకుడు మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మసూద చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో మసూద ఒకటి. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మసూద డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈనెల 16 లేదా 23న మసూద చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. -
సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్‌తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్‌గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్‌కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ఇచ్చి షో రన్నర్‌గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్‌కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్‌క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్‌కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించి తన జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు. ► ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుంది. డబ్బులు కూడా వస్తాయని నమ్మాను. మొదటి సినిమా ‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నాను. ► ‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. నా ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయి. ► స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ► బై ఛాన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఓన్‌గా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా రన్ చేయాలని అనుకున్నాను. అట్లాంటి టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ నన్ను కలిశాడు. అతని గురించి చెప్పి.. ‘మళ్ళీరావా’ స్క్రిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ► నేను టైమ్ ఎక్కువ తీసుకుంటాను. అలాగే నాకు వర్క్‌షాప్ కూడా చేయాలి. ఎంత ప్రూవ్డ్ యాక్టర్స్ అయినా.. కాంబినేషన్ సీన్స్ విషయంలో ఖచ్చితంగా వర్క్ షాప్ చేయాలి. కొత్త డైరెక్టర్స్‌తో రిస్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది అవసరం అని భావిస్తాను. ► నేను సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నానని చెప్పినప్పుడు.. ఇంట్లో అందరూ క్లాస్ తీసుకున్నారు. మా నాన్నగారు కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు కూడా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయండి. ఇది చేయలేకపోతే.. మీరు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా వైఫ్, పిల్లలు, మా అమ్మనాన్న, నా చెల్లెలు, ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము. ► ‘మళ్ళీరావా’ సినిమాకి మా నాన్నగారు చాలా సపోర్ట్, ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ► ‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం. ► నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. పర్సనల్‌గా అయితే మాత్రం చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారంటే ఇష్టం. ► డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను. ► ఒక మంచి కథ, నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి.. అలాంటి కథ దొరికితే వెంటనే తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఏ కథ చదవలేదు. స్క్రిప్ట్స్ మాత్రం 2019 నుంచి నా టేబుల్ మీదే ఉన్నాయి. దాదాపు 30 కథలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఇంకా చదవలేదు. ► మా సంస్థను, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సహకరిస్తున్న మీడియావారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. -
కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అవసరం లేదు: దిల్ రాజు
‘మంచి సినిమాలకు సీజన్ అంటూ ఏమి ఉండదు. కంటెంట్ ఉన్న సినిమాను ఎప్పుడు విడుదల చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మసూద’ మరోసారి నిరూపించింది’ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సంద్భంగా తాజాగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తుందని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. తన హోమ్ బ్యానర్( స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్) లో వరుసగా మూడు సినిమాలు( మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్, మసూద) హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. నవంబర్ 18 న మసూద ఆ తరువాత "లవ్ టుడే", "హిట్ 2" ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది’ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మళ్ళీ రావా, ఏజెంట్ ఆత్రేయ సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో మసూద లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను. అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు. మసూద కోసం టీమ్ అంతా కష్టపడి పని చేశారు. అందుకే ఇలాంటి విజయం వచ్చింది’ అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ తో గత ఆరేళ్లుగా జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా "మళ్ళీ రావా" చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత మసూదతో రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ అల్ ద బెస్ట్ ’అన్నారు ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి విజయం సాధించిన రాహుల్ టీమ్‌కు అభినందనలు. మసూద సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ కు గురవుతాడు’అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. ‘నాకు హరర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమాను రాహుల్ తో కలసి మెదటి రోజు చూశాను చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అలాంటి సినిమా తియ్యాలని ఉంది’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. -
నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చేవి : నటుడు తిరువీర్
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ► పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది.మసూద డైరెక్టర్ నన్ను ఓ సారి కలిశాడు. కలిసినంత మాత్రాన నిన్ను సినిమాలో తీసుకుంటానని అనుకోకు.. నిర్మాతకు నచ్చితేనే తీసుకుంటాను అని అన్నారు. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఐదారు టేక్స్ తీసుకున్నా. ఇక సినిమా ఆఫర్ రాదని అనుకున్నా. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. మసూద ఆఫర్ వచ్చింది. ►ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలిగేలా చేశారు. అందుకే అందులోంచి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలని అనుకున్నా. పైకి ఎవ్వరూ చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలని ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోడ మీద పోస్టర్లు చూసి కథలు అనుకుంటూ ఉండేవాడిని. పలాస టైంలోనూ నా పోస్టర్ ఉంటుంది. కానీ మసూద నాది అఫీషియల్‌గా ఫస్ట్ పోస్టర్. ►ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. నాకు ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. మసూదలో క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి. ►నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్‌లు జరిగే సమయంలో వారిని చూసి తెగ సంబరపడిపోయేవాడిని. శుభలేక సుధాకర్, సంగీత, సత్యం రాజేష్ ఇలా అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. వారితో పని చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలం. ► నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్, విమర్శకుల ప్రశంసలు వచ్చేలానే ఉంటాయి. మల్లేశం, పలాస, జార్జిరెడ్డి వల్ల నేను ఇండస్ట్రీ జనాలకు తెలిశాను. కానీ మసూదలో గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను వారు గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారు. ► మసూదతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసిందే. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. దిల్ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది. ► ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ► హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని జనాలు అనుకుంటే చాలు. ► నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది. ► ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మోక్షపటం అనే చిత్రం కూడా లైన్లో ఉంది. వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. పారాహుషార్ అనే మరో సినిమా కూడా లైన్లో ఉంది. అలా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. కథ నచ్చితేనే సినిమాలు చేద్దామని, కౌంట్ కోసం చేయకూడదని అనుకుంటాను. ► కమల్ హాసన్ ద్రోహి, విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం ఇలా వెరైటీ కథలు, కారెక్టర్లు చేయాలని ఉంది. అయితే రెమ్యూనరేషన్ కోసం మాత్రం సినిమాలు చేయను. కథ, స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తాను. -
మసూద మూవీ టీంతో " సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ "
-
మసూద మూవీ టీం ఇంటర్వ్యూ
-
నేనేదో డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్ రాజు
‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న విడుదలైన ఈ హారర్ డ్రామా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు యాంకర్‌గా మారి చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్‌ను కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ మీకోసం... దిల్ రాజు: 50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా... నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. రాహుల్ యాదవ్: ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదన్న మెసేజ్ కూడా కారణం. దిల్ రాజు: ఇంత డబ్బు పెట్టావు.. ఓటీటీ, శాటిలైట్ అమ్మావా? అంటే అమ్మలేదు సార్ అన్నావ్. రిలీజ్ అంటున్నావ్.. ముందు నాన్ థియేట్రికల్ అమ్మి డబ్బు సేవ్ చేయమంటే.. పరవాలేదు సార్ అన్నావ్. అసలు ఏంటిది? అంత డబ్బు పెట్టావ్.. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? రాహుల్: నిజంగా చెప్పాలంటే.. కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. హీరో లేడు.. హర్రర్ సినిమా.. ఇలా రకరకాల కామెంట్స్‌తో వాళ్లు నాకు కొన్ని నంబర్స్ (డబ్బు) చెప్పారు. కానీ ఆ నెంబర్స్ నేను తీసుకున్నా... తీసుకోక పోయినా పర్లేదు అనుకున్నా. అందుకే అమ్మలేదు. దిల్ రాజు: చాలా మంది సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమందికే సక్సెస్ అవకాశం ఉంటుంది. అందులో నువ్వు కూడా ఒకడివి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం. రాహుల్: థ్యాంక్యూ సార్ దిల్ రాజు: సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా రాహులే చూసుకున్నాడు. నేను డైరెక్టర్‌తో కూడా మాట్లాడలేదు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని! అని చెప్పుకొచ్చాడు. అనంతరం నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘మామూలుగా నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్’’ అన్నారు దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. '‘వెళ్లిపోమాకే’ దగ్గర నుంచి దిల్ రాజుగారిని ఫాలో అవుతున్నా. ఒక మంచి ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్యూ దిల్ రాజుగారు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ ఆఫీస్‌కి వెళితే.. ఇప్పుడే వస్తానని చెప్పి రాహుల్ బయటికి వెళ్లి రెండు గంటల వరకు రాలేదు. అక్కడెవరూ లేకపోవడంతో.. నేనంతా పరీక్షగా చూస్తూ ఉన్నా. ఒక కార్నర్లో పిచ్చిపిచ్చి బొమ్మలు గీసి ఉన్నాయి. పిచ్చి పిచ్చి అని కాదు. చాలా క్రీపీ స్టఫ్ ఉంది.ఆ రోజు నేను చూసిన బొమ్మలు.. వాటి నుంచి వచ్చిన చిత్రాన్ని నేను తెరపై చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది’’ అని కోరారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం కాంజురింగ్ సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు. ఈ సినిమా సీక్వెల్లో నేనే హీరో (నవ్వుతూ)..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హౌస్మేట్స్ పొట్ట కొడుతున్న సింగర్ రేవంత్ కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం -
‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’పాప ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా ఎదిగినవారు టాలీవుడ్లో చాలానే ఉన్నారు. శ్రీదేవి, రాశి, మీనా, రోజా, లయ.. ఇలా ఎందరో బాల తారలుగా వచ్చి హీరోయిన్స్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వీరిలో కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమే కావ్య కల్యాణ్‌రామ్. కావ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. దాదాపు 16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. తాజాగా ‘వల్లంకి పిట్ట’ హీరోయిన్గా ‘మసూద’ సినిమాలో నటించింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 18) విడుదలైంది. ఇందులో కావ్య నటనను మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో పాటు వారాహి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ఉస్తాద్’లో కూడా కావ్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ
టైటిల్: మసూద నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నిర్మాణసంస్థ: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా రచన, దర్శకత్వం: సాయికిరణ్ సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ ఎడిటర్: జెస్విన్ ప్రభు విడుదల తేది: నవంబర్ 18, 2022 ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 18) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథేంటంటే.. నీలం(సంగీత) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్(సత్య ప్రకాశ్)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపీ(తీరువీర్) ఓ సాఫ్ట్వేర్. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్(సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఒకప్పుడు టాలీవుడ్లో చాలా హారర్ మూవీస్ వచ్చి, విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హారర్ అంటే.. కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హారర్ మూవీస్ తీస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్ బాబాలు వస్తారు. మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్ పెడితే ప్రేక్షకులు భయపడతారో..అలాంటి వాటిపై దర్శకుడు సాయికిరణ్ మరింత ఫోకస్ పెట్టాడు. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు హారర్‌ని చూపిస్తూ.. మరోవైపు గోపీ, మినీల లవ్ట్రాక్ని నడిపించాడు. దీంతో ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేశాడు. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. పీర్‌బాబా ఎంటర్ అవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే కథనం సాదాసీదాగా సాగినా.. ఓక్కో సీన్ ప్రేక్షకులను దారుణంగా భయపెడుతాయి. మసూద నేపథ్యం గురించి చెప్పే క్రమంలో కొన్ని సీన్స్ భయానికి గురి చేస్తాయి. ఇక చివరి అరగంట మాత్రం హారర్ అదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపెట్టడమే లక్ష్యంగా కథనం సాగుతుంది. హారర్‌తో పాటు.. తల్లి సెంటిమెంట్‌ని కూడా టచ్ చేశాడు దర్శకుడు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ, ఏడుపు హృదయాలను హత్తుకుంటుంది. నిడివి ఎక్కువే అయినా.. హారర్ మాత్రం అదిరిపోయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు సంగీత, తిరువీర్, కావ్య, భాందవిల పాత్రలే చాలా కీలకం. గోపీ పాత్రలో తీరువీర్ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక సంగీత అయితే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించింది. నీలం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం బాంధవి శ్రీదర్ పాత్ర. నాజియాగా ఆమె తనదైన నటనతో అందరిని భయపెట్టింది. కథంతా నాజియా పాత్ర చుట్టే తిరుగుతుంది. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్.. ఈ చిత్రంలో మిలీ పాత్ర పోషించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెరపై అందంగా కనిపించింది. పీర్‌బాబా పాత్రలో శుభలేఖ సుధాకర్ ఒదిగిపోయాడు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం. ఓ హర్రర్ సినిమాకు సౌండ్, విజువల్స్ చాలా ముఖ్యం. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మసూద’ ఒక ట్రూ హారర్ డ్రామా.. యువ దర్శకుల ప్రశంసలు
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదల కానుంది. చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు... యువ దర్శకులు చూశారు. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా యువ దర్శకులు స్వరూప్ అర్. ఎస్. జే, వెంకటేశ్ మహా, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ... కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, అలా క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.' అని అన్నారు. -
ట్రైలర్ అద్భుతంగా ఉంది.. 'మసూద'పై విజయ్ దేవరకొండ ప్రశంస
సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ..' ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్‌గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. వారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. (చదవండి: పాన్ ఇండియా చిత్రంగా 'మసూద') ట్రైలర్ విషయానికి వస్తే.... 'భవిష్యత్తు అనేది మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తిస్థాయి హారర్ మూవీని తలిపించేలా ఉంది. దెయ్యం పట్టిన అమ్మాయి చుట్టు కథ మొత్తం తిరుగుతోందని ట్రైలర్లో అర్థమవుతోంది. తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ సాగిన ట్రైలర్.. ఒక్కసారిగా హర్రర్ సీన్స్‌తో భయపెట్టేస్తోంది. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’ అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే.. హారర్ మూవీ చెప్పకనే చెప్పేశారు ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
పాన్ ఇండియా చిత్రంగా 'మసూద'
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ ‘మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం. అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.