కోడలికి అత్త స్వాగతం
డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత
నా పాట నాతో మాట్లాడుతుంది
నా పాట నాతో మాటాడింది. ఈ వారం నా గురించి చెప్పవూ అంటూ బుంగమూతి పెట్టి రాగాల గారాలు పోయింది. నా పాట - నీ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో చెప్పాలి... అనుకుంటూ... జ్ఞాపకాల పారిజాత వనవిహారినయ్యాను. అప్పటికి ‘నమస్తే అన్న’, ‘మాయదారి కుటుంబం’, ‘రెండో కౄష్ణుడు’, ‘నిరంతరం’ సినిమాలకు రాశాను. మాయదారి కుటుంబంలో దర్శకరత్న దాసరి ప్రధాన పాత్ర చేస్తున్నారు.
అందులో నటుడు ఉత్తేజ్ది ఒక పాత్ర. నేను ఉత్తేజ్ ఇంట్లో ఉండేవాణ్ణి. మా అక్కయ్య కొడుకే. ఉత్తేజ్ నన్ను దాసరిగారికి అన్నపూర్ణ స్టూడియోలో పరిచయం చేశాడు. మరునాడు ఉదయం 6-45కు రమ్మన్నారు. 6-44కు వారి దగ్గరికెళ్లా. ఆశ్చర్యం గురువుగారు అప్పటికే స్నానించి తెల్లని వస్త్రాల్లో కూచుని ఉండి నాకు షాక్ ఇచ్చారు. ప్రముఖ వ్యక్తికైనా, సాధారణ వ్యక్తికైనా ‘సమయపాలన’లో తేడా చూపకూడదనే పాఠం తొలిరోజే నేర్పిన గురువుగారికి పాదాభివందనం చేశాను.
ఇంతవరకు రాసిన సినీగీతాలు కాదు మీ ఊళ్లో - నీ కోసం రాసుకున్న పాట వినిపించమంటే ‘నేలమ్మ’ ‘ఆకుపచ్చ చందమామ’ ‘టపటప చెమటబొట్లు’ వినిపించా. దగ్గరకు తీసుకుని వెన్నుతట్టి ‘నిన్ను సినీపరిశ్రమకు రాకుండా ఆపడం బ్రహ్మతరం కూడా కాదు, నేను అద్భుతమైన అవకాశం ఇస్తాను వెళ్లిరా’ అన్నాడు. ఆ తర్వాత తను అక్కినేని ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ‘రాయుడుగారు - నాయుడుగారు’ సినిమాకు మద్రాస్ పిలిపించి తన ఆఫీసులోనే ఉండమన్నారు. దాసరి ‘పాట తయారి సభ’ భువన విజయంలా ఉంటుంది. దాసరి శ్రీకౄష్ణదేవరాయలులా కూచుని ఉంటే సంగీత దర్శకులు, పాటల రచయితలు, సహకార దర్శకులు టేప్ రికార్డర్‌తో సిద్ధంగా ఉంటారు. అదో అద్భుత సన్నివేశం.
కేకే నగర్లో ఆఫీస్. బిక్కుబిక్కుమంటూ నేను. ప్రతిభాన్విత రచయిత తోటపల్లి మధు ఒక కొత్త పాటల రచయితను గురువు గారికి పరిచయం చేశారు. సన్నివేశం ఇలా చెప్పారు... ఆ కొత్త రచయిత (నేనూ కొత్త రచయితనే అప్పుడు) నేనూ కూచున్నాం.
కొత్త కోడలును ఆహ్వానిస్తూ తాను, సుజాత పాడే గీతం- తెలుగుతనం ఉట్టిపడుతూ ఆ ‘కట్టూబొట్టూ’ కనపడుతూ ఉండాలి అన్నారు దాసరి. నన్ను రాయమనలేదు.
వారం గడిచింది. ఓ వైపు కథాచర్చలు - మరోవైపు ఈ పాట సభ. ఆ కొత్త రచయిత సుమారు 60 పాటలు రాసి వినిపించారు. దర్శక బౄందానికి నచ్చట్లేదు. ఆ తరువాత ఒక ప్రముఖ పాటల రచయితను పిలిపించి అదే సన్నివేశం చెప్పారు. మరికొన్ని రోజులు గడిచాయి. ‘పాట’ పల్లవులు నచ్చట్లేదు. నేనేమో ఖాళీగా ఉంటున్నాను. ఒక రాత్రి నా పాట నాతో మాట్లాడడం ప్రారంభించింది. అవునూ! పాట నిన్ను రాయమనలేదు, అయినా నీవు అదే సన్నివేశానికి రాయొచ్చుగా అంది. ‘‘అలా చెప్పకుండా రాస్తే తప్పేమో’’ అన్నాను. ‘‘ఏం రాస్తే కొడతారా? నీకు చెప్పలేదు కదరా ఎందుకు రాశావ్ అంటారు. బాగుంటే సమయం వౄథా కాకుండా రాసినందుకు మెచ్చుకుంటారు కదా’’ అంది.
‘గురువుగారు మీకు జోహారు, అత్తచేత కోడల్ని స్వాగతించే సన్నివేశం సమకూర్చడంలో ఎంత సామాజిక స్పౄహ తండ్రి మీకు’ అనుకుని-
‘‘గడపలో కుడిపాదమెట్టూ కోడలా
కడుపులో పెట్టుకుని దాచుకుంటానమ్మా
ఒట్టు - నా ఒట్టు - మా వొట్టు
(మా యొక్క మరియు మామయ్యపై ఒట్టు)
దేవుడొట్టూ’’
కడుపులో పెట్టుకుని దాచుకుంటాననడంలో పల్లెతనం - తల్లితనం వెరసి తెలుగింటి చల్లదనం సమకూరింది. ఇంక ‘ట్టూ’లతో సాగిపోయింది.
పసుపు కుంకుమ కలిపినట్టూ
పసిడి వన్నెల కన్నెబొట్టూ
కలికి పలుకూ తేనెబొట్టూ
కట్టుకున్నది కంచిపట్టూ
చీరకట్టూ నుదట చిన్నబొట్టు
అచ్చుగుద్దినట్టు - చూడ
సిరులిచ్చు మా తల్లి మాలచ్చిమైనట్టు
॥
పల్లవి క్షణాల్లో కుదిరింది తనకుతానే తెలుగు ఓణి - తెలుగు బాణీ తొడుక్కొని. కట్నాలకోసం కోడళ్లను కాల్చిచంపే అత్తమామల విషపుటాలోచన పటాపంచలయేలా ఉండాలి మొదటి వాక్యం అనుకున్నాను. కొట్టివేతలు, కామాలు లేకుండా పాట పూర్తయింది.
ఏ పెరడుదీ మల్లెచెట్టు - ఎవ్వారె ఈ తోడబుట్టు
మీగడలు గిలకొట్టినట్టు - ఈ గడుసుదే ఇంటిగుట్టు
నడకతీరు - ఇంటి నడతతీరు - ఇంక నగవు తీరు
ఇదిగో నట్టింట నా పంటలచ్చియే దిగినట్టు
వినయాలు నుడుగులైనట్టు - విజయాలు అడుగులైనట్టు
ప్రతిభ కన్నుల దాగినట్టు - పట్టుదల ముక్కు చూపెట్టు
ఆదిలక్ష్మి - మర్యాదలక్ష్మి - రావె ఇష్టలక్ష్మి నాకు అష్టలక్ష్మి భోగ భాగ్యమీలైనట్టు... పూర్తి చేశా. మరునాడు భయభయంగా దాసరి కోడెరైక్టర్ ‘రవన్న’కు రహస్యంగా వినిపిస్తే ‘భలే వాడివయ్యా నీ భయం పాడుగానూ రా’ అంటూ చేయిపట్టుకుని గురువుగారి చాంబర్లోకి తీసుకెళ్లి... గురువుగారూ మనపాట అద్భుతంగా వచ్చిందనడం, పాటనే పాడి వినిపించడం... ‘శభాష్’ అని కీరవాణి గార్ని పిలిపించడం... పాటకు బాణీ రికార్డింగ్ గంటల్లో జరిగింది. నా పాట నా జ్ఞాపకాలపేటికలోకి వెళ్లింది.