Mazgaon
-
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్‌సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
ఆఫర్.. సూపర్!
న్యూఢిల్లీ: కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు మొదలైంది. సోమవారం మొదలై బుధవారం ముగిసిన రెండు ఐపీఓలకు మంచి స్పందనే లభించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి మరో మూడు కంపెనీలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, లిఖితా ఇన్ఫ్రా ఐపీఓలు రానున్నాయి. మరిన్ని వివరాలు.... క్యామ్స్ ఐపీఓ.. 47 రెట్లు స్పందన మ్యూచువల్ ఫండ్స్‌కు రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా వ్యవహరించే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓ 47 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.1,229–1,230 ప్రైస్‌బాండ్‌తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,242 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ ఈ వారంలోనే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లు సమీకరించింది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.340–360 రేంజ్లో ఉంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. 29 నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ బ్యాండ్ రూ.117–120 ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల సేవలందించే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. రూ.117–120 ప్రైస్‌బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో భాగంగా 25.86 శాతం వాటాకు సమానమైన 51 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. వచ్చే నెల 12న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. శ్రీనివాసరావు గడ్డిపాటి, లిఖిత గడ్డిపాటిలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ భారత్–నేపాల్‌ల మధ్య పైప్‌లైన్ నిర్మాణాన్ని ఇటీవలనే పూర్తి చేసింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా యూనిస్టోన్ క్యాపిటల్ వ్యవహరిస్తోంది. వచ్చే వారమే మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఇష్యూ! ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ కూడా ఈ నెల 29 నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–550 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ప్రైస్‌బ్యాండ్‌ను ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. రూ.140–150 రేంజ్లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ లాట్ 90–100 షేర్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ షేర్లు వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల రిపేర్లు నిర్వహిస్తోంది. ఇతర క్లయింట్ల వాణిజ్య నౌకల రిపేర్లను కూడా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,566 కోట్ల ఆదాయంపై రూ. 415 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఐపీఓకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. కెమ్‌కాన్ ఐపీఓ...149 రెట్లు కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ 149 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.338–340 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.318 కోట్లు సమీకరించనున్నది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.310–320 రేంజ్లో ఉంది. ఈ కంపెనీ గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.95 కోట్లు సమీకరించింది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ నేడు (గురువారం) ముగుస్తోంది. యూటీఐ ఏఎమ్‌సీ 29 నుంచి.. యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలవుతుందని సమాచారం. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్ రూ.750–760 రేంజ్లో ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.170–180 రేంజ్లో ఉంది. వచ్చే నెల 12న యూటీఐ ఏఎమ్‌సీ షేర్లు స్టాక్మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వ్యవహరిస్తున్నాయి. -
ముంబై మృతుల సంఖ్య 61కి చేరుకుంది
ముంబై: మజ్గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం కూలిన భవన ప్రమాద మృతుల సంఖ్య 61కి చేరుకుంది. ఆదివారం ఉదయం శిథిలాల నుంచి మరో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశామని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు ప్రకటించారు. సుమారు 48 గంటలకు పైగా జరిగిన సహాయక చర్యలను అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ విపత్తు నియంత్రణ సిబ్బంది ఆదివారం ఉదయం నిలిపివేసింది. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తండ్రి అనంత్ పవార్ కూడా మరణించారని సం బంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాదిలో జరిగిన రెండో పెద్ద భవన ప్రమాదం ఇదేనని తెలి పారు. ‘ఇంతకుముందు ముంబ్రా లక్కీ కాం పౌం డ్లో ఏప్రిల్‌లో జరిగిన భవన ప్రమాదంలో 75 మంది మరణించారు. జూన్‌లో మహీమ్‌లో జరిగిన దుర్ఘటనలో పది మంది, ముంబ్రాలో పది మంది, దహిసర్‌లో ఏడుగురు, భివండీలో ముగ్గురు మృతి చెందార’ని వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని జేజే ఆస్పత్రి, నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇందులో కొందరి పరిస్ధితి ఇప్పటికీ విషమంగానే ఉంది. దీంతో మృ తుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక అధికారి డీఎస్ పాటిల్ గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కుటుంబాలకు సమీపంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించామన్నారు. కాగా, భవన గ్రౌండ్ ఫ్లోర్లో బీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా కొన్ని మార్పులు చేసిన మమామియాన్ డెకొరేటర్ అశోక్ మెహతాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఛగన్ భుజ్‌బల్ పరామర్శ ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఆదివా రం ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ చేపడుతున్న సహాయక చర్యల గురించి పోలీసులు, బీఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను ఆరాతీశారు. ఆయన వెంట ఎమ్మెల్యే పంకజ్ భుజ్‌బల్, స్థానిక నాయకులు సునీత షిండే, బీఎంసీ పదాధికారులు ఉన్నారు. జేజే ఆస్పత్రి వద్ద బాధితుల రోదనలు... జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పు డు, ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో తమ వారి పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మృతుల పేర్లు సరిగా వెల్లడించకపోవడంతో ఎవరు చనిపోయారు..? ఎవరు చికిత్స పొందుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని బంధువులనెవరినీ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. అయితే రాజకీయ నాయకులు, మంత్రులు పరామర్శించేందుకు తరచూ వస్తున్నారు. దీంతో భద్రత అంశం తెరమీదకు రావడంతో ఎవరినీ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. దీంతో ఆస్పత్రి బయటే క్షతగాత్రుల బంధువులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రధాన ద్వారం వద్ద మృతులు, చికిత్స పొందుతున్న వారి జాబితా లేకపోవడంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. దీంతో జేజే ఆస్పత్రి బయట గందరగోళ పరిస్ధితి నెలకొంది. కమిషనర్‌దే బాధ్యత: శివసేన మజ్గావ్ ప్రాంతంలో కూలిన భవన దుర్ఘటనకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేదే బాధ్యత అని శివసేన పార్టీ ఆదివారం ఆరోపించింది. ‘కుంటే మంత్రాలయ ఏజెంట్. సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆదేశాలను పాటిస్తున్నారు. ఒకవేళ నిందితుల పేర్లు చెప్పదలచుకుంటే అందులో కుంటేనే ప్రథమ వ్యక్తి అవుతార’ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ఆ భవనానికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరముందని సిబ్బంది చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. కుంటేపై కేసు నమోదు చేయాలన్నారు. నగరంలో 95 ప్రమాదకర భవనాలు నగరంలో మొత్తం 95 ప్రమాదకర భవనాల జాబితాను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విడుదల చేసింది. మజ్గావ్లో భవనం కూలడంతో మేలుకున్న బీఎంసీ అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల గురించి ఆరా తీసింది. ఇటువంటి భవనాల్లోని నివాసితులు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. 95 ప్రమాదకర భవనాలను ‘సీ-1’, నేలమట్టం చేయాల్సిన 11 భవనాలను ‘సీ-2ఎ’లో, భారీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్న 40 భవనాలను ‘సీ-2బి’ కేటగిరీలో చేర్చామని తెలిపారు. కాగా ముంబైలో సుమారు 959 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో 626 ప్రైవేట్, 155 కార్పొరేషన్ భవనాలు ఉన్నాయి. సుమారు 10 శాతం భవనాలు అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్నవి ఉన్నాయి. ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల్లో అత్యధికంగా భైఖలా ప్రాంతంలో 59 బిల్డింగులు ఉన్నాయి. పశ్చిమ శాంతాక్రజ్‌లో 18, విలేపార్లే, అంధేరీలలో 17 దాదర్, మాహిమ్‌లలో 13 అబ్దుల్ రెహమాన్ స్ట్రీల్, చందన్‌వాడీలో 13 భవనాలు ఏ సమయంలోనైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.