ముంబై మృతుల సంఖ్య 61కి చేరుకుంది
Published Sun, Sep 29 2013 11:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
ముంబై: మజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం కూలిన భవన ప్రమాద మృతుల సంఖ్య 61కి చేరుకుంది. ఆదివారం ఉదయం శిథిలాల నుంచి మరో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశామని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు ప్రకటించారు. సుమారు 48 గంటలకు పైగా జరిగిన సహాయక చర్యలను అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ విపత్తు నియంత్రణ సిబ్బంది ఆదివారం ఉదయం నిలిపివేసింది. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తండ్రి అనంత్ పవార్ కూడా మరణించారని సం బంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాదిలో జరిగిన రెండో పెద్ద భవన ప్రమాదం ఇదేనని తెలి పారు. ‘ఇంతకుముందు ముంబ్రా లక్కీ కాం పౌం డ్‌లో ఏప్రిల్‌లో జరిగిన భవన ప్రమాదంలో 75 మంది మరణించారు.
జూన్‌లో మహీమ్‌లో జరిగిన దుర్ఘటనలో పది మంది, ముంబ్రాలో పది మంది, దహిసర్‌లో ఏడుగురు, భివండీలో ముగ్గురు మృతి చెందార’ని వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని జేజే ఆస్పత్రి, నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇందులో కొందరి పరిస్ధితి ఇప్పటికీ విషమంగానే ఉంది. దీంతో మృ తుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక అధికారి డీఎస్ పాటిల్ గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కుటుంబాలకు సమీపంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించామన్నారు. కాగా, భవన గ్రౌండ్ ఫ్లోర్‌లో బీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా కొన్ని మార్పులు చేసిన మమామియాన్ డెకొరేటర్ అశోక్ మెహతాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఛగన్ భుజ్‌బల్ పరామర్శ
ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఆదివా రం ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ చేపడుతున్న సహాయక చర్యల గురించి పోలీసులు, బీఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను ఆరాతీశారు. ఆయన వెంట ఎమ్మెల్యే పంకజ్ భుజ్‌బల్, స్థానిక నాయకులు సునీత షిండే, బీఎంసీ పదాధికారులు ఉన్నారు.
జేజే ఆస్పత్రి వద్ద బాధితుల రోదనలు...
జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పు డు, ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో తమ వారి పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మృతుల పేర్లు సరిగా వెల్లడించకపోవడంతో ఎవరు చనిపోయారు..? ఎవరు చికిత్స పొందుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని బంధువులనెవరినీ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. అయితే రాజకీయ నాయకులు, మంత్రులు పరామర్శించేందుకు తరచూ వస్తున్నారు. దీంతో భద్రత అంశం తెరమీదకు రావడంతో ఎవరినీ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. దీంతో ఆస్పత్రి బయటే క్షతగాత్రుల బంధువులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రధాన ద్వారం వద్ద మృతులు, చికిత్స పొందుతున్న వారి జాబితా లేకపోవడంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. దీంతో జేజే ఆస్పత్రి బయట గందరగోళ పరిస్ధితి నెలకొంది.
కమిషనర్‌దే బాధ్యత: శివసేన
మజ్‌గావ్ ప్రాంతంలో కూలిన భవన దుర్ఘటనకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేదే బాధ్యత అని శివసేన పార్టీ ఆదివారం ఆరోపించింది. ‘కుంటే మంత్రాలయ ఏజెంట్. సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆదేశాలను పాటిస్తున్నారు. ఒకవేళ నిందితుల పేర్లు చెప్పదలచుకుంటే అందులో కుంటేనే ప్రథమ వ్యక్తి అవుతార’ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ఆ భవనానికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరముందని సిబ్బంది చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. కుంటేపై కేసు నమోదు చేయాలన్నారు.
నగరంలో 95 ప్రమాదకర భవనాలు
నగరంలో మొత్తం 95 ప్రమాదకర భవనాల జాబితాను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విడుదల చేసింది. మజ్‌గావ్‌లో భవనం కూలడంతో మేలుకున్న బీఎంసీ అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల గురించి ఆరా తీసింది. ఇటువంటి భవనాల్లోని నివాసితులు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. 95 ప్రమాదకర భవనాలను ‘సీ-1’, నేలమట్టం చేయాల్సిన 11 భవనాలను ‘సీ-2ఎ’లో, భారీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్న 40 భవనాలను ‘సీ-2బి’ కేటగిరీలో చేర్చామని తెలిపారు. కాగా ముంబైలో సుమారు 959 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో 626 ప్రైవేట్, 155 కార్పొరేషన్ భవనాలు ఉన్నాయి. సుమారు 10 శాతం భవనాలు అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్నవి ఉన్నాయి. ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల్లో అత్యధికంగా భైఖలా ప్రాంతంలో 59 బిల్డింగులు ఉన్నాయి. పశ్చిమ శాంతాక్రజ్‌లో 18, విలేపార్లే, అంధేరీలలో 17 దాదర్, మాహిమ్‌లలో 13 అబ్దుల్ రెహమాన్ స్ట్రీల్, చందన్‌వాడీలో 13 భవనాలు ఏ సమయంలోనైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
Advertisement