న్యూఢిల్లీ: కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు మొదలైంది. సోమవారం మొదలై బుధవారం ముగిసిన రెండు ఐపీఓలకు మంచి స్పందనే లభించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి మరో మూడు కంపెనీలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, లిఖితా ఇన్‌ఫ్రా ఐపీఓలు రానున్నాయి. మరిన్ని వివరాలు....
క్యామ్స్ ఐపీఓ.. 47 రెట్లు స్పందన
మ్యూచువల్ ఫండ్స్‌కు రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా వ్యవహరించే కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓ 47 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.1,229–1,230 ప్రైస్‌బాండ్‌తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,242 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ ఈ వారంలోనే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లు సమీకరించింది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.340–360 రేంజ్‌లో ఉంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి.
29 నుంచి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ బ్యాండ్ రూ.117–120
ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల సేవలందించే లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. రూ.117–120 ప్రైస్‌బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో భాగంగా 25.86 శాతం వాటాకు సమానమైన 51 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. వచ్చే నెల 12న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. శ్రీనివాసరావు గడ్డిపాటి, లిఖిత గడ్డిపాటిలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ భారత్–నేపాల్‌ల మధ్య పైప్‌లైన్ నిర్మాణాన్ని ఇటీవలనే పూర్తి చేసింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా యూనిస్టోన్ క్యాపిటల్ వ్యవహరిస్తోంది.
వచ్చే వారమే మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఇష్యూ!
ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ కూడా ఈ నెల 29 నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–550 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ప్రైస్‌బ్యాండ్‌ను ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. రూ.140–150 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ లాట్ 90–100 షేర్ల రేంజ్‌లో ఉండొచ్చు. ఈ షేర్లు వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల రిపేర్లు నిర్వహిస్తోంది. ఇతర క్లయింట్ల వాణిజ్య నౌకల రిపేర్లను కూడా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,566 కోట్ల ఆదాయంపై రూ. 415 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఐపీఓకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది.
కెమ్‌కాన్ ఐపీఓ...149 రెట్లు
కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ 149 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.338–340 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.318 కోట్లు సమీకరించనున్నది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.310–320 రేంజ్‌లో ఉంది. ఈ కంపెనీ గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.95 కోట్లు సమీకరించింది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ నేడు (గురువారం) ముగుస్తోంది.
యూటీఐ ఏఎమ్‌సీ 29 నుంచి..
యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలవుతుందని సమాచారం. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్ రూ.750–760 రేంజ్‌లో ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.170–180 రేంజ్‌లో ఉంది. వచ్చే నెల 12న యూటీఐ ఏఎమ్‌సీ షేర్లు స్టాక్‌మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వ్యవహరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment