mg
-
న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్
గురుగ్రామ్: ఆటోమొబైల్స్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్’ పేరిట ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బీఏఏఎస్)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఒకసారి చార్జ్ చేస్తే దీని రేంజ్ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్‌తో విండ్సర్ను 40 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.ఎంజీ మోటార్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్. తాము న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా జెడ్ఎస్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 20.88 లక్షల నుంచి రూ. 23.58 లక్షల దాకా ఉంటుంది. అయితే, జనవరి 17 అర్ధరాత్రిలోగా బుక్ చేసుకున్న వారికి ఈ కారును రూ. 19.88 లక్షలు–రూ. 22.58 లక్షలకే (ఢిల్లీ ఎక్స్‌షోరూం) అందిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. అంతర్గతంగా 1,000 కార్ల బుకింగ్ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 2,800 కార్లకు బుకింగ్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని రాజీవ్ వివరించారు. ముందుగా నెలకు 200 యూనిట్ల తయారీ ప్రణాళిక వేసుకున్నప్పటికీ.. వచ్చే మూడు నాలుగు నెలల్లో 300–400 యూనిట్లకు పెంచుకోవాల్సి రానున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 27 నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
ఎంజీ మోటార్స్ ‘జెడ్ఎస్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎంజీ మోటార్స్.. ‘జెడ్ఎస్’ పేరిట ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ కారు విక్రయాలను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ 143 పీఎస్ పవర్‌తో అందుబాటులోకి రానుందని, ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుందని కంపెనీ వివరించింది. తొలుత ఈ కారు ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉండనుందని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. ఇక రూ. 10 లక్షల లోపు ఉండే చిన్నపాటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. -
ఎంజీ మరో ఆవిష్కరణ : ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ (మోరిస్ గ్యారేజ్) మోటార్ మరో ఘనతను సాధించింది. దేశీయ మార్కెట్లో తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్'పై ఇంకా ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగానే మరో కీలక ప్రకటన చేసింది. తన తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయబోతున్నామని ప్రకటించింది. ఎంజీ ఈ-జెస్ఎస్ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది డిసెంబరు నాటికి దీన్ని ప్రారంభించనున్నట్టు ఎంజీ బుధవారం ప్రకటించింది. దీంతోపాటు యూకే జర్మనీ, ఆస్ట్రేలియా, థాయిలాండ్, మధ్య ప్రాచ్య దేశాల మార్కెట్లలో త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొంది. భారతదేశంలో పర్యావరణ అనుకూలంగా జీరో ఎమిషన్స్‌తో పాటు ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో తమ తాజా ఎస్యూవీ ఎంజీ ఈజెడ్ఎస్ను రూపొందించామని కంపెనీ తెలిపింది. దీని ఫీచర్స్, ధర తదితర మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నామని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా చెప్పారు. కాగా తన ఎస్యూవీ హెక్టార్ వచ్చే జూన్‌లో తన విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఐస్మార్ట్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించడానికి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాప్‌లతో జతకట్టింది. స్మార్ట్‌ఫీచర్లతో వస్తున్న తొలి ఇంటర్నెట్ ఎస్యూవీ హెక్టార్లో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్ సిమ్‌ను అందిస్తోంది. బటన్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సహాకారంతో ‘హలో ఎంజీ’ అంటూ కారు రూఫ్, తలుపులు తెరవమని ఆదేశించవచ్చు. అలాగే వచ్చే రెండేండ్లలో నాలుగు నూతన కార్లతోపాటు హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాన్ని సైతం విడుదల చేయబోతున్నట్లు ఎండీ రాజీవ్ చాబా పేర్కొనడం గమనార్హం. -
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్లు
లండన్: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్‌కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్మెంట్స్. పాతబడిన నంబర్ల పద్ధతికి బదులుగా సరదాగా ఉండే ఎమోజీలను పాస్ కోడ్లుగా వాడటమనేది 15-25 ఏళ్ల యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుందని సంస్థ ఎండీ డేవిడ్ వెబర్ చెప్పారు. 0-10 దాకానే ఉండే అంకెలతో పోలిస్తే 44 ఎమోజీల కాంబినేషన్లు మరింత సురక్షితంగా ఉంటాయని వివరించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాచార మార్పిడి కోసం... వివిధ రకాల హావభావాలతో కూడిన చిత్రాలను ఎమోజీలుగా వ్యవహరిస్తారు.