Minister Ambarish
-
నా ఆరోగ్యం బాగుంది
బెంగళూరు : తనకు ఆరోగ్యం బాగా లేదంటూ వ్యాపించిన వదంతులు వాస్తవం కాదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని నటుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. -
సీతయ్య... ఎవరి మాట వినడు!
సొంత ప్రయోజనాలే ముఖ్యం! ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని వైనం సీతయ్య... ఎవరి మాట వినడు! అని వెండితెరపై హరికృష్ణ పలుకుతుంటే థియేటర్ మారుమోగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ సీతయ్య ఉన్నాడు. ఆయన కూడా ఎవరి మాట వినడు. ఆయనకు ప్రజల సంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇంతకీ ఆ సీతయ్య ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే మండ్య జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్!! మండ్య : రోమ్ నగరం మొత్తం మంటల్లో కాలి బూడిదవుతున్న తరుణంలో నీరో రాజు ఫీడేలు వాయిస్తున్నట్లుంది మంత్రి అంబరీష్ పనితీరు. మండ్య జిల్లాలో రైతులు సాగు చేసిన చెరుకు పంటకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్ మాత్రం తనకేమీ పట్టనట్లు అపెక్స్ బ్యాంకు ప్రతినిధి ఎంపిక విషయంలో తన అభిప్రాయానికి విలువనివ్వలేదంటూ ప్రభుత్వంపై అలకబూనారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న జిల్లా మండ్యకు పేరుంది. రైతుల తరుఫున నిలిచి వారిలో మనోస్థైర్యం నింపాల్సిన తరుణంలో కనీసం జిల్లాలో సైతం ఆయన పర్యటించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగాను ఆయన వ్యవహరించకపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. ప్రారంభానికి నోచుకోని చక్కెర ఫ్యాక్టరీలు మండ్య జిల్లాలో ఐదు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నా... అవి ఇంత వరకు ప్రారంభం కాలేదు. దీంతో 30 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసిన చెరుకుకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అంతేకాదు సాగు నీరు అందక చెరుకు పంట ఎండిపోతోంది. దీంతో కొందరు అన్నదాతలు రెండవ పంట పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటూ చెరుకు పంటకు నిప్పు పెట్టేస్తున్నారు. ఈ దశలోనే పంట పెట్టుబడుల కింద తీసుకున్న అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు ప్రారంభం కావడంతో వాటిని తీర్చే మార్గం కానరాక బలవన్మరణాలకు పాల్పడతున్నారు. పండించిన చెరుకు పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో పాటు దిగుబడిని సుదూరంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలకు తరలించడం మరింత భారంగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సంక్షోభంలో రైతులకు దూరంగా మండ్య జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం ఆ దిశగా అడుగేయడం లేదు. ఆఖరుకు జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీష్ సైతం రైతులకు అండగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మండ్య జిల్లా వాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో బోర్డులు, నామినేటెడ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తన మద్దతుదారులకు అవకాశం కల్పించలేదన్న కారణంతో సీఎం సిద్ధరామయ్యపై అలకబూనిన ఆయన వైఖరి జిల్లా వాసులకు కొత్తేమి కాదు. అయితే జిల్లా వాసుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. మంత్రిగా అంబరీష్ పూర్తిగా విఫలమయ్యారంటూ పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
టార్గెట్
సిద్ధుపై అధికార పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించే దిశగా ‘అంబి’కి మద్దతిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిద్దు పై నిరసన గళాన్ని వినిపించిన రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు వీరంతా మద్దతునిస్తున్నట్లు సమాచారం. - సాక్షి, బెంగళూరు రాష్ట్రంలో సిద్ధరామయ్యకు పోటీగా నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు గాను అంబరీష్‌ని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ, ప్రభావవంత ఎమ్మెల్యేలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నియోజక వర్గాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గాల్లో తమ ప్రభావం తగ్గిపోవడమే కాకుండా పార్టీలో తమ మనుగడ కొనసాగడం కూడా కష్టమనే భావన చాలా కాలంగా వీరిలో ఉండిపోయింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన నేతగా ఉండడం, ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా వ్యవహరించగల నేత రాష్ట్ర శ్రేణుల్లో లేకపోవడంతో పాటు పార్టీ హైకమాండ్ మద్దతు కూడా సిద్దరామయ్యకు ఉండడంతో వీరంతా ఇన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్పను రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలదృష్ట్యా శామనూరు శివశంకరప్ప వెనక్కు తగ్గడంతో అసంతృప్తి ఎమ్మెల్యేలం తా మళ్లీ సిద్ధరామయ్య నే అనుసరించక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి అంబ రీష్ ఘాటుగా లేఖ రా యడంతో ఈ అసృతప్త ఎమ్మెల్యేలం తా మరోసారి సిద్ధుకు ప్రత్యామ్నాయాన్ని వెతికే పని లో పడిపోయారు. నేరు గా సిద్ధరామయ్యను ఎదిరించలేని అసృతప్త ఎమ్మెల్యేలంతా ఇప్పుడిక అంబ రీష్ ద్వారా తమ అసృతప్తిని వెల్లగక్కేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకే అంబరీష్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలుపుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులృదష్ట్యా అంబరీష్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయంగా ప్రతిబిం బించి, అదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చేరవేయాలని వీరంతా భావిస్తున్నారు. తద్వారా సిద్దరామయ్యను ఇరకాటంలో పడేయడంతో పాటు వీలైతే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సైతం తప్పించాలనేది ఈ అసృతప్త ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది. మిమ్మల్ని వదులుకోబోము..... ఇక అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేరుగా లేఖ రాసి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బెంగళూరు వచ్చేసిన మంత్రి అంబరీష్‌తో సిద్ధరామయ్య ఫోన్లో మాట్లాడారు. ‘మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. బోర్డు సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం ద్వారా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మరోసారి బోర్డు సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డెరైక్టర్ ఎంపికను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను’ అని సీఎం మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. రాజీనామా కాదు... సాక్షి, బెంగళూరు: తన రాజీనామాపై మంత్రి అంబరీష్ నోరు విప్పారు. గురువారం రాత్రి ఏడు గంటలకు జేపీ నగర్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడు తూ... ‘నాకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రూపం లో తెలిపాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాదు. రాజకీయాల్లో ఎవరికైనా తన వాళ్లంటూ కొంత మంది ఉంటారు. అదే విధంగా నాకు కూడా శ్రేయోభిలాషులున్నారు. వారికి సరైన స్థానాలను కల్పించాలన్నదే నా ఆరాటం. ఈ విషయాన్నే నేను లేఖలో వెల్లడించాను.’ అని పేర్కొన్నారు. -
అంబి ఫస్ట్...
మంత్రుల పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్‌లు సీఎంకు నివేదిక అందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గంలోని మంత్రుల పనితీరు ఎలా ఉంది? వారి వారి శాఖలకు సంబంధించి వారు సాధించిన పురోగతి ఏమిటి? పనితీరుకు సంబంధించిన పరీక్షలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? వంటి అంశాలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు జరిపిన సమీక్షకు సంబంధించిన నివేదిక ఆయనకు అందినట్లు తెలిసింది. ఈ నివేదికలో ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఎప్పుడూ విధానసౌధలో కనిపించరంటూ విమర్శలు ఎదుర్కొనే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌కి ఈ పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు రావడం. అంతేకాదు మంత్రివర్గ పునర్నిర్మాణం కనుక జరిగితే ముందుగా బయటికి వెళ్లిపోయే వారి జాబితాలో మొదట ఉన్న రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు సైతం ఈ సమీక్షలో ఏ కేటగిరీ దక్కింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో 86.63శాతం మార్కులతో మంత్రి అంబరీష్ మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ 51.70శాతం మార్కులతో చివరి స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ అంశాల ఆధారంగా సమీక్ష.... సిద్ధరామయ్య మంత్రి వర్గంలోని చాలా మంది మంత్రుల పనితీరు సరిగా లేదని, ఆశించిన విధంగా వారు ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని విపక్షాలతో పాటు అటు స్వపక్ష సభ్యుల నుంచి సైతం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు శాసనసభా పక్ష సమావేశంలో సైతం సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మంత్రుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏయే శాఖలకు చెందిన మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి కొంతకాలం క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 మంది మంత్రులకు సంబంధించిన మొత్తం 38శాఖల్లో ఆయా మంత్రుల పనితీరుకు సంబంధించి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. ఆయా మంత్రులు తమ శాఖల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, జిల్లాల పర్యటన, ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరువ చేయడం తదితర అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సమీక్షను నిర్వహించారు. అంతేకాక మంత్రుల పనితీరుకు సంబంధించిన ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లాల అధికారులతో నివేదికలు తెప్పించుకొని సమీక్షకు తుదిరూపునిచ్చారు. మూడు విడతల్లో ఈ సమీక్షను నిర్వహించి శాఖల వారీగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన మంత్రులకు ఏ కేటగిరి, ఓ మోస్తరుగా పనితీరు ఉన్న మంత్రులకు బీ కేటగిరి, పనితీరు ఏ మాత్రం బాగాలేని మంత్రులకు సి కేటగిరీని ఇచ్చినట్లు సమాచారం. ఏ కేటగిరీలో అంబి....సి కేటగిరీలో శ్రీనివాస ప్రసాద్.... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు సమాచారం. ఈ సమీక్ష ప్రకారం మంత్రులు అంబరీష్, ఆర్.వి.దేశ్‌పాండే, సతీష్ జారకీహోళి, ఆర్.రామలింగారెడ్డి, హెచ్.కె.పాటిల్, ఎస్.ఆర్.పాటిల్, శామనూరు శివశంకరప్ప, కృష్ణబేరేగౌడ, కిమ్మన రత్నాకర్, శివరాజ్ తంగడగి, హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్, బి.రామనాథ్ రైలు ఏ కేటగిరీలో ఉన్నారు. ఇక మంత్రులు ఉమాశ్రీ, శరణ్ ప్రకాష్ పాటిల్, పరమేశ్వర నాయక్, హెచ్.సి.మహదేవప్ప, ఖమరుల్ ఇస్లామ్, రోషన్‌బేగ్, బాబూరావ్ చించనసూర్, ఎం.బి.పాటిల్, అభయ్ చంద్రజైన్, డి.కె.శివకుమార్‌లు బీ కేటగిరీలో ఉన్నారు. ఇక సీ కేటగిరీలో యు.టి.ఖాదర్, ఆంజనేయ, వినయ్‌కుమార్ సూరకె, వి.శ్రీనివాస ప్రసాద్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. -
అంబి లీలలు
*మంత్రి అంబరీష్ సెల్లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ కాలక్షేపం *అట్టుడికిన ఉభయ సభలు *బీజేపీ చేతికి కొత్త ఆయుధం *తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. అంబరీష్‌పై కూడా తీసుకోవాంటూ డిమాండ్ *ఉభయ సభల్లో మూడో రోజూ ఇదే తంతు బెంగళూరు : మంత్రి అంబరీష్ సెల్లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ బుధవారం సభలో కాలక్షేపం చేసిన విషయం గురువారం వెలుగు చూసింది. దీంతో మూడవ రోజైన గురువారం కూడా సభల్లో ‘ సెల్ గోల’ తప్పలేదు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు సజావుగా జరగడం లేదు. మొదటిరోజు చెరుకు మద్దతుధర, రెండో రోజు మధ్యాహ్నం నుంచి ‘చౌహాన్ సెల్ పురాణం’తో కొండెక్కిన కార్యక్రమాలు మూడో రోజూ అదే బాటలో నడిచాయి. ఉభయ సభల అధిపతులు ఎంత ప్రయత్నించినా అధికార విపక్ష నాయకులు వెనక్కు తగ్గకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సభలు తర్వాతి రోజుకు (శుక్రవారానికి) వాయిదా పడటంతో విలువైన సభా సమయం వ ృథా అయిపోయింది. అధికార పార్టీకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్‌లో తాగిన మైకంలో చేసిన తాను చేసిన నాట్యాన్ని సెల్ఫోన్లో చూపిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా శాసనసభలో మూడో రోజైన గురువారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే కాంగ్రెస్ పార్టీకు చెందిన పలువురు నాయకులు ‘బీజేపీ షేమ్...షేమ్’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సభలో మొబైల్లో ప్రియాంకగాంధీని ఫొటోను అసభ్య రీతిలో జూమ్ చేసి చూసిన ప్రభుచౌహాన్ను ఒక రోజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిస్పందించిన బీజేపీ నాయకులు ‘చేసిన తప్పునకు చౌహాన్ క్షమాపణ స్పీకర్‌కు ఇప్పటికే క్షమాపణ చెప్పారు. సభలో కూడా చెప్పడానికి సిద్ధం. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. అలా కాదు అంటే మీ పార్టీకు చెందిన మంత్రి అంబరీష్, మల్లికార్జునలను కూడా ఒక రోజు సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభను సజావుగా జరిపే పరిస్థితి కనిపించ పోవడంతో సభను కొద్ది సేపు వాయిదావేశారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన నాయకులతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప తన కార్యలయంలో కొద్ది సేపు సమావేశమై.. ఇరు పార్టీల మధ్య సంధానానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే సభను నడపడానికి స్పీకర్ విఫలయత్నం చేశారు. విపక్ష నాయకుడైన శట్టర్కు మాట్లాడుతూ... ‘క్షమాపణ కోరుతామన్నా అధికార పక్షం వినడం లేదు. చెరుకు రైతులు, ఉత్తర కర్ణాటక సమస్యల పై అడిగే ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. అందుకే అధికార పక్షం మొండిపట్టు పడుతోంది.’ అన్నారు. దీంతో మరోసారి శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. స్పీకర్ ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో శాసనసభ సమావేశాలు మూడు గంటలకు వాయిదా పడింది. శాసనమండలిలో అటు శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు పోడియంలోకి దూసుకెళ్లీ మరీ పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటలలోపు రెండు సార్లు సభను వాయిదా వేసి తిరిగి కార్యక్రమాలను నిర్వహించడానికి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు. విషయం తెలుసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప అటు మండలి, ఇటు శాసనసభకు చెందిన అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు ముఖ్యనేతలను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఈ సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ నాయకులు బయటకు వచ్చి శాసనసభ విపక్ష నాయకుడు శెట్టర్ కార్యాలయంలో వేరుగా సమాలోచనలు తెలిపారు. ‘అంబరీష్‌తో శాసన సభలో క్షమాపణ చెప్పించి తీరాల్సిందే’ అని సమాలోచనలో అందరూ బీజేపీ ఏకగ్రీవంగా అంగీకరించారు. అటుపై బీజేపీ గైర్హాజరీ నేపథ్యంలో శాసనసభ, పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పది నిమిషాల అనంతరం ఉభయ సభలకు చెందిన బీజేపీ నాయకులు అంబరీష్‌తో క్షమాపణ చెప్పించాలని అటు శాసనసభలో, ఇటు పరిషత్‌లో పట్టుపట్టారు. దీంతో స్పీకర్ సభను శుక్రవారం ఉదయం 9:30లకు వాయిదా వేయగా మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. -
అంబితో అప్రతిష్ట
కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారిన మంత్రి ప్రవర్తన రాహుల్, దిగ్విజయ్‌లకు లేఖ రాసిన మండ్య కాంగ్రెస్ కార్యకర్తలు లేఖతో పాటు ‘లీలల’ సీడీని జత చేసిన వైనం మండ్య : రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌పై బహిరంగ వాఖ్యలు చేస్తూ పలు వివాదాలకు నిలయంగా మారారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, మండ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి అంబరీష్. ఇప్పుడు ఆయన మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చీకటి వెలుగుల్లో, మద్యం తాగుతూ తన మద్దతుదారులతో కలిసి నృత్యాలు చేస్తున్న వీడియో, యువతికి ముద్దులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దాంతో అంబరీష్‌పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అతని ప్రవర్తనపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళలపైన హత్యాచారాలు, దౌర్జన్యాలతో చెడ్డ పేరు మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబరీష్ ప్రవర్తన మరో భారంగా మారింది. ఇటీవల అంబరీష్ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి చెడ్డ పేరును చేస్తున్నాయి. గత వారం కలబుర్గిలో జరిగిన మంత్రివర్గం సమావేశానికి అంబరీష్ గైర్హాజర్ అయ్యారు. ఏఐసీసీ పలుమార్లు సూచించినా కేపీసీసీ కార్యాలయానికి గాని, జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి కాని అంబరీష్ రావడంలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్నేహితులు, మద్దతుదారులతో కలిసి హోటల్లో జల్సా చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అంబరీష్ ప్రవర్తనపై ఇంతకు ముందు ఉన్న రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ కూడా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిగా ఉండి రేస్‌క్లబ్‌లో కనిపించడంపై ఆయన మండిపడిన విషయం తెల్సిందే. అయినా అంబరీష్లో మార్పు రాలేదు. గత మార్చిలో తీవ్ర శ్వాసకోశ వ్యాధితో అంబరీష్ సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. దానికి అవసరమైన ఖర్చు మొత్తం 1.22 కోట్లను ప్రభుత్వమే భరించింది. దీనిపై కూడా అప్పుడు వివాదం చెలరేగింది. తాను ఎన్నికైన మండ్య శాసన సభ నియోజకవర్గంలో అంబరీష్ ఎప్పుడూ పర్యటించలేదు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉంటూ మండ్యలో చేపట్టిన అభివృద్ధి పనులు శూన్యం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, సీనియర్ నాయకులు కలిసి సిద్ధం చేసిన బోర్డు మెంబర్ల ఎన్నికపై అంబరీష్ బహిరంగంగా విమర్శిలు చేశారు. ఇలా సమావేశాలకు రాకుండా.. కార్యకర్తలను కలువకుండా.. ప్రజల వద్దకు వెళ్లకుండా.. పార్టీ నేతలనే విమర్శిస్తూ అంబరీష్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మొత్తం 120 మంది కార్యకర్తలు సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అంబరీష్ వీడియో సీడీలను, ఫొటోలను ఆ ఫిర్యాదుకు జతచేసి పంపారు. -
350 మంది అమ్మాయిలతో తిరిగాను
ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది ? మంత్రి అంబరీష్ దబాయింపు బెంగళూరు : మండ్యాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు విరుద్ధంగా హై కమాండ్‌కు లేఖ రాయడం, శాసనసభలో ఫోన్ చూసి కాలం గడపడంపై వచ్చిన విమర్శలకు మంత్రి అంబరీష్ నిర్లక్ష్య వైఖరితో సమాధానాలు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ రెండు విషయాలపై స్పందించాల్సిందిగా సువర్ణ విధానసౌధాలో మీడియా అంబరీష్‌ను కోరగా ‘నేను హీరోను. నాకు ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుంది. తాగుతాను, డ్యాన్స్ చేస్తాను. 350 మంది అమ్మాయిలతో తిరిగాను. (350 హుడిగిర జొత ఓడాడిద్దేనే). అదంతా ప్రైవేట్ వ్యవహారం.’ అన్నారు. ఇక శాసనసభలో మొబైల్ ఫొన్ వాడటంపై మాట్లాడుతూ.. ‘ ఎవరో నాకు వారి ఫోన్ సరిగా పనిచేయడం లేదని చూపిస్తే ఫోన్‌ను తాకాను. దానికే రాద్దాంతమా? అయినా ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది’ అని నవ్వుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఇప్పటికీ నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా
బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తన అభిప్రాయానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాధాన్యం ఇవ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ పేర్కొన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని అన్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై తనకెలాంటి అసంతృప్తి లేదని, కాకపోతే ఈ విషయంలో ఒకసారి తన అభిప్రాయం కూడా తీసుకుని ఉంటే బాగుండేదనేది తన అభిప్రాయమని చెప్పారు. ఇక తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మంత్రి ఆంజనేయ కూడా ప్రతి స్పందించారని, అయితే అవన్నీ వారి వారి భావాలని చెప్పుకొచ్చారు. -
మంత్రి వర్గ సమావేశానికి అంబి గైర్హాజరు
నామినేటెడ్ పోస్టుల భర్తీలో అనుయాయులకు స్థానం లభించకపోవడంపై అసంతృప్తి బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన అనుయాయులకు సముచిత స్థానం కల్పించకపోవడంపై రెబల్ స్టార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గుల్బర్గాలో శుక్రవారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. కల్బుర్గిలో నిర్వహించే మంత్రి వర్గ సమావేశానికి మంత్రులంతా తప్పక హాజరు కావాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెంగళూరులోని తన స్వగృహంలోనే అంబి ఉండిపోయారు. ‘నామినేటెడ్ పోస్టుల భర్తీలో అందరి మాటకు విలువ ఇచ్చి ఉండాల్సింది. అలా కాకుండా తమంతట తామే అన్ని నిర్ణయాలు తీసుకుంటామంటే ఇక పార్టీ సీనియర్ నేతలుగా మేం ఉండి ఏం లాభం? తమకు ఇష్టమైన వారికే పదవులను ఇచ్చుకోమనండి, అయితే మమ్మల్ని ఓ మాట అడిగి ఉండాల్సింది కదా! మేమేమైనా మా అనుచరులకే పదవులు ఇవ్వమని అడుగుతున్నామా? వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని నాకూ తెలుసు, సిద్ధరామయ్య కంటే ముందు నుంచే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను’ అంటూ తన అసహనాన్ని మిత్రుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం వల్లే ఇక మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజరు కావడంపై అంబరీష్ శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నందున ఆ పనుల ఒత్తిడి కారణంగానే తాను మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేక పోయానని తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు తనపైనే ఉన్నాయని చెప్పారు. వివిధ భాషలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో తాను నగరంలోనే ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు.