అంబి ఫస్ట్...
మంత్రుల పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్‌లు
సీఎంకు నివేదిక అందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గంలోని మంత్రుల పనితీరు ఎలా ఉంది? వారి వారి శాఖలకు సంబంధించి వారు సాధించిన పురోగతి ఏమిటి? పనితీరుకు సంబంధించిన పరీక్షలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? వంటి అంశాలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు జరిపిన సమీక్షకు సంబంధించిన నివేదిక ఆయనకు అందినట్లు తెలిసింది. ఈ నివేదికలో ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఎప్పుడూ విధానసౌధలో కనిపించరంటూ విమర్శలు ఎదుర్కొనే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌కి ఈ పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు రావడం. అంతేకాదు మంత్రివర్గ పునర్నిర్మాణం కనుక జరిగితే ముందుగా బయటికి వెళ్లిపోయే వారి జాబితాలో మొదట ఉన్న రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు సైతం ఈ సమీక్షలో ఏ కేటగిరీ దక్కింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో 86.63శాతం మార్కులతో మంత్రి అంబరీష్ మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ 51.70శాతం మార్కులతో చివరి స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏ అంశాల ఆధారంగా సమీక్ష.... సిద్ధరామయ్య మంత్రి వర్గంలోని చాలా మంది మంత్రుల పనితీరు సరిగా లేదని, ఆశించిన విధంగా వారు ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని విపక్షాలతో పాటు అటు స్వపక్ష సభ్యుల నుంచి సైతం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు శాసనసభా పక్ష సమావేశంలో సైతం సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మంత్రుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏయే శాఖలకు చెందిన మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి కొంతకాలం క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 మంది మంత్రులకు సంబంధించిన మొత్తం 38శాఖల్లో ఆయా మంత్రుల పనితీరుకు సంబంధించి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. ఆయా మంత్రులు తమ శాఖల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, జిల్లాల పర్యటన, ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరువ చేయడం తదితర అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సమీక్షను నిర్వహించారు. అంతేకాక మంత్రుల పనితీరుకు సంబంధించిన ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లాల అధికారులతో నివేదికలు తెప్పించుకొని సమీక్షకు తుదిరూపునిచ్చారు. మూడు విడతల్లో ఈ సమీక్షను నిర్వహించి శాఖల వారీగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన మంత్రులకు ఏ కేటగిరి, ఓ మోస్తరుగా పనితీరు ఉన్న మంత్రులకు బీ కేటగిరి, పనితీరు ఏ మాత్రం బాగాలేని మంత్రులకు సి కేటగిరీని ఇచ్చినట్లు సమాచారం.
ఏ కేటగిరీలో అంబి....సి కేటగిరీలో శ్రీనివాస ప్రసాద్.... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు సమాచారం. ఈ సమీక్ష ప్రకారం మంత్రులు అంబరీష్, ఆర్.వి.దేశ్‌పాండే, సతీష్ జారకీహోళి, ఆర్.రామలింగారెడ్డి, హెచ్.కె.పాటిల్, ఎస్.ఆర్.పాటిల్, శామనూరు శివశంకరప్ప, కృష్ణబేరేగౌడ, కిమ్మన రత్నాకర్, శివరాజ్ తంగడగి, హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్, బి.రామనాథ్ రైలు ఏ కేటగిరీలో ఉన్నారు. ఇక మంత్రులు ఉమాశ్రీ, శరణ్ ప్రకాష్ పాటిల్, పరమేశ్వర నాయక్, హెచ్.సి.మహదేవప్ప, ఖమరుల్ ఇస్లామ్, రోషన్‌బేగ్, బాబూరావ్ చించనసూర్, ఎం.బి.పాటిల్, అభయ్ చంద్రజైన్, డి.కె.శివకుమార్‌లు బీ కేటగిరీలో ఉన్నారు. ఇక సీ కేటగిరీలో యు.టి.ఖాదర్, ఆంజనేయ, వినయ్‌కుమార్ సూరకె, వి.శ్రీనివాస ప్రసాద్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.