మంత్రి వర్గంలో చీలిక
చిచ్చురేపిన బీబీఎంపీ మేయర్ స్థానం
జేడీఎస్‌తో పొత్తుపై కుదరని సయోధ్య
భగ్గుమన్న విభేదాలు..
సిద్ధు నిర్ణయాలు తప్పు బట్టిన సీనియర్లు
బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో చీలిక ఏర్పడింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలో విభేదాలను రేకెత్తించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు మంత్రులు బీబీఎంపీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ వశం చేసేందుకు జేడీఎస్ సహకారం తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ చర్యలను ఆ పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు మరికొందరు మంత్రులూ విభేధిస్తున్నారు. ఫలితంగా సోమవారం మంత్రి మండలి సమావేశంలో పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను బయటకు పంపి వేసి సిద్ధరామయ్య నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో జేడీఎస్‌తో మైత్రి విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
మేయర్ పదవి దక్కించుకునేందుకు జేడీఎస్ సహకారం తీసుకుంటే తర్వాత ఆ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుందని, ఇది సరైన నిర్ణయం కాదంటూ సిద్ధరామయ్యకు పలువురు సూచించారు. దీని వల్ల ప్రజల దృష్టిలో పార్టీ పరువు మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా జేడీఎస్‌తో మైత్రి విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హై కమాండ్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని అక్రోశం వ్యక్తం చేశారు. ఈ తీవ్ర వాగ్వాదం తర్వాత సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తెలపకుండా మరోసారి ఈ విషయంపై సమావేశమవుదామంటూ ముగించినట్లు సమాచారం.