mirasi system
-
Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...
తిరుమలలో సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారు వాకిలి ముందు నిలబెట్టి ఆ వాకిలికి తెరవేసి వుంచుతారు. ఆ సమయంలో తెర వెనుక గర్భాలయంలో ఏమి జరుగుతూ వుంటుంది, అర్చకులు ఏమి చేస్తారు..? అన్న ఉత్కంఠ భక్తులలో నెలకొంటుంది. ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుందంటే..? సుప్రభాత సేవను విశ్వరూప సేవ అని కూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశిదారుడు వెళ్ళి అర్చకులను, జీయంగార్లను దివిటీల వెలుగులో ఆలయం వద్దకు తీసుకురావడం సంప్రదాయం. అదే సమయంలో ఆలయ అధికారులు కూడా వస్తారు. ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది వారి స్థానాలలో చేరిన తరువాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అదే సమయంలో వేదపండితులు, అర్చకులు, జీయంగార్లు, అన్నమయ్య వారసులు బంగారు వాకిలి వద్దకు చేరుకుంటారు. అందరి సమక్షంలో గొల్ల మిరాశిదారుడు రాత్రి వేసిన సీళ్లను తొలగించి, తాళాలతో ఆలయం తలుపులు తీసి అర్చకులు, జీయంగార్లను తీసుకుని ఆలయం లోపలికి వెళ్తారు. పూర్వకాలంలో భక్తులను కూడా లోపలకి అనుమతించేవారట. అన్నమయ్య వంశస్థులు పాటలు పాడుతూ వుంటే భక్తులు నృత్యం చేసేవారు. రుత్విజులు వేదం చదువుతూ వుంటే స్వామివారికి మేల్కొలుపు జరిపేవారట. అటు తరువాత ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. బంగారు వాకిలి తలుపులు తీసి గొల్ల మిరాశిదారుడు అర్చకులు, జీయంగార్లను లోపలికి తీసుకువెళ్లాక తలుపులు వేసేస్తారు. బంగారు వాకిలి ముందు నుంచే వేదపండితులు సుప్రభాతం పఠిస్తే, అన్నమయ్య వంశీకులు గానం చేస్తారు. ఇదే సమయంలో లోపల అర్చకులు, జీయంగార్లు గర్భాలయంలో దీపాలు సరిచేసి, కొత్తగా దీపాలు వెలిగించి స్వామివారి దోమతెరను తొలగించి ఉయ్యాలపై పవళించిన స్వామివారిని మేల్కొలిపి భోగ శ్రీనివాసమూర్తిని స్నపన మండపం నుంచి గర్భగృహంలోకి జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారు పవళించిన పరుపు, మంచాలను గొల్ల బయటకు తీసుకువచ్చి సబేరా గదికి తరలిస్తారు. స్వామివారికి ఆవు పాలు, వెన్న నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతిని ఇవ్వడంతో బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. అప్పటికి సుప్రభాత పఠనం పూర్తవుతుంది. ఆ సమయంలో జరిగేవి రెండు సేవలు. ఒకటి మేలుకొలుపు సేవ అయితే, రెండవది భక్తులకు స్వామివారి విశ్వరూప దర్శనం. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత) -
మీరాశీ అర్చకులను కొనసాగించాల్సిందే..
సాక్షి, తిరుపతి :తిరుమలలో పని చేస్తున్న మీరాశీ వంశీకుల అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రయోగించిన రిటైర్మెంట్ అస్త్రం బెడిసికొట్టింది. మీరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలంటూ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో టీటీడీ పాలక మండలికి షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది. టీటీడీలో మీరాశీ కుటుంబాలకు చెందిన 52 మంది వంశపారంపర్య అర్చక స్వాములు ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల ఆలయాల్లో వేలాది మంది అర్చకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మే 16న టీటీడీ పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న వారిలో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ తప్పదని తేల్చిచెప్పింది. దీనిపై అర్చకులు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం అమలైతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులందరికీ వర్తించే అవకాశం ఉంది. తిరుమలలో జరుగుతున్న అపచారాలను బయటపెడుతున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కక్ష సాధించడానికే రిటైర్మెంట్ అస్త్రాన్ని టీటీడీ ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న మీరాశీ వంశీకులకు చెందిన నలుగురు ప్రధాన అర్చకులు, ఆరుగురు అర్చకులను రిటైర్మెంట్ పేరుతో టీటీడీ ధర్మకర్తల మండలి ఇంటికి పంపించింది. ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్ 16న జీఓ నంబర్ 1171, 2012 అక్టోబర్ 16న ఇచ్చిన జీఓ నంబర్ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని ఈవో సింఘాల్ గుర్తుచేశారు. వారిని కొనసాగించండి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరుకు చెందిన అర్చకస్వాములు హైకోర్టును ఆశ్రయించారు. రిటైర్మెంట్ను తప్పుబడుతూ అర్చకస్వాములకు అనుకూలంగా గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. మీరాశీ అర్చకులను రిటైర్మెంట్ ప్రసక్తి లేకుండా కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ నిర్ణయం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రిటైర్మెంట్ అనే విషయం పాలకమండలి పరిధిలోనిది కాదని అంటున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీ పాలకమండలి అర్చకులపై రిటైర్మెంట్ అస్త్రాన్ని ప్రయోగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుతో... హైకోర్టు తాజా తీర్పు మీరాశీ వంశీకుల అర్చకులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది అర్చకుల్లో ఆనందాన్ని నింపింది. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే... అర్చకులపై ప్రయోగించిన రిటైర్మెంట్ అస్త్రాన్ని తిరుమలలోని సన్నిధి గొల్లలపైనా ప్రయోగించాలని టీటీడీ భావించినట్లు తెలిసింది. రమణ దీక్షితులును తొలగించినట్లే సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా పరిగణించి, వారికి రిటైర్మెంట్ ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. టీటీడీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి శిక్ష తప్పదని హైకోర్టు తీర్పును గుర్తుచేస్తూ అర్చక సంఘాలు, సన్నిధి గొల్లలు హెచ్చరిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను టీటీడీలో పనిచేసే కొందరు మంట గలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము టీటీడీలో ఉద్యోగులం కాదని, శ్రీవారి సేవకులం మాత్రమేనని అంటున్నారు. సేవకులకు రిటైర్మెంట్ ఉండదని పేర్కొంటున్నారు. టీటీడీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో మొదటిది అర్చక స్వాముల రిటైర్మెంట్ అయితే... ఆభరణాలు, పింక్‌డైమండ్ మాయంతో పాటు పోటులో తవ్వకాలు వంటి అనేక ఆరోపణలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారిలో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యంస్వామి ఉన్నారు. ఆ ఆరోపణలపై న్యాయస్థానాల తీర్పు ఎలా ఉండబోతోందని టీటీడీ పాలకమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైకోర్టు సంచలన తీర్పుపై అర్చక సమాఖ్య హర్షం సాక్షి, అమరావతి: వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ వర్తించదని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీటీడీలోని వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పిందని రాంబాబు తెలిపారు. -
టీటీడీలో సన్నిధి గొల్లల వివాదం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సన్నిధి గొల్లల వివాదం చెలరేగింది. అర్చకులకు ఏ విధానాలతై అమలు చేస్తున్నారో.. ఆ విధానాలే తమకు అమలు చేయాలని సన్నిది గొల్లలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 30న సన్నిధి వెంకటరామయ్య యాదవ్‌ను పదవీ విరమణ చేయాలని టీటీడీ సూచించింది. మిరాశీ వ్యవస్థలో ఉన్న తమను రిటైర్డ్ కావాలని చెప్పడం సరికాదని సన్నిది గొల్లలు వాపోతున్నారు.