Mirdoddi
-
వాళ్లకు కిరాయి మనుషులే దిక్కు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ వాళ్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నరు, కానీ ఊరోళ్లు వంద మంది ఉంటలేరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరాయి నాయకులు, కిరాయి మనుషులే వారికి దిక్కని విమర్శించారు. మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు.. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలుగా అభివర్ణించారు. వాళ్లు సీసాలను, పైసలను, అబద్ధాలను నమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చేదని మంత్రి విమర్శలు గుప్పించారు. వారి మాటలకు మోసపోతే గోసపడతమని జనాలను హెచ్చరించారు. టీఆర్ఎస్.. చేసేది చెబుతుందని, చెప్పిందే చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దీనికోసం అసెంబ్లీ ఆమోదం కూడా ఇదివరకే తీసుకున్నామని స్పష్టం చేశారు. నిజానికి రుణమాఫీ ఇదివరకే బ్యాంకుల్లో జమ అయ్యేవన్నారు. ఈసారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. (బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలి ) -
మహిళా సర్పంచ్ కుల బహిష్కరణ
సాక్షి, మిరుదొడ్డి: ఎన్నికలకు ముందు తమ కులానికి ఇస్తానన్న డబ్బులు ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో అదే వర్గానికి చెందిన కులస్తులంతా కలసి మహిళా సర్పంచ్ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని బేగంపేటలో గురువారం చోటుచేసుకుంది. అనసూయ.. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకుంటే మహంకాళమ్మ గుడి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. గెలిచాక ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో అనసూయ కుటుంబాన్ని బహిష్కరించారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. తనపై కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. -
సిద్దిపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య
-
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి, సిద్ధిపేట : పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని అనూహ్యంగా జొన్న చేనులో శవమై కనిపించింది. సిద్ధిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం రుద్రారంలో శనివారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రుద్రారం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి.. ఇంటర్ పరీక్షలు రాస్తున్నది. శుక్రవారం ఇంటి నుంచి పరీక్షకు బయలుదేరిన ఆమె సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. శనివారం ఉదయానికి.. గ్రామానికి సమీపంలోగల జొన్న చేనులో యువతి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్యచేసి, దేహాన్నికాల్చేశారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉంటుందని, ఆ విషయం బయటపడుతుందనే భయంతోనే దుండగులు యువతిని చంపేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మిరుదొడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ద్యాప్తు ప్రారంభించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఎవరికీ పట్టని సర్వసభ్య సమావేశం
మిరుదొడ్డి: ప్రజాప్రతినిధుల్లో సమయ పాలన కొరవడింది. వీరికి అధికారులు తోడయ్యారు. వెరసి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని గంటన్నరలోపే ముగించేశారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్యసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీపీ పంజాల కవిత నిర్ణీత సమయానికి వచ్చినప్పటికీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు ఎవరూ లేక సమావేశం ప్రారంభం కాలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి ఎవరూ రాక పోవడంతో ఎంపీపీ కవిత ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా అభ్యర్థించడం కనిపించింది. 12 గంటలకు ప్రారంభమైన సమావేశానికి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు రావడంతోనే సరిపోయింది. మండల పరిధిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఆరుగురు, 16 సర్పంచ్‌లకు గాను ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. వీరికి తోడు వివిధ శాఖల అధికారులు చాలా మట్టుకు డుమ్మాలు కొట్టారు. దీంతో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడంతో అధికారుల తీరును ప్రశ్నించే నాథులు కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల దవాఖాన కొత్త భవన నిర్మాణంపై అధికారులు సహకరించడం లేదని, మిషన్ భగీరథ పనుల్లో తీసిన కాలువలు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కాలువలతో జనాలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని మిరుదొడ్డి సర్పంచ్ మద్దెల రోషయ్య సమస్యను లేవనెత్తారు. సెరికల్చర్ అధికారులు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కలిగించకుండా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని లక్ష్మీనగర్ సర్పంచ్ చిప్ప శివకుమార్ లేవనెత్తడం మినహాయిస్తే సర్వసభ్య సమావేశం అంతా తూతూ మంత్రంగానే సాగింది. ప్రజా సమస్యలపై ఇంత నిర్లక్ష్యం తగదు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం తగదని ఎంపీపీ పంజాల కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం దారుణమన్నారు. ఒక దశలో ప్రజాప్రతినిధులు సమావేశానికి రావాల్సిందిగా తానే ఫోన్ చేసి అభ్యర్థించాల్సి వచ్చిందని, ఇది విచారకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమయ పాలన విధిగా పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, ఇన్చార్జి తహసీల్దార్ ఉమారాణి, ఎంఈఓ జోగు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊళ్లో దీపం కదిలి వెళ్తుంది..!
మిరుదొడ్డి (మెదక్) : రాత్రి వేళల్లో దయ్యం వచ్చి మంటలు రేపుతోందంటూ ఆ గ్రామంలో పుకారు షికారు చేసింది. ఇటీవల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళే దయ్యమై తిరుగుతోందన్న వదంతి వారి కంటిపై కునుకు లేకుండా చేసింది. దయ్యం భయంతో ఆ గ్రామస్తులు జాగారం చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వారు రంగ ప్రవేశం చేసి.. అసలు విషయం తేల్చారు. మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామం ఈ ఘటనకు వేదికైంది. గ్రామ శివారులోని రుద్రాయ కుంట సమీపంలో మూడు రోజులుగా రాత్రి వేళ మంటలు మండుతున్నట్లు, దీపం కదిలి వెళ్తున్నట్లు కొందరు పుకార్లు పుట్టించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల బావిలో దూకి చనిపోయింది. ఆమె దయ్యమై తిరుగుతూ మంటలు రేపుతూ, దీపాలు వెలిగిస్తూ తిరుగుతోందని గ్రామస్తులు మూఢంగా నమ్మారు. దీంతో మూడు రోజులుగా రాత్రయిందంటే నిద్రపోవటం మానేశారు. భయంతో గుంపులు గుంపులుగా ఉంటూ కాలం గడుపుతున్నారు. అంతా ఒట్టిదే... ఈ విషయం తెలుసుకున్న మిరుదొడ్డి ఏఎస్ఐ సామయ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.దయ్యం లేదు గియ్యం లేదు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా పడుకోవాలని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినలేదు. దీపం వెలుగులు మీరు కూడా చూడాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేది లేక పోలీసులు అర్థరాత్రి వరకు నిరీక్షించారు. కొద్ది సేపటికి గ్రామస్తులు చెప్పిన మాదిరిగానే కుంట సమీపంలో ఓ దీపం వెలుగు మిణుకు మిణుకు మంటూ వెళ్లటం కనిపించింది. దీంతో పోలీసులు కొందరు గ్రామస్తులను వెంట బెట్టుకుని వెలుతురు వస్తున్న చోటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగి పరిస్థితిని సమీక్షించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగుపల్లి- మల్లుపల్లి రోడ్డులో రాత్రిపూట వెళ్లే వాహనాల లైటు వెలుతురుని చూసి దయ్యం పుకారు లేపారని గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పారు. కొందరు గ్రామస్తులను తమ జీపులో ఎక్కించుకుని లింగుపల్లి-మల్లుపల్లి రోడ్డున తిప్పారు. ఆ వాహనం లైట్లు రెడ్, బ్లూ లైట్లు రంగుల్లో మిణుకు మిణుకు మంటూ వెలుగుతుండటంతో చూసిన గ్రామస్తుల అనుమానం పటాపంచలైంది. మూడు రోజులుగా వాహనాల లైట్లను చూసి దయ్యంగా భ్రమించి అనవసరంగా నిద్రాహారాలు మాని భయపడాల్సి వచ్చిందని గ్రామస్తులు ఒక్క సారిగా నవ్వుకున్నారు. దయ్యం వదంతులు ఒట్టివేనని తేలటంతో గ్రామస్తులు ధైర్యంగా ఇళ్లకు వెళ్లిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఏఎస్ఐ సామయ్య హెచ్చరించారు. దయ్యం పుకారు లేపి గ్రామంలో లేనిపోని సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి అసలు నిజా నిజాలేమిటో గ్రహించాలని గ్రామస్తులకు హితవు పలికారు. -
నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన ఇద్దరి అరెస్ట్
మిరుదొడ్డి (మెదక్) : నకిలీ ధ్రువ పత్రాలను సృష్టించిన అరుణం చంద్రారెడ్డి, పాటిగారి లక్ష్మీనారాయణ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మిరుదొడ్డి ఎస్సై సతీష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన శేరి కుమార్ బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అత్యవసరంగా పుట్టిన తేదీ ధ్రువపత్రం అవసరమైంది. దీని కోసం కరీంనగర్ జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన అరుణం చంద్రారెడ్డి, నిజామాబాద్ జిల్లా రామారెడ్డి గ్రామానికి చెందిన పాటిగారి లక్ష్మీనారాయణలను ఆశ్రయించాడు. దీంతో వారు శేరి కుమార్ నుంచి రూ.5 వేలు తీసుకుని పుట్టిన తేదీ సర్టిఫికెట్ అంటగట్టారు. అనుమానం వచ్చిన బాధితుడు ఆన్లైన్ లో పరిశీలించగా అది నకిలీదని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు.