ఆ ఊళ్లో దీపం కదిలి వెళ్తుంది..!
ఆ ఊళ్లో దీపం కదిలి వెళ్తుంది..!
Published Tue, Apr 12 2016 5:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
మిరుదొడ్డి (మెదక్) : రాత్రి వేళల్లో దయ్యం వచ్చి మంటలు రేపుతోందంటూ ఆ గ్రామంలో పుకారు షికారు చేసింది. ఇటీవల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళే దయ్యమై తిరుగుతోందన్న వదంతి వారి కంటిపై కునుకు లేకుండా చేసింది. దయ్యం భయంతో ఆ గ్రామస్తులు జాగారం చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వారు రంగ ప్రవేశం చేసి.. అసలు విషయం తేల్చారు.
మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామం ఈ ఘటనకు వేదికైంది. గ్రామ శివారులోని రుద్రాయ కుంట సమీపంలో మూడు రోజులుగా రాత్రి వేళ మంటలు మండుతున్నట్లు, దీపం కదిలి వెళ్తున్నట్లు కొందరు పుకార్లు పుట్టించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల బావిలో దూకి చనిపోయింది. ఆమె దయ్యమై తిరుగుతూ మంటలు రేపుతూ, దీపాలు వెలిగిస్తూ తిరుగుతోందని గ్రామస్తులు మూఢంగా నమ్మారు. దీంతో మూడు రోజులుగా రాత్రయిందంటే నిద్రపోవటం మానేశారు. భయంతో గుంపులు గుంపులుగా ఉంటూ కాలం గడుపుతున్నారు.
అంతా ఒట్టిదే...
ఈ విషయం తెలుసుకున్న మిరుదొడ్డి ఏఎస్‌ఐ సామయ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.దయ్యం లేదు గియ్యం లేదు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా పడుకోవాలని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినలేదు. దీపం వెలుగులు మీరు కూడా చూడాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేది లేక పోలీసులు అర్థరాత్రి వరకు నిరీక్షించారు. కొద్ది సేపటికి గ్రామస్తులు చెప్పిన మాదిరిగానే కుంట సమీపంలో ఓ దీపం వెలుగు మిణుకు మిణుకు మంటూ వెళ్లటం కనిపించింది. దీంతో పోలీసులు కొందరు గ్రామస్తులను వెంట బెట్టుకుని వెలుతురు వస్తున్న చోటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగి పరిస్థితిని సమీక్షించారు.
గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగుపల్లి- మల్లుపల్లి రోడ్డులో రాత్రిపూట వెళ్లే వాహనాల లైటు వెలుతురుని చూసి దయ్యం పుకారు లేపారని గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పారు. కొందరు గ్రామస్తులను తమ జీపులో ఎక్కించుకుని లింగుపల్లి-మల్లుపల్లి రోడ్డున తిప్పారు. ఆ వాహనం లైట్లు రెడ్, బ్లూ లైట్లు రంగుల్లో మిణుకు మిణుకు మంటూ వెలుగుతుండటంతో చూసిన గ్రామస్తుల అనుమానం పటాపంచలైంది. మూడు రోజులుగా వాహనాల లైట్లను చూసి దయ్యంగా భ్రమించి అనవసరంగా నిద్రాహారాలు మాని భయపడాల్సి వచ్చిందని గ్రామస్తులు ఒక్క సారిగా నవ్వుకున్నారు. దయ్యం వదంతులు ఒట్టివేనని తేలటంతో గ్రామస్తులు ధైర్యంగా ఇళ్లకు వెళ్లిపోయారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఏఎస్‌ఐ సామయ్య హెచ్చరించారు. దయ్యం పుకారు లేపి గ్రామంలో లేనిపోని సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి అసలు నిజా నిజాలేమిటో గ్రహించాలని గ్రామస్తులకు హితవు పలికారు.
Advertisement