నేడే ‘పుర’ పోరు
సాక్షి, నల్లగొండ : పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 210 వార్డులు ఉండగా... భువనగిరి, మిర్యాలగూడలో ఒక్కోటి చొప్పున వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 208 వార్డులకు 1123 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల పరిధిలోని 208 వార్డులకు సంబంధించి 381 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వీటిలో మొత్తం 3.96 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 440 ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉం చారు. 46 మంది జోనల్ అధికారులను నియమించారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది కాకుండా 2,171 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సామస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా తెలుసుకుంటారు. మొత్తంగా 100 వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు జరిగేదాకా 144 సెక్షన్..
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ పూర్తయి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేంతరవకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరుగురు డీఎస్పీలు, 33 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్ఐలు, ఆర్ఐలతోపాటు ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 2500 మంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాస్థాయిలో ఎస్పీ, అదనపు ఎస్పీ బందోబస్తును సమీక్షిస్తారు.
సెల్‌ఫోన్ నిషేధం....
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ముందు ఓటరును తనిఖీ చేయాలని పోలీసుశాఖకు కలెక్టర్ సూచించారు. పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌తో వస్తే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడమేగాక.. సెల్‌ఫోన్‌ను సీజ్ చేస్తామని ఎస్పీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు.
ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు విని యోగించుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలిం గ్ కేంద్రాల వద్దకు ఓటర్లను వాహనాల్లో తరలించిన వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలను నిలపాలని చెప్పారు. లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓటరు చిటీ లేకున్నా.....
ఫొటోతో కూడిన ఓటరు చిటీని ఇప్పటికే ఓటర్లకు అందజేశారు. ఈ బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారి ఆయా మున్సిపాలిటీలు, నగరపంచాయతీల కమిషనర్లకు అప్పగించారు. ఒకవేళ ఓటర్లకు చిటీ అందకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, ఫొటో ఉండి... ఏదేని గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.