mix and match
-
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
మిక్స్ అండ్ మ్యాచ్... చాఫీ
కొత్త పరిశోధన ఆరోగ్యానికి కాఫీ తాగడం మంచిదా లేక చాయ్ తాగాలా? కాదు కాదు, కాఫీ ఎక్కువ హానికరమా లేక చాయ్ హానికరమా? ఇలాంటి అనేక సందేహాలు తరచూ వినిపిస్తూంటాయి. అయితే తాజా పరిశోధనలు ఇందుకు భిన్నంగా... కాఫీ ఆకుతో చేసిన చాయ్ తాగడం మంచిదంటున్నాయి. కాఫీ చెట్టు ఆకులతో చేసిన తేనీరు ఎలా ఉంటుంది?... సాధారణ తేయాకుతో చేసిన తేనీటి కంటే వగరు, చేదు తక్కువ. అలాగే కాఫీ గింజల పొడితో చేసిన కాఫీతో పోలిస్తే అంత స్ట్రాంగ్‌గా ఉండదు. కాఫీ ఆకు లక్షణాలేమిటి?... నొప్పి, వాపులను తగ్గిస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. గుండెసంబంధ వ్యాధులను, డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మెదడులోని న్యూరాన్లను రక్షిస్తుంది. ఇథియోపియా, సౌత్ సూడాన్, ఇండోనేసియా దేశాలలో కాఫీ ఆకుల తేనీటినే తాగుతారు. ఇంతకీ దీనికి ఏ పేరు పెడితే బావుంటుంది? కాఫీ, చాయ్ రెండింటినీ కలిపి ‘చాఫీ’ అందామా?!