MLA YARAPATHINENI
-
ఎమ్మెల్యే బంధువునంటూ బెదిరింపులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు నగరంలోని నగరంపాలెం ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్థిక లావాదేవీల విషయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ) బావమరిదినంటూ బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకుని, రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ గడ్డం ప్రసన్న లక్ష్మి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ తాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ పేదలకు పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తన బంధువులకు చెందిన నగరంపాలెంలోని ఒక స్థలాన్ని నగరానికి చెందిన పచ్చిపులుసు రామనాథం అనే వ్యక్తికి విక్రయించామని, ఈ స్థలం విక్రయం విషయంలో వివాదం తలెత్తడంతో కోర్టు ఉత్తర్వుల ద్వారా కొనుగోలుదారుడు స్థలాన్ని హస్తగతం చేసుకున్నారన్నారు. అయితే ఈ విషయంలో గత జూన్‌లో చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తాను గురజాల ఎమ్మెల్యే బంధువునంటూ తనను ఆయన ఆఫీసుకు పిలిపించి అక్రమంగా బంధించి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారన్నారు. వారు డిమాండ్ చేసిన డబ్బు కట్టలేనని చెబుతున్నా చంపుతానంటూ తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. ఈ విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తే జిల్లా పోలీసులకు సిఫార్సు చేశారని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. -
ఎమ్మెల్యే పీఆర్కేకు మైలేజీ..
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం బహిరంగ చర్చ నుంచి యరపతినేని తప్పించుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు మాచర్ల : పల్నాడులో తీవ్ర ఉత్కంఠ రేపిన సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిష్టను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయానికి వచ్చారు. పోలీసుల సహాయంతో ఛాలెంజ్‌కు వెనుకంజ వేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. రెండు వారాల కిందట యరపతినేని అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తిన పీఆర్కేకి ప్రతి సవాల్ విసిరి, దేనికైనా సిద్ధమని చెప్పి యరపతినేని సోమవారం పీఆర్కేను హౌస్ అరెస్టు చేయించిన అనంతరం పిడుగురాళ్లలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తనపై పోటీ చేయమని సవాల్ విసిరానని చెప్పడం ద్వారా ప్రస్తుతం ఉప ఎన్నికలకు తాను సిద్ధం కాదని స్పష్టం చేశారని, తద్వారా ఛాలెంజ్‌కు వెనుకంజ వేశారని పలువురు చెప్పుకుంటున్నారు. ఆధారాలు తీసుకు రావాలని వేదిక, తేదీ చెప్పిన యరపతినేని తీరా అసలు సమయానికి ఏదో సాకుచెప్పి పోలీసులను అడ్డంపెట్టుకుని శాంతి భద్రతల పేరుతో చర్చా వేదిక జరగకుండా తప్పించుకున్నారని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. చర్చ జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే పక్కా ప్రణాళికతో పీఆర్కే ముందస్తుగా అరెస్టులు చేయించేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారు. ఇప్పటి వరకు దాచేపల్లిలోని పేకాట క్లబ్ నిర్వహణ, రేషన్ అక్రమ వ్యాపారం గురించి ఎక్కడా మాట్లాడకపోవడం గమనిస్తే వీటిలో ఆయన పాత్ర ఉండడం వల్లే మాట్లాడడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా కేవలం సరస్వతి భూములకు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న కొంత మంది చేత మాట్లాడించి అనుకూల మీyì యాలో వివిధ కథనాలు రాయించుకుని, తన హవా చాటుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి చర్చ జరుగకుండా బయటపడేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పీఆర్కే తాను చేసిన సవాల్‌కు చివరి వరకు నిలబడి ఆధారాలతో నిరుపించేందుకు సిద్ధమై ప్రజల మెప్పు పొందగా, యరపతినేని మాత్రం కుంటి సాకులతో వెనుకంజ వేసి డ్యామేజ్ అయ్యారని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
పల్నాడులో ఉత్కంఠ
* పీఆర్కే, యరపతినేని చాలెంజ్ * నేడు నడికుడి వెళ్లనున్న పీఆర్కే * 144వ సెక్షన్ విధించిన పోలీసులు * నేటి ఉదయం నుంచి అమలు * ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి.. మాచర్ల : వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాళ్ల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. యరపతినేని అధికారంలోకి వచ్చినప్పటినుంచి అక్రమాలు చేస్తూ అనేకమందిని బెదిరించి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ పీఆర్కే ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ నెల 29న నడికుడిలో ఈ వివరాలు వెల్లడిస్తానని సవాల్ చేయగా, రమ్మని యరపతినేని సవాల్ చేసిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం వందలాదిమంది కార్యకర్తలతో నడికుడి వెళ్లేందుకు పీఆర్కే సిద్ధమవుతున్నారు. మరోపక్క శనివారం మాచర్లలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు బందోబస్తు నడుమ వచ్చిన యరపతినేని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయనే ఆరోపణకే పరిమితమై వెళ్లిపోయారు. ముందస్తు అరెస్టులకు ఏర్పాట్లు... పీఆర్కేను అడ్డుకునేందుకు ఆయన ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేయించేందుకు యరపతినేని రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆదివారం రాత్రికే వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాచర్ల నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 144వ సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ముందుగా పోలీసులు తహశీల్దారు వెంకటేశ్వర్లును అనుమతి కోరగా, దీనిపై స్పందించిన ఆయన సోమవారం వచ్చి ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ ఐదున జరగనున్న వినాయక చవితి వేడుకలను సాకుగా చూపి పోలీసులు ఈ అనుమతులు కోరినట్లు తెలిసింది. దీనిపై తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఫోన్లో వివరణ కోరగా, 144 సెక్షన్‌ను ఆదివారం మధ్యాహ్నం నుంచి అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులు తనను ఫోనులో కోరారని, ప్రస్తుతం తాను అందుబాటులో లేకపోవడం వల్ల సెక్షన్ అమలు తెచ్చుకొమ్మని చెప్పానని వివరించారు. సోమవారం ఉదయం 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెప్పారు. -
ఎమ్మెల్యే యరపతినేనిపై పోటీకి సిద్ధం
ఓడిపోతే రాజకీయ సన్యాసానికి రెడీ: ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల రూరల్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా భూదందాలు, అవినీతి, దౌర్జన్యాలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతిని ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికలలో గురజాల నుంచి పోటీ చేస్తానని, ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాలు విసిరారు. మంగళవారం మాచర్ల మండలంలోని ఏకోనాంపేట గ్రామ కృష్ణానది తీరంలో పుష్కర స్నానమాచరించి అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుష్కరఘాట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, తాను చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ... టీడీపీ నేతల అవినీతిని చెప్పమని సవాలు విసిరిన నాయకుల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, నీకు దమ్ము, ధైర్యం ఉంటే గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. గురజాల ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన బాధితులంతా వ్యక్తిగతంగా తనకు చెప్పారని, ఆయన∙అవినీతి ఆధారాలతో సహా తనవద్ద ఉన్నాయన్నారు. పుష్కరఘాట్ల పార్కింగ్‌లలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అనధికారికంగా లారీల నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తూ లక్షల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. సిమెంట్ పరిశ్రమ కోసం చెన్నాయపాలెంలో మా పార్టీకి చెందిన వారు డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ భూములను కొనుగోలు చేస్తే, కొన్న భూములను ఆక్రమించారని చేసే డ్రామాలపై మాట్లాడటానికి వెళ్తే ఏదో జరిగిందని హడావుడి చేసి పెట్రోల్ బాంబులు, కర్రలతో దాడి చేసి అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను చూస్తూ ఊరుకోమని, ప్రజా ఉద్యమంతో వారి ఆగడాలను అడ్డుకుంటామన్నారు. అవినీతి అక్రమాలతో పుష్కరఘాట్ల నిర్మాణం జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న తీరుకు నిరసనగానే తెలంగాణ ఘాట్‌లో స్నానమాచరించానని, ఎవరు దైవ భక్తులో, ఎవరు పల్నాటి ప్రజల రక్తాన్ని తాగుతున్నారో ప్రజలందరికీ తెలుసుననిఅన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బండారు పరమేశ్వరరావు, కుర్రి సాయిమార్కొండారెడ్డి, తురకా కిషోర్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, బూడిద శ్రీను, చిట్టేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యరపతినేని దందా నిజమే
- టీడీపీ ఎమ్మెల్యే అక్రమాల ‘ఘను’డే.. - గుంటూరు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల్ని కొల్లగొడుతోన్న ఎమ్మెల్యే - సర్కారీ ఖజానాకు కోట్లాది రూపాయల గండి - హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు - యరపతినేనికి భయపడుతున్న జిల్లా అధికార యంత్రాంగం - హైకోర్టు ఉత్తర్వుల అమలుకు సైతం సాహసించని వైనం - ఎమ్మెల్యే అక్రమాలను నిగ్గుతేల్చిన లోకాయుక్త డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సాగిస్తున్న అరాచకాలకు ఇదో మచ్చుతునక. గుంటూరు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల్ని యథేచ్ఛగా, అడ్డగోలుగా తవ్వేస్తూ గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దోపిడీదందాకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ.. అక్రమ తవ్వకాల్ని కొనసాగిస్తున్నారు. అదేసమయంలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అధికారపార్టీ ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మగా మారింది. సున్నపురాయి అక్రమ తవ్వకాల వ్యవహారంపై విచారణ జరిపిన లోకాయుక్త డెరైక్టర్ కె.నరసింహారెడ్డి నిగ్గుతేల్చిన నిజాలివీ.. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్‌కు గత నెల 27న నివేదిక సమర్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, కోనంకి, దాచేపల్లిలలో అడ్డగోలుగా సున్నపురాయిని తవ్వేస్తూ సర్కారీ ఖజానాకు భారీఎత్తున గండి కొడుతున్నారని నివేదికలో స్పష్టంచేశారు. అయినా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారయంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించిందని తప్పుపట్టారు. పూర్వాపరాలివీ.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వేనంబరు 278/19బీలో 4.37 ఎకరాలు, 279/30సీలో 189.31 ఎకరాల్ని సున్నపురాళ్ల తవ్వకానికి ఏసీసీ(అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్)కి 1959లో ప్రభుత్వం 20 ఏళ్లకు లీజుకిచ్చింది. అదేరీతిలో పిడుగురాళ్లలో సర్వేనంబరు 892/49ఏ2లో 64.32 ఎకరాలు, 892/49బీ2లో 82 ఎకరాల్ని 1979లో అదేసంస్థకు లీజుకిస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే కోనంకి, పిడుగురాళ్లలో సర్వేనంబర్ 690లో 70 ఎకరాలు, 1001లో 56 ఎకరాల్ని 1994లో 20 ఏళ్లకు లీజుకిచ్చింది. మొత్తంగా కోనంకి, పిడుగురాళ్లలో 644.11 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలను ఏసీసీ సంస్థకు లీజుకిచ్చింది. కానీ గిట్టుబాటవకపోవడంతో ఏసీసీ సంస్థను మూసేయడంతో సెప్టెంబర్ 22, 2000న మైనింగ్ లీజుల్ని ప్రభుత్వం రద్దుచేసింది. లీజులు పునరుద్ధరించాలంటూ ఫిబ్రవరి 3, 2004న ఏసీసీ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించి, లీజుల జారీకి కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఇప్పటిదాకా మైనింగ్ లీజులు ఎవరికీ జారీ చేయలేదు. యరపతినేని అక్రమాల దందా ఇలా..: ఇదేఅదనుగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలకు తెరతీశారు. పిడుగురాళ్ల, కోనంకిల్లోని సున్నపురాయి నిక్షేపాల్ని స్థానిక కూలీలద్వారా అక్రమంగా తవ్వించి విక్రయించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయన అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. కోనంకి, పిడుగురాళ్ల, దాచేపల్లిలో తన ముఠాను మోహరించి.. సున్నపురాయిని అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా తవ్వేస్తూ సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తూ భారీఎత్తున అక్రమార్జన సాగిస్తున్నారు. అయినా అడ్డుకునేందుకు జిల్లా అధికారయంత్రాంగం సాహసించలేదు. ఈ నేపథ్యంలో యరపతినేని అక్రమాలపై గుంటూరుకు చెందిన కె.గురువాచారి ఆగస్టు 21, 2015న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీన్ని గత మార్చి 28న హైకోర్టు విచారించింది. అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేసి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుజిల్లా కలెక్టర్, ఎస్పీ, గనులశాఖ అధికారుల్ని ఆదేశించింది. తన తీర్పు తర్వాతా అక్రమ తవ్వకాలు కొనసాగితే.. దాన్ని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాలని గురువాచారికి సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల అమలుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ నారాయణ నాయక్ సాహసించలేదు. ప్రేక్షకపాత్ర విహ ంచారు. దీంతో యరపతినేని మరింతగా రెచ్చిపోతున్నారు. నిగ్గుతేల్చిన లోకాయుక్త.. టీడీపీ ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతుండటంతో పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అన్నపురెడ్డి హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన లోకాయుక్త డెరైక్టర్ కె.నరసింహారెడ్డి విచారణ జరిపి.. నిజాలను నిగ్గుతేల్చారు. పిడుగురాళ్ల, కోనంకిల్లో 2014కు ముందు స్థానిక కూలీలతో యరపతినేని సున్నపురాళ్లను తవ్వించేవారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయన అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని నివేదికలో పేర్కొన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో యరపతినేని అక్రమాలను అడ్డుకునేందుకు ఎవరూ సాహసించలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల అమలుకూ కలెక్టర్, ఎస్పీలు సాహసించలేకపోయారన్నారు. గుంటూరుజిల్లా రూరల్ ఎస్పీ కనీసం చెక్‌పోస్టును ఏర్పాటు చేసుంటే, సున్నపురాయి తరలిపోకుండా అడ్డుకట్ట వేసే వీలుండేదన్నారు. సున్నపురాయి అక్రమ తవ్వకాలవల్ల సర్కారీ ఖజానాకు జరిగిన నష్టాన్ని నిందితులనుంచి వసూలుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై గుంటూరుజిల్లా కలెక్టర్‌ను నివేదికివ్వాలంటూ లోకాయుక్త ఆదేశిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే భారీ ఎత్తున అక్రమ మైనింగ్ ప్రారంభించారని (పైన), ఆయన ఎమ్మెల్యే అనే కారణంతోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని నివేదికలో పొందుపరిచిన వివరాలు ఆయన ఎమ్మెల్యే అనే కారణంతోనే జిల్లా కలెక్టర్, స్థానిక మైనింగ్, ఇతర అధికారులు మిన్నకుండిపోయారని నివేదికలో పేర్కొన్న వివరాలు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దందాపై లోకాయుక్త డెరైక్టర్ ఇచ్చిన నివేదిక