పల్నాడులో ఉత్కంఠ
* పీఆర్కే, యరపతినేని చాలెంజ్
* నేడు నడికుడి వెళ్లనున్న పీఆర్కే
* 144వ సెక్షన్ విధించిన పోలీసులు
* నేటి ఉదయం నుంచి అమలు
* ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి..
మాచర్ల : వైఎస్సార్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాళ్ల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. యరపతినేని అధికారంలోకి వచ్చినప్పటినుంచి అక్రమాలు చేస్తూ అనేకమందిని బెదిరించి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ పీఆర్కే ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ నెల 29న నడికుడిలో ఈ వివరాలు వెల్లడిస్తానని సవాల్ చేయగా, రమ్మని యరపతినేని సవాల్ చేసిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం వందలాదిమంది కార్యకర్తలతో నడికుడి వెళ్లేందుకు పీఆర్కే సిద్ధమవుతున్నారు. మరోపక్క శనివారం మాచర్లలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు బందోబస్తు నడుమ వచ్చిన యరపతినేని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయనే ఆరోపణకే పరిమితమై వెళ్లిపోయారు.
ముందస్తు అరెస్టులకు ఏర్పాట్లు...
పీఆర్కేను అడ్డుకునేందుకు ఆయన ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేయించేందుకు యరపతినేని రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆదివారం రాత్రికే వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాచర్ల నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 144వ సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ముందుగా పోలీసులు తహశీల్దారు వెంకటేశ్వర్లును అనుమతి కోరగా, దీనిపై స్పందించిన ఆయన సోమవారం వచ్చి ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ ఐదున జరగనున్న వినాయక చవితి వేడుకలను సాకుగా చూపి పోలీసులు ఈ అనుమతులు కోరినట్లు తెలిసింది. దీనిపై తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఫోన్‌లో వివరణ కోరగా, 144 సెక్షన్‌ను ఆదివారం మధ్యాహ్నం నుంచి అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులు తనను ఫోనులో కోరారని, ప్రస్తుతం తాను అందుబాటులో లేకపోవడం వల్ల సెక్షన్ అమలు తెచ్చుకొమ్మని చెప్పానని వివరించారు. సోమవారం ఉదయం 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెప్పారు.