ఎమ్మెల్యే యరపతినేనిపై పోటీకి సిద్ధం
ఓడిపోతే రాజకీయ సన్యాసానికి రెడీ: ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల రూరల్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా భూదందాలు, అవినీతి, దౌర్జన్యాలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతిని ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికలలో గురజాల నుంచి పోటీ చేస్తానని, ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాలు విసిరారు. మంగళవారం మాచర్ల మండలంలోని ఏకోనాంపేట గ్రామ కృష్ణానది తీరంలో పుష్కర స్నానమాచరించి అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుష్కరఘాట్‌ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, తాను చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ... టీడీపీ నేతల అవినీతిని చెప్పమని సవాలు విసిరిన నాయకుల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, నీకు దమ్ము, ధైర్యం ఉంటే గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. గురజాల ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన బాధితులంతా వ్యక్తిగతంగా తనకు చెప్పారని, ఆయన∙అవినీతి ఆధారాలతో సహా తనవద్ద ఉన్నాయన్నారు. పుష్కరఘాట్‌ల పార్కింగ్‌లలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అనధికారికంగా లారీల నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తూ లక్షల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. సిమెంట్ పరిశ్రమ కోసం చెన్నాయపాలెంలో మా పార్టీకి చెందిన వారు డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ భూములను కొనుగోలు చేస్తే, కొన్న భూములను ఆక్రమించారని చేసే డ్రామాలపై మాట్లాడటానికి వెళ్తే ఏదో జరిగిందని హడావుడి చేసి పెట్రోల్ బాంబులు, కర్రలతో దాడి చేసి అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను చూస్తూ ఊరుకోమని, ప్రజా ఉద్యమంతో వారి ఆగడాలను అడ్డుకుంటామన్నారు. అవినీతి అక్రమాలతో పుష్కరఘాట్‌ల నిర్మాణం జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న తీరుకు నిరసనగానే తెలంగాణ ఘాట్‌లో స్నానమాచరించానని, ఎవరు దైవ భక్తులో, ఎవరు పల్నాటి ప్రజల రక్తాన్ని తాగుతున్నారో ప్రజలందరికీ తెలుసుననిఅన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్‌లు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బండారు పరమేశ్వరరావు, కుర్రి సాయిమార్కొండారెడ్డి, తురకా కిషోర్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, బూడిద శ్రీను, చిట్టేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.