యరపతినేని దందా నిజమే
- టీడీపీ ఎమ్మెల్యే అక్రమాల ‘ఘను’డే..
- గుంటూరు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల్ని కొల్లగొడుతోన్న ఎమ్మెల్యే
- సర్కారీ ఖజానాకు కోట్లాది రూపాయల గండి
- హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు
- యరపతినేనికి భయపడుతున్న జిల్లా అధికార యంత్రాంగం
- హైకోర్టు ఉత్తర్వుల అమలుకు సైతం సాహసించని వైనం
- ఎమ్మెల్యే అక్రమాలను నిగ్గుతేల్చిన లోకాయుక్త డెరైక్టర్
సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సాగిస్తున్న అరాచకాలకు ఇదో మచ్చుతునక. గుంటూరు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల్ని యథేచ్ఛగా, అడ్డగోలుగా తవ్వేస్తూ గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దోపిడీదందాకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ.. అక్రమ తవ్వకాల్ని కొనసాగిస్తున్నారు. అదేసమయంలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అధికారపార్టీ ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మగా మారింది.
సున్నపురాయి అక్రమ తవ్వకాల వ్యవహారంపై విచారణ జరిపిన లోకాయుక్త డెరైక్టర్ కె.నరసింహారెడ్డి నిగ్గుతేల్చిన నిజాలివీ.. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్‌కు గత నెల 27న నివేదిక సమర్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, కోనంకి, దాచేపల్లిలలో అడ్డగోలుగా సున్నపురాయిని తవ్వేస్తూ సర్కారీ ఖజానాకు భారీఎత్తున గండి కొడుతున్నారని నివేదికలో స్పష్టంచేశారు. అయినా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారయంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించిందని తప్పుపట్టారు.
పూర్వాపరాలివీ..
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వేనంబరు 278/19బీలో 4.37 ఎకరాలు, 279/30సీలో 189.31 ఎకరాల్ని సున్నపురాళ్ల తవ్వకానికి ఏసీసీ(అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్)కి 1959లో ప్రభుత్వం 20 ఏళ్లకు లీజుకిచ్చింది. అదేరీతిలో పిడుగురాళ్లలో సర్వేనంబరు 892/49ఏ2లో 64.32 ఎకరాలు, 892/49బీ2లో 82 ఎకరాల్ని 1979లో అదేసంస్థకు లీజుకిస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే కోనంకి, పిడుగురాళ్లలో సర్వేనంబర్ 690లో 70 ఎకరాలు, 1001లో 56 ఎకరాల్ని 1994లో 20 ఏళ్లకు లీజుకిచ్చింది. మొత్తంగా కోనంకి, పిడుగురాళ్లలో 644.11 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలను ఏసీసీ సంస్థకు లీజుకిచ్చింది. కానీ గిట్టుబాటవకపోవడంతో ఏసీసీ సంస్థను మూసేయడంతో సెప్టెంబర్ 22, 2000న మైనింగ్ లీజుల్ని ప్రభుత్వం రద్దుచేసింది. లీజులు పునరుద్ధరించాలంటూ ఫిబ్రవరి 3, 2004న ఏసీసీ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించి, లీజుల జారీకి కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఇప్పటిదాకా మైనింగ్ లీజులు ఎవరికీ జారీ చేయలేదు.
యరపతినేని అక్రమాల దందా ఇలా..: ఇదేఅదనుగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలకు తెరతీశారు. పిడుగురాళ్ల, కోనంకిల్లోని సున్నపురాయి నిక్షేపాల్ని స్థానిక కూలీలద్వారా అక్రమంగా తవ్వించి విక్రయించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయన అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. కోనంకి, పిడుగురాళ్ల, దాచేపల్లిలో తన ముఠాను మోహరించి.. సున్నపురాయిని అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా తవ్వేస్తూ సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తూ భారీఎత్తున అక్రమార్జన సాగిస్తున్నారు. అయినా అడ్డుకునేందుకు జిల్లా అధికారయంత్రాంగం సాహసించలేదు.
ఈ నేపథ్యంలో యరపతినేని అక్రమాలపై గుంటూరుకు చెందిన కె.గురువాచారి ఆగస్టు 21, 2015న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీన్ని గత మార్చి 28న హైకోర్టు విచారించింది. అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేసి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుజిల్లా కలెక్టర్, ఎస్పీ, గనులశాఖ అధికారుల్ని ఆదేశించింది. తన తీర్పు తర్వాతా అక్రమ తవ్వకాలు కొనసాగితే.. దాన్ని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాలని గురువాచారికి సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల అమలుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ నారాయణ నాయక్ సాహసించలేదు. ప్రేక్షకపాత్ర విహ ంచారు. దీంతో యరపతినేని మరింతగా రెచ్చిపోతున్నారు.
నిగ్గుతేల్చిన లోకాయుక్త..
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతుండటంతో పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అన్నపురెడ్డి హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన లోకాయుక్త డెరైక్టర్ కె.నరసింహారెడ్డి విచారణ జరిపి.. నిజాలను నిగ్గుతేల్చారు. పిడుగురాళ్ల, కోనంకిల్లో 2014కు ముందు స్థానిక కూలీలతో యరపతినేని సున్నపురాళ్లను తవ్వించేవారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయన అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని నివేదికలో పేర్కొన్నారు.
అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో యరపతినేని అక్రమాలను అడ్డుకునేందుకు ఎవరూ సాహసించలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల అమలుకూ కలెక్టర్, ఎస్పీలు సాహసించలేకపోయారన్నారు. గుంటూరుజిల్లా రూరల్ ఎస్పీ కనీసం చెక్‌పోస్టును ఏర్పాటు చేసుంటే, సున్నపురాయి తరలిపోకుండా అడ్డుకట్ట వేసే వీలుండేదన్నారు. సున్నపురాయి అక్రమ తవ్వకాలవల్ల సర్కారీ ఖజానాకు జరిగిన నష్టాన్ని నిందితులనుంచి వసూలుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై గుంటూరుజిల్లా కలెక్టర్‌ను నివేదికివ్వాలంటూ లోకాయుక్త ఆదేశిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆయన పేర్కొన్నారు.
జూన్ 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే భారీ ఎత్తున అక్రమ మైనింగ్ ప్రారంభించారని (పైన), ఆయన ఎమ్మెల్యే అనే కారణంతోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని నివేదికలో పొందుపరిచిన వివరాలు
ఆయన ఎమ్మెల్యే అనే కారణంతోనే జిల్లా కలెక్టర్, స్థానిక మైనింగ్, ఇతర అధికారులు మిన్నకుండిపోయారని నివేదికలో పేర్కొన్న వివరాలు
టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దందాపై లోకాయుక్త డెరైక్టర్ ఇచ్చిన నివేదిక