‘ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు’
న్యూఢిల్లీ: మహిళలపై కేరళ పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్ పై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉంది. హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మాను సింగ్వి అన్నారు. హాసన్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించి గందరగోళం సృష్టించొద్దని అన్నారు. మహిళల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.
రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించరాదని ఎంఎం హాసన్ వ్యాఖ్యానించడంతో వివాదం రేగింది. దీంతో హాసన్ పదవికి ముప్పు తప్పదని ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కారణాలతో కేరళ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సుధీరన్ తప్పుకోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా హాసన్ వ్యవహరిస్తున్నారు.