Mobile Marketing
-
అఫ్లే అప్పర్ సర్క్యూట్- కుప్పకూలిన కంకార్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మొబైల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో పీఎస్‌యూ దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) లిమిటెడ్ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. దీంతో అఫ్లే ఇండియా కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టగా.. కంకార్ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అఫ్లే ఇండియా అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. నవరత్న కంపెనీ కంకార్ భారీ నష్టాలతో కుప్పకూలింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అఫ్లే ఇండియా నికర లాభం 42 శాతం పెరిగి రూ. 19 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం బలపడి రూ. 90 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం వృద్ధితో రూ. 22 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో అఫ్లే ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 2026 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత 4 నెలల్లో ఈ షేరు 81 శాతం ర్యాలీ చేయడం విశేషం! కంటెయినర్ కార్పొరేషన్ కార్గొ టెర్మినల్స్ నిర్వాహక దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 76 శాతం పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 58 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1723 కోట్ల నుంచి రూ. 1252 కోట్లకు క్షీణించింది. ఇబిటా మార్జిన్లు 24.6 శాతం నుంచి 13.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో కంకార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 366 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
ఆఫిల్ ఇండియా ఐపీఓ... అదుర్స్ !
న్యూఢిల్లీ: మొబైల్ మార్కెటింగ్ కంపెనీ, ఆఫిల్ ఇండియా ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 86 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.740–745గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.459 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఐపీఓలో భాగంగా రూ.90 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్‌సేల్ కింద 49.53 లక్షల షేర్లను కూడా విక్రయిస్తారు. ఐపీవోలో సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 55 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 199 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 11 రెట్లు చొప్పున సబ్‌స్క్రైబయ్యాయి. ఈ నెల 8న ఆఫిల్ ఇండియా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ఈ కంపెనీ గత శుక్రవారమే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.207 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్(ఇండియా) వ్యవహరిస్తున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ‘సెల్ పాయింట్’ షోరూంలు
కర్నూలు (టౌన్): ‘‘ గ్యారంటీ లేని సెల్ఫోన్లు అమ్ముతున్న తరుణంలో సెల్‌ఫోన్ విక్రయాల్లోకి వచ్చా. 2001 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో సెల్ పాయింట్ ప్రారంభించా. కస్టమర్లు ఆదరించారు. ఇక వెనుతిరిగి చూడలేదు...’’ అని ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సెల్పాయింట్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ పాండే అన్నారు. కర్నూలులో బుధవారం మూడు షోరూంలు ప్రారంభ సందర్భంగా ఆయన ‘సాక్షితో’ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో 85 షోరూంలు.. సీమలో మరో 30... సెల్ఫోన్ల ప్రాధాన్యం పెరిగింది. అంతే నాణ్యతతో సెల్ఫోన్లు విక్రయిస్తున్నాం. అన్ని వర్గాలు మా వద్ద కోనుగోలు చేసే విధంగా నమ్మకం కలిగించాం. గ్యారంటీ విక్రయాలతో మంచి ఆదరణ వచ్చింది. సెల్‌ఫోన్ విక్రయాలతో పాటు యాక్ససరీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫోన్ కవర్‌తో పాటు మెమరీ కార్డులు, పౌచెస్, ప్రొటెక్షన్ స్క్రీన్‌గార్డు, హెడ్సెట్ ఇలా... అన్ని రకాల కంపెనీలకు చెందిన సెల్ఫోన్లు ఉన్నాయి. విలువైన ఫోన్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. అమ్మకాలకే పరిమితం కాకుండా అమ్మకం తరువాతి సర్వీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖపట్నంతో పాటు విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు... ఇలా అన్ని జిల్లాలో మా షోరూంలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కర్నూలులో ఒకేరోజు 3 షోరూంలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 85 షోరూంలు ఉన్నాయి. త్వరలోనే సీమ జిల్లాలో మరో 30 షోరూంలు ప్రారంభిస్తాం. కర్నూలులో శిక్షణ కేంద్రం ఇప్పుడున్న సెల్ ఫోన్ షోరూంలతో పాటు మరో 30 షోరూంలు రావడం వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందువల్లే కర్నూలు నగరంలోనూ కంపెనీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే 200 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి కంపెనీ షోరూమ్‌లలో నియమిస్తాం. మా సంస్థలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. -
మొబైల్ కస్టమర్ల ఆఫ్‘లైన్’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:భారీ డిస్కౌంట్లు.. ఎక్స్‌క్లూజివ్ మోడళ్లు.. తెరపైకి రోజుకో కొత్త బ్రాండ్. ఇదీ ఆన్లైన్ విపణిలో మొబైల్ ఫోన్ల దూకుడు. కాకపోతే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకటిరెండు మోడళ్లతో తళుక్కుమన్న బ్రాండ్లు అంతే వేగంగా తెరమరుగు అయిపోయాయి. ఆన్‌లైన్‌కే పరిమితమైన కంపెనీలు ఆఫ్‌లైన్ బాట పట్టాయి. అలాగే ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ మోడళ్లూ రిటైల్ దుకాణాలకు వచ్చి చేరాయి. దీనికంతటికీ కారణమేమంటే ఫీచర్ ఫోన్ కస్టమర్లు స్మార్ట్ఫోన్లకు పెద్ద ఎత్తున మళ్లడమే. ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తుండడంతో వీరు ఎక్స్‌పీరియెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ టచ్ అండ్ ఫీల్ కావాలంటున్నారు. దీంతో ఆఫ్‌లైన్ మార్కెట్ తిరిగి వేగం పుంజుకుంది. ఆన్లైన్ దూకుడుకు చెక్ పెడుతూ అన్ని ప్రధాన కంపెనీలూ ఒకే ధరను అమలు చేస్తుండటం కూడా ఆఫ్‌లైన్‌కు జీవం పోసినట్టయింది. ఇదీ మొబైల్స్ మార్కెట్.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2017లో 12 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. ఇదే స్థాయిలో బేసిక్ ఫోన్లూ అమ్ముడవుతున్నాయి. వచ్చే ఏడాది 13.5 నుంచి 13.8 కోట్ల స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వస్తాయనేది మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం పరిశ్రమలో ఆన్లైన్ వాటా 20 శాతముంది. ఒకానొక దశలో ఇది 28 శాతానికి కూడా చేరింది. 2018లో ఆన్లైన్ వాటా 30 శాతం దగ్గర స్థిరపడొచ్చని అంచనా వేస్తున్నట్లు షావొమీ ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు.. దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో షావొమీ, లెనోవో, మోటరోలా, వన్‌ప్లస్, లా ఇకో, ఇన్ఫోకస్ వంటి బ్రాండ్లు తొలుత ఆన్‌లైన్‌లోకే ఎంట్రీ ఇచ్చాయి. మార్కెట్‌కు అనుగుణంగా ఇవి వ్యూహాన్ని మార్చుకుని... అన్నీ ఆఫ్‌లైన్‌లోకి అడుగు పెట్టాయి. వీటిలో కొన్ని కంపెనీలేమో ఆన్లైన్ కోసం ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను తీసుకొచ్చాయి. ఇప్పుడు అన్ని మోడళ్లనూ ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నాయి. ఏడాదిగా ఆన్లైన్ మార్కెట్ స్థిరపడిందని మోటరోలా మొబిలిటీ ఇండియా ఎండీ సుధిన్ మాథుర్ చెప్పారు. సాధారణంగా డిస్కౌంట్లు ఉన్నంత కాలమే ఆన్లైన్ జోరు సాగిందన్నారు. తమ కంపెనీ ఆఫ్‌లైన్ అమ్మకాలు ప్రస్తుతమున్న 33 శాతం నుంచి ఏడాదిలో 50 శాతానికి చేరతాయని అంచనా వేశారు. విక్రయాల పరంగా దేశంలో మొబైల్స్ రిటైల్ చైన్ల హవా నడుస్తోందని, సొంత బ్రాండ్ ఇమేజ్, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పారాయన. కాలం చెల్లిన డిస్కౌంట్లు.. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ–కామర్స్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఆన్లైన్లో తక్కువ ధరకు మోడళ్లు లభించడంతో ఒక్కసారిగా ఆఫ్‌లైన్ మార్కెట్లో స్తబ్దత నెలకొంది. కానీ ఏడాదిగా ఈ–కామర్స్ కంపెనీలు రాబడిపై దృష్టి సారించడంతో భారీ డిస్కౌంట్లకు కాలం చెల్లింది. దీంతో కొనుగోలుదార్లు తిరిగి ఆఫ్‌లైన్‌కు మళ్లారు. ఒకటిరెండు మోడళ్లతో ఆన్లైన్లో హల్చల్ చేసిన కంపెనీలు నిలదొక్కుకోలేక పోయాయని బిగ్‘సి’ వ్యవస్థాపకుడు బాలు చౌదరి తెలిపారు. కొత్త మోడళ్లు, విభిన్న ఫీచర్ల రాకతో కస్టమర్లు ఫోన్లను ప్రత్యక్షంగా చూసి, ఎంపిక చేసుకుంటున్నారని తెలియజేశారు. ఎంవోపీతో అడ్డుకట్ట మొబైల్ ఫోన్ల వ్యాపారంలో మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్ (ఎంవోపీ) అత్యంత కీలకంగా మారింది. ఒక రకంగాచూస్తే ఆఫ్‌లైన్ తిరిగి గాడిలో పడడానికిదే కారణం. ప్రతి మోడల్‌కూ నిర్దేశిత ఎంవోపీని తయారీ కంపెనీ నిర్ణయిస్తుంది. విక్రేతలు ఈ ధర కంటే తక్కువకు అమ్మజాలరు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన విక్రేతకు సరుకు సరఫరాను కంపెనీలు నిలిపివేస్తాయని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. దాదాపు అన్ని కంపెనీలూ దీన్ని అనుసరిస్తున్నాయని, ఎంవోపీతో ఆన్లైన్లో భారీ డిస్కౌంట్లకు అడ్డుకట్ట పడిందని చెప్పారాయన. -
ఫ్లిప్‌కార్ట్ ఖాతాలో యాపిటరేట్
న్యూఢిల్లీ : మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ సంస్థ యాపిటరేట్ను కొనుగోలు చేసినట్లు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇందుకు ఎంత వెచ్చించినదీ తెలపలేదు. మొబైల్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తమకు ఈ కొనుగోలు ఉపకరించగలదని కంపెనీ వివరించింది. తమ మొబైల్ యాప్‌లో యాపిటరేట్ మొబైల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానిస్తామని పేర్కొంది. వెబ్‌పేజీలో చేపట్టే కొత్త మార్పులు, చేర్పుల ప్రభావం అమ్మకాలపై ఏ విధంగా ఉంటుందనేది విశ్లేషిస్తుంది యాపిటరేట్. గ్రెగ్ బాద్రోస్, ప్రశాంత్ మాలిక్ వంటి ఏంజల్ ఇన్వెస్టర్లతో పాటు ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ వంటి సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి యాపిటరేట్ నిధులు సమీకరించింది.