ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది.
అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు.
ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7)
మహారాష్ట్ర-తూర్పు అంధేరి
బిహార్-మోకమ
బిహార్- గోపాల్‌గంజ్
హరియాణ-అదంపూర్
తెలంగాణ-మునుగోడు
ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్
ఒడిశా- ధామ్‌నగర్
మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది.
ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి.