అరుణ గ్రహంపై జీవాన్వేషకులకు చేదు వార్త
మాంట్రియల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లు ఉండే అవకాశాలున్నాయని భావిస్తూ ఇప్పటి వరకూ పరిశోధనలు నిర్వహిస్తున్న వారు ఇక ఆ ప్రయత్నాలను విరమించుకోవడమే మంచిదని కెనడా పరిశోధకులు చెబుతున్నారు. అరుణ గ్రహంపై ఉండే వాతావరణ పరిస్థితులకు దగ్గరగా ఉన్నటువంటి అంటార్కిటికాలోని అతిశీతల ప్రాంతంపై పరిశోధనలు జరిపిన మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ మేరకు ప్రకటించింది. అంటార్కిటికాలోని 'యూనివర్సిటీ వ్యాలీ' ప్రాంతంలో సుమారు నాలుగేళ్లుగా జరుపుతున్న పరిశోధనలో ఎలాంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లు దొరకలేదు.
అరుణ గ్రహంపై జీవాన్వేషణ జరుపుతున్న వారికి ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే అని, అయితే.. అక్కడ జీవం ఉనికి ఉండే అవకాశాలు లేవని తెలుసుకోవడం కూడా ముఖ్యమైన అంశమే అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లిల్లీ వైట్ తెలిపారు. భూమిపై జీవించే జీవులకు అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్ లేదా మీథేన్ వాయువులను యూనివర్సిటీ వ్యాలీలో గుర్తించలేదని తెలిపారు. ఈ ఫలితాలతో అరుణ గ్రహంపై జీవం ఉండే అవకాశాలు లేవని వెల్లడవుతోందని స్పష్టం చేశారు.