Mullah Naseeruddin
-
కిందికి రాదెందుకు?
ముల్లా నసీరుద్దీన్ ఒకసారి తన గాడిదను ఇంటికప్పుపైకి తీసుకువెళ్లాడు. తరువాత మళ్లీ దాన్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది ఎంతమాత్రం కిందికి రావడంలేదు. ఎంత ప్రయత్నించినా అది తన మాట వినడంలేదు. దాంతో విసిగిపోయి, ‘సరే.. అదే వస్తుందిలే..’ అని తానే దిగి వచ్చేశాడు. చాలా సమయం గడిచిపోయింది. అయినా గాడిద కిందికి దిగలేదు. ఏవో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైంది దీనికీ, ఎందుకు రావడంలేదు, కప్పును పాడుచేస్తుందో ఏమో.. అది చాలా సున్నితమైన కప్పు.. అని ఆందోళన చెందుతూ.. ముల్లా పైకి వెళ్లాడు. గాడిద కిందికి రాకపోగా పైకప్పును నాశనం చేయడం ప్రారంభించింది. ఎంతగా అదిలించి, ప్రయత్నించినా ససేమిరా దారికి రావడంలేదు. ఒక్కటి తగిలించి లాక్కురావడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎదురు తిరిగి అతన్నే లాగి ఒక్క తన్ను తన్నింది. ముల్లా కిందపడిపోయాడు. చివరికి గాడిద కప్పును కూల్చేసింది. దాంతో, కప్పుతో పాటు అది కూడా కింద పడిపోయింది. ఎందుకిలా జరిగిందీ.. అని ముల్లా చాలాసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు. అతనికి అర్థమైంది ఏమిటంటే.. ‘అనర్హుల్ని ఎప్పుడూ అందలం ఎక్కించకూడదు. వారిని అందలాలెక్కించి పైస్థానాల్లో, ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టకూడదు అని. అనర్హులైనవారిని గనక ఉన్నతస్థానాల్లో కూర్చోబెడితే, అనేక రకాలుగా నష్టం కలుగజేస్తారు. ఆ స్థాయినీ, స్థానాన్నీ దిగజారుస్తారు. ఆ స్థాయికి తీసుకెళ్లినవారినీ నష్టపరిచి విశ్వాసఘాతుకానికి ఒడిగడతారు..’ అని. – మదీహా -
జీవిత రహస్యం
ముల్లా నసీరుద్దీన్ ఓ రోజు బజారు వీధి గుండా నడచి వెళ్తున్నారు. ఆయనకు ఎదురుగా స్కూల్ పిల్లలతో ఒక పెద్దాయన వస్తున్నారు. ముల్లా ఆయనను చూసి ‘‘పిల్లల్ని ఎక్కడకు తీసుకుపోతున్నారు?’’ అని అడిగారు. ‘‘దేశంలో వానలు లేవు. పిల్లల మనస్సు కల్లా కపటం ఎరగదు. ఈ పిల్లల స్వచ్చమైన హృదయాలతో ప్రార్థన చేశారంటే దేవుడు తప్పక చెవి యొగ్గి వింటాడు. కనుక ఈ పిల్లల్ని తీసుకుపోయి ఊరు చివరున్న మైదానంలో ప్రార్థన చేయిస్తాను. దానితో దేశంలో తప్పక వానలు కురుస్తాయి...’’ అని ఆ పెద్దాయన అన్నారు. ఆయన మాటలు విని ముల్లా ఓ నవ్వు నవ్వారు. ఒక కుర్రాడిని దగ్గరకు పిలిచి ‘‘ప్రపంచంలో నీకు నచ్చని చోటేది?’’ అని అడిగారు ముల్లా. ‘‘స్కూలు’’ అన్నాడు కుర్రాడు ఏ మాత్రం ఆలోచించకుండా. మరొక కుర్రాడిని పిలిచి ‘‘ప్రపంచంలో నీకు నచ్చని మనిషి ఎవరు?’’ అని అడిగారు ముల్లా. ‘‘మా లెక్కల మాస్టారు..’’ అన్నాడు ఆ కుర్రాడు. ‘‘చూశారా? పిల్లలు అనుకున్నదల్లా జరుగుతుందంటే ప్రపంచంలోని స్కూళ్ళు అన్నీ కాలి బూడిదవుతాయి. వాటిలో ఉన్న మాస్టార్లు ఎవరూ మిగలరు...’’ అంటూ ముల్లా తన దారిన పోయారు. పిల్లలు తెలియనితనంతో కూడిన అమాయకులే. కనుక అందరి ప్రేమకూ వాళ్ళు పాత్రులవుతారు. అలాగని వారి అమాయకత్వాన్ని, తెలియనితనాన్ని ఆసరాగా చేసుకుని ఏదో జరిగిపోతుందని అనుకోకూడదు. తెలియనితనంలో ఉన్న వారిని తెలివైన వారిగా చేయడమే విద్యాలయం కర్తవ్యం. అలాగే జీవితం నుంచి జ్ఞానాన్ని తెలుసుకునే దిశలో ప్రయాణించడమే జీవుడికి విద్య అవుతుంది. – యామిజాల జగదీశ్