ముల్లా నసీరుద్దీన్ ఒకసారి తన గాడిదను ఇంటికప్పుపైకి తీసుకువెళ్లాడు. తరువాత మళ్లీ దాన్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది ఎంతమాత్రం కిందికి రావడంలేదు. ఎంత ప్రయత్నించినా అది తన మాట వినడంలేదు. దాంతో విసిగిపోయి, ‘సరే.. అదే వస్తుందిలే..’ అని తానే దిగి వచ్చేశాడు. చాలా సమయం గడిచిపోయింది. అయినా గాడిద కిందికి దిగలేదు. ఏవో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైంది దీనికీ, ఎందుకు రావడంలేదు, కప్పును పాడుచేస్తుందో ఏమో.. అది చాలా సున్నితమైన కప్పు.. అని ఆందోళన చెందుతూ.. ముల్లా పైకి వెళ్లాడు. గాడిద కిందికి రాకపోగా పైకప్పును నాశనం చేయడం ప్రారంభించింది. ఎంతగా అదిలించి, ప్రయత్నించినా ససేమిరా దారికి రావడంలేదు.
ఒక్కటి తగిలించి లాక్కురావడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎదురు తిరిగి అతన్నే లాగి ఒక్క తన్ను తన్నింది. ముల్లా కిందపడిపోయాడు. చివరికి గాడిద కప్పును కూల్చేసింది. దాంతో, కప్పుతో పాటు అది కూడా కింద పడిపోయింది. ఎందుకిలా జరిగిందీ.. అని ముల్లా చాలాసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు. అతనికి అర్థమైంది ఏమిటంటే.. ‘అనర్హుల్ని ఎప్పుడూ అందలం ఎక్కించకూడదు. వారిని అందలాలెక్కించి పైస్థానాల్లో, ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టకూడదు అని. అనర్హులైనవారిని గనక ఉన్నతస్థానాల్లో కూర్చోబెడితే, అనేక రకాలుగా నష్టం కలుగజేస్తారు. ఆ స్థాయినీ, స్థానాన్నీ దిగజారుస్తారు. ఆ స్థాయికి తీసుకెళ్లినవారినీ నష్టపరిచి విశ్వాసఘాతుకానికి ఒడిగడతారు..’ అని.
– మదీహా
Comments
Please login to add a commentAdd a comment