గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు.
గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment