Mumbai serial blasts case
-
ముంబై పేలుళ్ల దోషి మృతి
ముంబై : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యూసఫ్ మెమన్ శుక్రవారం మృతిచెందాడు. మహారాష్ట్ర నాసిక్ రోడ్డు జైలులో యూసఫ్ మృతి చెందినట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని నాసిక్ పోలీసు కమిషనర్ విశ్వాస్ నాంగ్రే పాటిల్ కూడా ధ్రువీకరించారు. అయితే యూసఫ్ మృతికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ధూలేకి తరలించారు. ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్, ప్రస్తుతం పరారీలో ఉన్న టైగర్ మెమన్‌కు యూసఫ్ సోదరుడనే సంగతి తెలిసిందే. కాగా, స్పెషల్ టాడా కోర్టు ఈ కేసులో యూసఫ్‌కు జీవిత ఖైదు విధించింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 250 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. కాగా, ఈ కేసులో దోషిగా ఉన్న టైగర్ మెమన్ మరో సోదరుడు యాకుబ్‌కు 2015లో ఊరి శిక్ష అమలైన సంగతి తెలిసిందే. -
దావూద్ కీలక అనుచరుడు అరెస్టు!
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. నేడు ముంబైలోని టాడా కోర్టులో అతన్ని హాజరు పరచనున్నారు. ఫరూఖ్ ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడు. ఇతనిపై తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై కేసులు నమోదయ్యాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దుబాయి పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. దావూద్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ దుబాయ్ వేదికగా మాఫియా నడపడంలో ఫరూఖ్ది కీలకపాత్ర. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
ముంబై పేలుళ్ల కేసు.. జడ్జిమెంట్ డే
ముంబై: మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ముంబై పేల్లుళ్ల కేసు నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు టాడా(ఉగ్ర కార్యకలపాల నిరోధక చట్టం) ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమయ్యింది. గ్యాంగ్ స్టర్ అబూ సలేంతో సహా ఐదుగురికి సెప్టెంబర్ 7న శిక్షలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ మరియు తహీర్ మర్చంట్లను దోషులుగా పేర్కొంటూ మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. అయితే శిక్షలు మాత్రం ఖరారు చేయకపోవటంతో వాదనలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులకే జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు. ఇక మిగిలిన వారి శిక్షలు ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 7న ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు వారిపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది కూడా. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి శిక్షలు విధించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మార్చి 12,1993 న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై తుదితీర్పు 2300-2400 పేజీలతో కోర్టు సిద్ధం చేయటం విశేషం. -
మెమన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు విధించిన మరణశిక్షను పునస్సమీక్షించాలని ఆయన పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ ఎ.ఆర్.దవే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయన వినతిని తోసిపుచ్చింది. మెమన్‌కు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో మెమన్‌కు మరణశిక్ష పడింది. అయితే అతనికి ఈ శిక్ష అమలును 2014 జూన్‌లో సుప్రీంకోర్టు నిలిపేసింది. కోర్టు తాజాగా అతని విన్నపాన్ని తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు మెమన్ ముందున్న అవకాశాలు తగ్గిపోయాయి. తన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడానికి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం, అనంతరం రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి అవకాశాలు మాత్రమే మిగిలివున్నాయి. -
ముంబై వరుస పేలుళ్ల దోషి రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరస్కరించడంతో అతడికి మరణశిక్ష అమలు చేసే అవకాశముంది. 1993లో జరిగిన ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు. -
దత్పుత్రుడా!
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు వరుసగా పెరోల్ ఇవ్వడంపై బీజేపీ మండిపడింది. ఆయనేమైనా అతిథి ఖైదీనా అని ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు కిరీట్ సోమయ్య ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. సంజయ్ దత్‌కు ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారని, గత 50 ఏళ్లలో శిక్ష పడిన ఏ వ్యక్తికి ఈ విధంగా వరుస పెరోల్‌లు మంజూరు చేయడం ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో అరెస్టయిన మిగతా ఖైదీలు కూడా వరుసగా పెరోల్ ఇవ్వాలని అడిగితే ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాగా, మార్చి 21 వరకు దత్‌కు పెరోల్‌కు అనుమతి ఇవ్వడంతో మండలి ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే మంగళవారం రాత్రి మండిపడ్డారు. ఎంతో మంది ఖైదీలు పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకుంటున్నా తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. దత్‌ను మాత్రమే ప్రత్యేకంగా చూడటమే సమాజంలోకి తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందని తెలిపారు. దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ ఎంపీ అయినందువల్లే ఆయనకు వరుసగా పెరోల్లకు అనుమతి లభిస్తోందనే విషయం సామాన్యులకు కూడా అర్థమైపోతుందన్నారు. 1993 మార్చి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటడు సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు అయిన సంగతి తెలిసిందే. గత నెలలో కాలేయ సంబంధిత రోగంతో బాధపడుతున్న దత్ భార్య మాన్యతకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇదేమి న్యాయం: ఉద్ధవ్‌ఠాక్రే సాక్షి, ముంబై: 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరచూ పెరోల్ గడువు పొడిగించడంపై శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఘాటుగా స్పందించారు. ‘మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్, కర్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఇంతవరకు నేరం రుజువు కాలేదు. కనీసం వీరిపై విచారణ కూడా ప్రారంభం కాలేదు. అయినా వారు గత ఐదేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నారు. కానీ సంజయ్ దత్‌పై నేరం రుజువయ్యాక యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ తరచూ పెరోల్‌పై ఎలా విడుదల చేస్తున్నార’ని పార్టీ అధికార దినపత్రిక సామ్నాలో తీవ్ర విమర్శ లు చేశారు. నేరస్తుడు నేరస్తుడే, వారిని కులం, మతం అనే భేదంతో చూడవద్దని, న్యాయం అందరికీ సమానంగా జరిగేలా చూడాలని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్‌ను జైలు సూపరింటెండెంట్ నాలుగు పర్యాయాలు పెరోల్‌పై విడుదల చేశారు. ప్రభుత్వం అండలేనిదే జైలు అధికారులు అలా విడుదల చేయడానికి సాహసించరని వ్యాఖ్యానించారు. దత్‌కు ఒక రకమైన న్యాయం, ప్రజ్ఞాసింగ్, పురోహిత్లకి మరో రకమైన న్యాయమా..? అని నిలదీశారు. ఇదిలాఉండగా ముస్లిం యువకులను అనవసరంగా వేధించవద్దని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ మండిపడ్డారు. ప్రజ్ఞాసింగ్, పురోహిత్ల సంగతేంటి..? వీరి తరఫున వాదించేదెవరూ...? అని ఉద్ధవ్‌ఠాక్రే నిలదీశారు. నిబంధనల ప్రకారమే పెరోల్: సీఎం ముంబై: 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజయ్ దత్‌కు పెరోల్ పొడిగింపును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమర్థించారు. అంతా చట్ట ప్రకారం జరిగిందని, ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని చవాన్ బుధవారం మీడియాకు తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదని వివరించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న భార్య మాన్యతను చూసుకునేందుకు మరో నెల రోజుల పాటు పెరోల్ పొడిగించాలని సంజయ్ దత్ పెట్టుకున్న దరఖాస్తుకు పుణే జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ ఆరున పెరోల్‌పై బయటకు వచ్చిన సంజయ్ దత్ భార్య మాన్యత ఆరోగ్యం సరిగా లేదని మరో నెల రోజులు పాటు పెరోల్‌పై బయటే ఉన్నారు. తాజాగా మళ్లీ దత్‌కు పెరోల్ లభించడంపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి. కాగా, యెరవాడ జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని బాంబే హైకోర్టులో మంగళవారం దాఖలు చేసిన పిల్ ఈ నెల 25న విచారణకు రానుంది. -
సంజయ్‌దత్ పెరోల్ మరో నెల పొడిగింపు
పుణే : ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజ య్‌దత్ పెరోల్‌ను జిల్లా అధికారులు మరో నెల రోజులు పొడిగించారు. తన భార్య మాన్యత అనారోగ్యం కారణంగా తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలన్న దత్ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారు. అక్రమ ఆయుధాలు కలిగియున్నాడన్న నేరంపై శిక్ష అనుభవిస్తున్న దత్ ఈ నెల 21న యెరవాడ జైలుకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన పెరోల్‌ను మార్చి 21వ తేదీ వరకు డివిజినల్ కమిషనర్ కార్యాలయం పొడిగించింది. ఐదేళ్ల జైలు శిక్ష పడిన దత్‌కు తన భార్య అనారోగ్యంపై ముంబై పోలీసుల నుంచి అందిన నివేదిక మేరకు పెరోల్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది సంజ య్దత్కు ఇది చివరి పెరోల్ సెలవు అని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ 6న మొదటిసారి సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరైనప్పుడు భారీ ఎత్తున నిరసనలు ఎదురు కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం జనవరిలో దత్ పెరోల్‌ను మరోనెల పొడిగించింది. ఐదేళ్ల జైలు శిక్షలో ఇప్పటికే దత్ 18 నెలలు జైలు ఉన్నాడు. మిగిలిన 42 నెలలు అతడు శిక్షను అనుభవించాల్సి ఉంది.